పోటెత్తే అలల మధ్య నిజమైన కలలు – చింతల రాంబాయ్
ఇది నలభై ఐదేళ్ళ రాంబాయ్ కథ. చదువుకోవాల్సిన సమయంలో ఒక మహిళ సమాజ వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాల్సి వచ్చిందో, అత్యంత విషాదాన్ని పంటి బిగువున భరించి, చదువుకుని, కుటుంబాన్ని మోసి తానెలా నిలిచిందో చెప్పే కథ. అక్షరాలను నిచ్చెనమెట్లుగా చేసుకుని, ఒంటిచేత్తో పిల్లల భారాన్ని మోస్తూ భర్త కన్న కలలను ఎలా నిజం చేసిందో చెప్పే గాథ… ప్రతి మనిషికీ స్ఫూర్తిదాయకమైన కథ రాంబాయ్ జీవితం. ఆమె జీవన గమనంలోని విషాలూ, విజయాలూ…
చింతల రాంబాయ్… హైదరాబాద్‌లో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి ముతమల్ల పెద్దయ్య. 7వ తరగతి చదువుకున్న ఈయన ఏపీ ట్రాన్స్‌కోలో అటెంఘర్గా పనిచేసి రిటైరయ్యారు. అమ్మ చదువుకోలేదు.తమ్ముళ్ళు, చెల్లెళ్ళు టెంత్దాకా చదివారు.
రాంబాయ్ ఇంటికి పెద్ద కూతురు. ఇంట్లో ఎంతో గారాబం చేసేవారు.హైదరాబాద్‌లోని హోలీ మేరీ హైస్కూల్(ఖైరతాబాద్)లో ఫోర్త్ క్లాస్ దాకా చదివింది. తర్వాత తండ్రికి ఖమ్మం జిల్లా పాల్వంచకు బదిలీ కావడంతో చదువుకూడా పాల్వంచ చేరింది. సెవెన్త్ పాసయింది. చదువుకు కష్టాలు మొదలయ్యాయి. పెదనాన్న రంగప్రవేశం చేశాడు. ‘అడపిల్లకు పెద్ద చదువులేంటి?మొగుడికి ఉత్తరం ముక్క రాయడం వస్తేచాలు… ఇక ఆపేయండి’ అంటూ‘మను’ చట్టంలోని ఆర్డర్ జారీ చేశాడు. రామాయణంలో లక్ష్మణుడి లాంటి రాంబాయ్ తండ్రి సరేనన్నాడు. రాంబాయికి దుఃఖమొక్కటే తక్కువ. ఎంతో ఆసక్తిఉన్నా చదువు మానేసి ఇంట్లో కూర్చోవడమా? కానీ తండ్రే వద్దన్నాక తనతరపున ఎవరుంటారు. ఇక ఇంతే అనుకుంది. కానీ అదృష్టం తలుపుతట్టింది.నిరక్షరాస్యురాలైన తల్లి అండగా నిల్చింది. ‘రాంబాయ్ చదవాల్సిందేనన్నది.భర్తతో పోరాడింది. గాడి తప్పిన రాంబాయ్ చదువు మళ్ళీ పట్టాలెక్కింది. – రాంబాయ్ జీవితంలో ఇది మొదటి విజయం.
టెంత్దాకా రాంబాయ్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేదు. టెంత్ చదువుతుండగానే చింతల గోపాలరావుతో ఎంగేజ్మెంట్, టెంత్ పరీక్షలు కాగానే మారేజ్. అలా పెళ్ళయిన రాంబాయ్ ఖైరతాబాద్‌లోని అత్తగారింట్లో అడుగుపెట్టింది. పెళ్ళయినా చదువుకోవాలనుకుంది. కానీ అత్తగారింటి నుంచి పర్మిషన్ లేదు. భర్తను ఒప్పించగలిగింది కానీ దగ్గర్లో కాలేజీలు లేవు. చదువుకు బ్రేక్ పడింది.
కొత్త కాపురం… అలల్లేని పడవ ప్రయాణంలా హాయిగా సాగుతున్నది.ఆర్థిక సమస్యలున్నా ఇద్దరి మధ్యా అవగాహన సమస్యను చిన్నదిగా చేసింది. అత్తగారింట్లో అంతా భర్త సంపాదనపైనే ఆధారం. సర్దుబాటు చేసుకుని గుట్టుగా కాపురం నెగ్గుకు వచ్చింది. భర్తది చిన్న జీతమే, అయితేనేం పెద్ద మనసు. అనేకఆర్థిక, ఆరోగ్య సమస్యలు, పిల్లల చరువులు, ఫీజుల సమస్యలకు తోడు కుటుంబ భారం… ఏమైతేనేం కష్టం సుఖం కలిసి పంచుకున్న సంసార నావ కులాసాగా సాగుతోంది.
