"

26 అంబేద్కర్ పై ప్రసంగం

బేర్లిన్ లో ప్రసంగం అంబేద్కర్ జయంతి రోజు… ఆయన గురించి మాట్లాడటానికి విద్యార్థులందరినీ ఆహ్వానించారు. పార్టిసిపేట్ చేయాలనుకున్నవారి పేర్లివ్వమన్నారు. కానీ మేం ఇవ్వలేదు. అప్పటికే పరీక్షలువస్తున్నాయి. సెమినార్ జరుగుతుంటే మేము వెళ్ళాం. అంబేద్కర్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ అంతా ఉన్నారు. అక్కడున్న వాళ్ళంతా ఆయన విజయాలూ, గొప్పతనాన్ని గురించే మాట్లాడుతున్నారు. వారంతా అగ్రకులాల వాళ్ళు. ఆయన చేరుకున్న ఎత్తుల గురించే మాట్లాడుతున్నారు. ఆయన జీవితంలో ఘర్షణ, అవమానం గురించి ప్రస్తావించక పోవడం నాకు సమంజసంగా అనిపించలేదు.అయినా అంబేద్కర్ తండ్రి లాంటి వారు. నాలాంటి ఎన్నో దళిత జీవితాలకు ఆయన మార్గదర్శకుడు. ఆయన గురించి నేను మాట్లాడకపోవడం ఏమిటని… వేదికపైకి వెళ్ళాను. ఐదు నిమిషాల ప్రసంగం. ఇరవై నిమిషాలకు చేరింది. ఇదంతా అనుకోకుండా జరిగింది. అంబేద్కర్, తన చుట్టూ ఉన్న చీకట్లను ఛేధించుకుని ఎలా. ఎదిగాడో … నా సొంత అనుబవాని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌గా 20 నిమిషాల స్పీచ్. ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. అందరూ అభినందించారు. బీసీజే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. ఉస్మానియా, తెలుగు యూనివర్సిటీలలో సీట్లు వచ్చాయి. ఉస్మానియాలో చేరాను. 1997లో పూర్తయింది. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఎంఏలో చేరాను. మళ్ళీ ఓపెన్ వర్సిటీలో అడుగుపెట్టాను. చదవాలనే ఉద్దేశమే ఉంది కానీ ఏం చదవాలన్న గైడెన్స్ లేదు. ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో చేరాను. ఎడ్యుకేషన్కు సంబంధించి నాకు నేనే గైడ్.

రచయితగా

బీసీజేలో ఉన్నప్పుడు మొదటిసారిగా కె.జి.సత్యమూర్తి గారి ‘ఏకలవ్య’ పత్రికలో ‘ఉతికి అరేస్తా..’ అన్న కవిత అచ్చయింది. అదే సమయంలో ‘ఉస్మానియా దళిత దండోరా’ అనే సంకలనంలో ‘దళిత సామ్రాజ్యం’ అచ్ఛయ్యింది. రైటర్ గా నాకు గుర్తింపు తెచ్చిందది. డాక్టర్ నాగప్పగారి సుందర్రాజు (సెంట్రల్ యూనివర్సిటీ) చిన్న ప్రకటన ఇచ్చారు. మాదిగ కులాల రచయితలు రచనలు పంపమని ప్రకటన అది. నేను వారికి పంపితే అక్కడ నుంచి నాకు నాలుగు పేజీల ఉత్తరం వచ్చింది. నిజానికి రచనలు వెనకి వచ్చాయనే అనుకున్నాను. కానీ, అభినంద లేఖ అది. నేను బాగా రాశానంటూ ప్రోత్సహించారు. సార్వజనీన సాహిత్యం నుంచి స్వానుభవంలోంచి వచ్చిన కులపర సాహిత్యం వైపు మరల్చిన సంఘటన అది. ఆ తర్వాత క్రమంలో ‘మాదిగసాహిత్య వేదికకు ఉపాధ్యాక్షురాలినయ్యాను. ఒక వైపు చదువు, మరో వైపు రచయితగా పేరు, దానితో పాటు ఆర్థికంగా మెరుగుపడడం… జీవితం ఒక గాడితో పడుతునట్లు అనిపించింది.

