విధినే ఎదిరించిన ధీరత్వం – నరేందర్

కన్నీటి చారల్లో కారిపోయిన బాల్యం అతనిది. బాధలు మరియు బాధ్యతల మధ్య వలిగిపోయిన జీవితాన్ని నిటారుగా నిలబెట్టుకున్న పట్టుదల అతనిది. అడుగడుగునా అవరోధమై నిలిచిన విధిని అవలీలగా ధిక్కరించి నడిచిన ధీరత్వం అతనిది. వరంగల్ జిల్లా మారుమూల పల్లెలో పుట్టి, నిజామాబాద్ జిల్లాలో పసితనమంతా పనిలోనే మునిగిపోయిన నరేందర్… చదువు సాయంతో ఏటికి ఎదురీదిన సాహసి, లేత చేతుల్తో సోడాలమ్మి, పసిపాదాల్తో ఊరూరూ తిరిగి పాలూ, పెరుగు అమ్మి, కడుపు మాడ్చుకుని అమ్మ చేసిన కమ్మని ఇడ్లీలు అమ్మి కుటుంబాన్ని నిలబెట్టి, ఇవాళ తహసీల్దారుగా తలెత్తుకు నిలబడగలిగేలా ఎదగడం సాహసం కాక ఇంకేమవుతుంది. బాల్యమంతా కష్టాల కొలిమిలో మగ్గిపోయిన నరేందర్ జీవన పోరాటంలో చదువే ఆయుధం అయ్యింది, స్కూలు దశలోనే ఆగిపోయిన చదువుతో నిరాశ చెందకుండా డా. బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ చేసి, ఆ తరువాత పైచదువులు చదివిన నరేందర్ జీవితంలో ఎన్నో మలుపులు, ఎన్నెన్నో మజిలీలు. ప్రతీ మలుపులో తన కృషి, పట్టుదల, పుట్టెడు శ్రమతో జీవితాన్ని మలుచుకుని తన సొంత జిల్లాలోని డిప్యూటీ తహసీల్దారుగా ఎదిగిన నరేందర్‌ను చూసి తన ఊరు మురిసిపోతోంది. ఒకప్పుడు చీదరించుకున్న వాళ్ళే – ‘నింగి కెగిరితే విబిడాశ్చర్యంతో వీరు…’ అన్నట్టుగా అవాక్కవుతున్నారు. తన కష్టాలు తీరే రోజు కోసం కళ్ళల్లో వత్తులేసుకుని ఎదురుచూసే తల్లికి… ఉద్యోగం వచ్చిందని ఫోన్ చేసి చెప్పడానికి జేబులో ఒక్క రూపాయి కూడా లేక విలవిల్లాడిన క్షణాన్ని ఇప్పటికీ గుర్తుచేసుకుని తల్లడిల్లిపోయే నరేందర్ అవమానాల చీకటి పొరలను అక్షరాల దివిటీల్తో ఎలా తరిమేశాడో ఆయన మాటల్లోనే వినండి …
Media Attributions
- narendar