భర్త గోపాలరావుకు తాను టెంత్ ఫెయిలైనా చదువంటే చాలా ఇష్టం, గౌరవం. పిల్లలు చదువులతో బాగా స్థిరపడాలని కలలు కనేవాడు. వారికి మంచి చదువుచెప్పించడానికి తాపత్రయ పడేవారు. పిల్లలు కూడా దానికి తగ్గట్టే ముత్యాల్లామెరిశారు. కూతురు ఇంజనీరింగ్ ఫస్టియర్‌లో, కొడుకు ఇంటర్లో చేరారు.పిల్లల చదువు చూసి రాంబాయ్, గోపాలరావులు మురిసిపోని రోజులేదు.
కాలం ఎప్పుడూ ఒక్కలాగా ఉండదు. పాదరిల్లు లాంటి కాపురంలో కలకలం… గోపాలరావు గుండె జబ్బుతో హాస్పిటల్లో చేరాడు. రాంబాయ్ గుండెచెదిరింది. కలల కాపురం చెదిరింది. గుండె ఆపరేషన్ ఖర్చు భారంతో అమ్మాయి చదువు చెదిరింది. రెండో సంవత్సరం ఇంజనీరింగ్ ఆపేయాల్సి వచ్చింది. రాంబాయ్ జీవితానికి పెద్ద షాక్ ఇది. విషారం అలలు ఇంతెత్తున లేస్తాయని రాంబాయ్ ఊహించలేదు.
గోపాలరావు మెడికల్ లీవ్ తీసుకుని, పైఅధికారుల పర్మిషన్తో రాంబాయ్ని తనకు బదులుగా అటెండర్ ఉద్యోగానికి పంపించాడు. ఒక భుజం నుంచి మరో భుజం పైకి బాధ్యతలు. మరో మార్గం లేదు. రాంబాయ్ భర్తను కంటికిరెప్పలా చూసుకుంటూ, దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఉద్యోగానికి హాజరవుతోంది. కాలం గడుస్తోంది.
పై అధికారుల గోపాలరావును పరమర్శించడానికి వచ్చినప్పుడు అతనికి అంబేద్కర్ యూనివర్సిటీ గురించి చెప్పారు. టెంత్ దాకా చదివిన రాంబాయ్ని డిగ్రీ చదివిస్తే ఏపీ ట్రాన్స్‌కోలో మరింత మంచి ఉద్యోగానికి ప్రమోషన్ వస్తుందని సూచించారు. అసలే చదువుపై ఆసక్తి, ఆపై భార్యనుమంచి పొజిషన్లో చూడవచ్చన్న ఆశా… గోపాలరావు సరేనన్నాడు. రాంబాయ్ని ప్రోత్సహించాడు.తాను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాక భార్యమంచి ఉద్యోగంలో స్థిరపడాలని, దానికి తగిన క్వాలిఫికేషన్ పెంచుకోవాలని రాంబాయ్ను ఎంకరేజ్చేశాడు. రాంబాయ్ సరేనన్నది. భర్త అనారోగ్యాన్ని,చెదురుతున్న కాపురాన్ని, మనసునిండా ఉన్న విషాదాన్ని పక్కకు పెట్టి అంబేద్కర్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ఎగ్జామ్కు ప్రిపేర్ అయింది. పాసవుతానా లేదా అన్న అనుమానంతోనే పరీక్ష రాసింది. కష్టం ఫలించింది. అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీకి దారి ఏర్పడింది. ఈ ఆనందాన్ని భర్తతో, పిల్లలతో పంచుకున్నది.అందరూ అభినందించారు.
ఇక డిగ్రీ చదువు మొదలయ్యింది. ఉద్యోగం, పిల్లల బాధ్యతలు, భర్త అలనాపాలనా, భర్త అనారోగ్యంపై బెంగ… వీటి మధ్య డిగ్రీ ఫస్టియర్‌కు ప్రిపరేషన్, ఆదివారం క్లాసులకు అటెండ్ కావడం, రాత్రిళ్ళు చదవడం – చదువుపై శ్రద్ధ కుదిరేది కాదు. ఎన్నో బాధ్యతలు, బాధలు. భర్త ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది.
ఈ ఘర్షణల మధ్య ఎగ్జామ్స్ సరిగా రాయలేక పోయింది. ఫస్టియర్‌లో ఒక్కసబ్జెక్ట్ మాత్రమే పాసయ్యింది. ఇక తన చదువింతేనని రాంబాయ్ నిరాశపడిపోయింది. ఇది గమనించిన గోపాలరావు ‘నేటి ఓటమి… రేపటి గెలుపు’ అని ధైర్యాన్ని ఇచ్చాడు. ధైర్యాన్ని కూడదీసుకుంటున్న రాంబాయ్ జీవితంలో అత్యంత విషారకరమైన సంఘటన… గోపాలరావు ఇక లేరు. మిన్ను విరిగి మీదపడిన భావన, తోడు వీడిపోయింది. కలల కాపురం కరిగిపోయింది. కొడుకు, కూతురు బాధ్యతలు ఇక ఒంటిచేత్తో మోయాలి. దానికి కావల్సినధైర్యాన్నీ పట్టుదలనూ ఇచ్చింది భర్త ఆఖరిమాట ‘నేటి ఓటమి… రేపటిగెలుపు….’