“నేను ఆర్ధికంగా స్థిరపడినా, సామాజికంగా నేను ఈ స్థాయిలో ఉన్నా దానికి అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ ఇచ్చిన డిగ్రీయే కారణం. అది ఇచ్చిన ఆత్మవిశ్వాసం కారణం. నేను ఎల్ఎల్ఎం పూర్తిచేసి ‘లా’లోనే పీహెచ్ డీ చేయాలనేది నా లక్ష్యం. అక్షరం ఏ విధంగా నమ్మకం ఇస్తుందో నా జీవితమే సాక్ష్యం.”

 

లాయర్  కావాలని 

ఎంఏ చదువుతుండగా శ్రీలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ మూతపడింది. చదువుకున్నా ఏం
ఉద్యోగం చేయాలో ఇంకా తెలియడం లేదు. గ్రూపు వన్ రాశా. ఫస్ట్ టైమ్ పోయింది. ఆ తర్వాత రాసినప్పుడు ఇంటర్వ్యూ దారా వెళ్ళాను. కానీ రెండు మార్కుల్లో పోయింది. ఇదే సమయంలో తప్పుచేసిన డాక్టర్లపై చర్య తీసుకోవచ్చునన్న వర్గం వచ్చింది. అప్పుడే నా మనసును కలిచి వేసిన పాత సంఘటన జ్ఞాపకం వచ్చింది. నేను పనిచేసిన హాస్పిటల్లో డెలివరీ టైమ్ పూర్తికాక ముందే ఆపరేషన్ చేయడం, శిశువు చనిపోవడం, తల్లి హృదయ వేదన, అంతులేని దుఃఖం ఆమెది. చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయత నాది. ఎలాగైనా ఇలాంటి సంఘటనలు ఎదిరించాలని పించింది. దానికి ‘లా’ చేయడమే మార్గం అనుకున్నాను. లాయర్ అవడమే నా లక్ష్యం అనుకున్నాను. నిస్సహాయంగా తలవంచుకుని కాకుండా… వ్యక్తిగా నేను నిలబడాలంటే ‘లాయర్’ కావాలనుకున్నాను. నిజానికి అప్పటికే ‘లా’ ఎంట్రన్స్ రాశాను. కానీ, డబ్బులు లేక జాయిన్ కాలేదు. మళ్ళీ రాశా. మళ్ళీ సీటు వచ్చింది. పదాల రామినేజ్జీ కాలేజీలో పుస్తకాలు ఫ్రీగా ఇస్తారని అక్కడ చేరాను. 2005 కల్లా ‘లా’ అయిపోయింది. ఇప్పుడు ఎల్ఎల్ఎమ్ చేస్తున్నాను. త్వరలో అయిపోనుంది.
ఈ క్రమంలో ఎంఏ పూర్తి చేయలేక పోయాను. ఎల్ఎల్బీలో చేరడానికి వెళ్ళినప్పుడు నా దగ్గర 2.50 రూపాయ లున్నాయి. శంకర్ గారి సహకారంతో, కలిపి ఆర్థిక సాయం అందించడంతో ఎల్ఎల్‌బీలో చేరగలిగాను. నా ‘లాయర్’ కల అలా నెరవేరింది. చిన్నవాళ్ళ లోనే పెద్ద మనసుంటుందని నేను అప్పుడు తెల్సుకోగలిగాను.