రాంబాయ్ నడుం బిగించింది. భర్త కలలను నిజం చేయాలనుకుంది. తాను మంచి పొజిషన్లోకి రావాలి. భర్త ఊహించినట్టు పిల్లలు బాగా స్థిరపడేట్టుచేయాలి. ఆమె సంకల్పానికి పిల్లలు, సహోద్యోగులు, పై అధికారులు, అంబేద్కర్ యూనివర్సిటీ కౌన్సెలర్లు, లెక్చరర్లు అంతా సహకరించారు. రాంబాయ్ సొంతంగా నోట్స్ తయారుచేసుకుని మరీ చదివింది. కష్టం, భర్త ఆశీస్సులు ఫలించాయి. రాంబాయ్ చేతికి డిగ్రీ పట్టా వచ్చింది – రాంబాయ్ జీవితంలో రెండోవిజయం ఇది.
డిగ్రీ పట్టా చూసిన ఆమెకు భర్త గుర్తుకు వచ్చి దుఃఖం కట్టలు తెంచుకుంది. ఆయన బతికి ఉంటే ఎంత ఆనందించేవారో… డిగ్రీ సంపాదించిన ఆనందాన్ని ఆఫీసులో పంచుకుంది. పై అధికారులు డిపార్ట్మెంట్ పరీక్ష రాస్తే ప్రమోషన్ వస్తుందని చెప్పారు.ఆ ఘడియ రానే వచ్చింది. డిపార్ట్మెంట్ పరీక్షలొచ్చాయి. పై అధికారుల సూచనలతో ఆ పరీక్షలు రాసింది. అంబేద్కర్ యూనివర్సిటీ ఇచ్చిన విద్య ఎంతో ఉపయోగపడింది. ఇంకేం – ఫలితం ఆమె పక్షాన వచ్చింది. తనను తానే నమ్మలేకపోయింది. అయినా అది నిజం, రాంబాయ్కి లోయర్ డివిజన్ క్లర్క్(ఎల్డీసీ)గా ప్రమోషన్ వచ్చింది.
రాంబాయ్ జీవితంలో మరో విజయం
రాంబాయ్ ఈ తీపి వార్తతో అంబేద్కర్ స్టడీ సెంటర్‌కు వెళ్ళి అక్కడి లెక్చరర్లతో ఆనందాన్ని పంచుకుంది. స్వీట్లు పంచి కృతజ్ఞతలు చెప్పుకుంది. వారి అభినందనలు అందుకుంది. అందరి అభినందనలు, ఆదరాభిమానాల మధ్య ఎల్డీసీగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తోంది. మళ్ళీ డిపార్ట్మెంట్ పరీక్షలొచ్చాయి. ఈసారి ఆత్మవిశ్వాసంతో రాసింది. విజయం సాధించింది. మళ్ళీ ప్రమోషన్, మరోసారి అభినందనల వెల్లువ. రాంబాయ్, బీఎ ఇప్పుడు అప్పర్ డివిజన్ క్లర్క్(యూడిసీ)… ఇది ఆమె ఖాతాలో మరో విజయం.
భర్త కోరుకున్నట్లే మంచి పాజిషన్‌కు చేరుకుంది. ఆనందం పంచుకొనడానికి ఆయన లేరు, అదొక్కటే మనసును కోసే ఆలోచన.
కూతురుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో పెళ్ళి జరిపించింది. అప్పుడు వారిద్దరూ దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డారు. రాంబాయ్ తన విజయం వెనుక అంబేద్కర్ యూనివర్సిటీ సాయం ఉందని కృతజ్ఞతగా చెబుతోంది. ఇప్పుడామె పీజీ చేసే ప్రయత్నంలో ఉంది. ‘నేటి ఓటమే… రేపటి గెలుపు’ అన్న భర్తమాట గుర్తుకు రాగానే చెమర్చే కళ్ళతో ఇలా చెబుతోంది.
‘సమాజానికి విద్యకావాలి. ముఖ్యంగా స్త్రీకి. చదువు సాయంతో మహిళ ఎన్ని లక్ష్యాలనైనా జయిస్తుంది. ఎన్నిసమస్యలనైనా అధిగమిస్తుంది. అందుకే స్త్రీకి చదువు కావాలి.’
***
Media Attributions
- Rambai Photograph from DrBRAOU
చింతల రాంబాయ్