 ప్రకృతి ఎన్విరాన్ మెంట్లోకి …

లక్ష్మి మోటర్ పంప్సెట్లో పిఆర్వో, కేసరీ బిజినెస్ మీడియా పత్రికలో జర్నలిస్ట్గా పనిచేశాను. జర్నలిస్ట్ వృత్తి ఆర్థికంగా పెద్దగా కలసి రాలేదు. దానితో నాకిష్టమైన ‘రిపోర్టింగ్’ నుంచి వైదొలగాల్సి వచ్చింది. అసలే ఆర్థిక ఇబ్బందులు. ఎల్ఎల్‌బీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు “ప్రకృతి” ఎన్విరాన్మెంట్ సొసైటీలో చేరాను. నాలో చురుకుదనం, బెరుకులేనితనం వారిని ఆకట్టుకున్నాయి. కానీ నెలకు వెయ్యి రూపాయలే జీతం. ఆర్థిక పరిస్థితి మళ్ళీ మొదటికి. నా జర్నలిస్ట్ టాలెంట్ ఉపయోగించి వారికి మూడున్నర లక్షల వ్యాపారం చేయగలిగాను. అంతే ఆరు నెలలు తిరిగేలోగా ఐదు వేల జీతం, సెల్ల్ఫోనే, కన్వేయన్స్ అన్నీ ఇచ్చారు. శ్రమకు తగిన ఫలితం అది. తర్వాత అనేక ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేయడంతో మంచి పేరు వచ్చింది. దానితో శాలరీ పెంచుతూ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్(సెవీఓ)గా ప్రమోట్ చేశారు.

కథలు… అవార్డులు

జీవితం అంతా అంతులేని సంఘర్షణ. చాలాసార్లు ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. కానీ పిల్లలు, కుటుంబ బంధాలు అడ్డుపడ్డాయి. నిజానికి నేను ఇంత కష్టపడి చదువుకున్నది కూడా పిల్లల కోసమే. నేను చదువుకుంటే…ఆర్థికంగా స్థిరపడితే పిల్లలను బాగా చదివించవచ్చు. ఈ ఒక్క లక్ష్యంతోనే అక్షరాన్ని దివిటీలా పట్టుకుని కష్టాలను ఈదగలిగాను. ఈ క్రమంలో రైటర్ గా నిలబడగలిగాను. నా ‘మన్నులువ్వ’ కథా సంకలానికి 2004 సుశీలా నారాయణరెడ్డి అవార్డు, దానికే తెలుగు అధికార భాషా సంఘం అవార్డు, చాసో అవార్డులు వచ్చాయి. ‘మన్నుబిడ్డ’ అనే నవల రాశాను. నేను ఆర్థికంగా స్థిరపడినా, సామాజికంగా నేను ఈ స్థాయిలో ఉన్నా దానికి అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ఇచ్చిన డిగ్రీయే మరియు ఆత్మవిశ్వాసం కారణం. నేను ఎల్ఎల్ఎం పూర్తిచేసి ‘లోపనే పిహ్చది చేయాలనేది నాలక్ష్యం. అక్షరం ఏ విధంగా నమ్మకం ఇస్తుందో నా జీవితమే సాక్ష్యం. అందుకే నేను చదవగలిగి నంత కాలం చదువుతూనే ఉంటాను. నా బాధ్యతగా నేను కొంతమందిని అంబేద్కర్ యూనివర్సిటీలో చేర్పించాను. ముగ్గురు అనాథ పిల్లలను నా పిల్లలుగా స్వీకరించి వారి విద్యా, ఆర్థిక విషయంలో బాధ్యతను తీసుకున్నాను. అక్షరం సొంతం చేసుకోవాలంటే ఎంతకష్టమో నాకు తెలుసు. అందుకే ఈ సాయం… వారిని హాస్టల్లో చేర్పించాను. కన్నీరును కలల సాగుకు వాడుకుని నేను చేసిన అక్షర యాత్ర ఇది.

ఉన్నతమైన విద్య అంటే కేవలం మనకు సమాచారాన్ని ఇచ్చేది కాదు. మన జీవితానికి సంబందించిన ఉనికిని తెలిపేది
– రవీంద్రనాథ్ ఠాగోర్

 

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

మేముసైతం... Copyright © 2009 by డా ఘంటా చక్రపాణి is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.