10 పెదనాన్న ఇంటికి…
గుంటూరులో అప్పటికే మా పెదనాన్న స్థిరనివాసం ఏర్పాటుచేసుకున్నారు.మేము ఆయన దగ్గరికి వెళ్ళాము. మా నాన్న నాలుగు చక్రాల బండిపై కూరగాయలు అమ్మి మమ్మల్ని పోషించేవారు. అప్పటికే ధనవంతుల పిల్లలతోనా స్నేహం నడుస్తుండడంతో నాకు మా నాన్న చేసే పని తక్కువగా కనిపించేది. చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే వాడిని. మేము నివాసం ఉండే ప్రాంతంలో అంతా దళితులే. వారంతా రిక్షా తాక్కి ఆటో నడిపి, లేదా కూలి పని చేస్తూ జీవనం గడిపేవారు. వారందరి మధ్యా నేను తిరుగుతున్నా నా స్థితి చెప్పుకోవదానికి సిగ్గు పడేవాణ్ణి. స్నేహితులతో తిరుగుతూనే 1987లో టెన్త్ పూర్తిచేయగలిగాను. అప్పటికి కొంత జ్ఞానం వచ్చింది. అమ్మానాన్నలను వేధించడం తగ్గించాను.
ప్రేమ, వివాహం…
అటో నేర్చుకుని కొంతకాలం అటో నడిపాను.అలాగే బిల్డింగ్‌లకు పెయింట్ చేస్తూ నా ఖర్చులకు సంపాదించుకునే వాడిని. దానితోపాటు ఇంట్లో డబ్బులు కూడా వాడుకునేవాడిని. ‘హీరో చిరంజీవిసిగరెట్ కాల్చాడని నేను సిగరెట్ తాగడం నేర్చుకున్నా’. ఆ తర్వాత హీరోలాగే ప్రేమలో పడ్డాను.ప్రేమించిన అమ్మాయి ‘రమణి’నే పెళ్ళి చేసుకున్నాను. పెద్దవాళ్ళే పెళ్ళి చేశారు. 1992లో మాకుతోడుగా ఆడశిశువు ఈ లోకంలోకి వచ్చింది. నాన్న జబ్బున పడ్డారు. అమ్మా, నాన్న, నేను, రమణి, పాప… కుటుంబం పెరిగింది.రాబడి తగ్గిపోయింది. ఖర్చులు పెరిగాయి. ఆర్థిక సమస్యలు ఇంతకు ముందూ నాకు తెలుసు… కానీ అవి జల్సాలకు. ఇప్పటి ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలకు సంబంధించినవి. ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి నేను ఎంచుకున్న మార్గం నేరాలు. ఇదీ స్నేహితుల ద్వారానే.
22 మంది మరణం…
నేను చేసిన ఘోరమైన నేరం వెనుక మరో నేరగా, ప్రేమగాథ ఉంది. అదే ఇప్పటి నా కారాగార వాసానికి కారణమయింది. నా చెల్లెలు ప్రేమలో పడిందని తెలిసిన నేను ఆమె ప్రేమించిన వ్యక్తిని చంపేయాలని నిర్ణయించుకున్నాను. స్నేహితులతో కలిసి ప్లాన్ చేశాను. హత్య చేస్తే వచ్చే ఆర్థిక అవసరాలు,జైలు, బెయిలు లాంటి ఖర్చులు, కుటుంబ పోషణ. వీటన్నింటికీ ముందుగానేడబ్బు సంపాదించి ఆ తర్వాత ‘హత్య’కు ప్లాన్ చేయాలని నేను, నా స్నేహితులునిర్ణయించాం. దాదాపు లక్ష రూపాయలు కావాలని అనుకున్నాం. డబ్బు ఎలా సాధించడం అన్న ఆలోచనతో అన్ని రకాల పేపర్లు తిరిగేసి వివిధ నేరాలను పరిశీలించాం. పెట్రోలుతో బెదిరించి ప్రయాణీకుల దగ్గర డబ్బులు దోచుకున్న సంఘటన పేపర్లో చూశాం. మేమూ అదే మార్గం ఎంచుకున్నాం. నేను, నా స్నేహితుడు విజయవర్ధనరావు కలిసి బయలుదేరాం,నిజానికి నలుగురం వెళ్ళాలి. కానీ ఇద్దరమే వెళ్ళాం.ఇద్దరం ప్రయాణికుల్లా బస్సు ఎక్కాం, మా దురదృష్టం కొద్దీ 22 మంది అమాయకులు ఆ సంఘటనలో చనిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిడామాలు మీకు తెలిసినవే. మాకు ఉరిశిక్ష పడడమూ, రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రసాదించకపోవడమూ, ఆతర్వాత ఒక అద్భుతం జరిగి ఉరి ఆగిపోవడమూ,జీవిత ఖైదీగా మిగిలిపోవడమూ, మానవతావాదుల కృషి, దేవుని కృప ఫలితం ఇది.
జైల్లో చదువు…
రాజమండ్రి జైల్లో ఖైదీ జీవితం ప్రారంభమయింది. అక్కడే ఓ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న వేదాంత శేషగిరిరావు పరిచయం అయ్యాడు. మా మధ్య స్నేహం పెరిగింది. అతనే చదువుకొమ్మని సలహా ఇచ్చాడు. నాకు చదువు సరిపడదన్నాను. సరిపడకపోతే జీవితమే లేదన్నాడు. నా చేతిలోని బైబిలు చూపించి ఇదే నా జీవిత మార్గదర్శనం అన్నాను. దీనికి మించిన జ్ఞానం లోకంలో లేదని చెప్పాను. ఇదిలా ఉండగా,ఒక సహోదరి ఉత్తరాల ద్వారా పరి చయం అయింది. ఇసుమంత గర్వంలేని కోటీశ్వరురాలామె. ఆమె కూడా చదువు కొమ్మని ప్రోత్సహించింది. కారాగారవాసం పూర్తయ్యేలోగా డిగ్రీ పూర్తి చేయవచ్చునని లెటర్ రాసింది. అప్పటికి డిగ్రీ ప్రయోజనం ఏమిటో నాకుఅర్ధం కాలేదు. కొద్దికాలం అనంతరం శేషగిరి నాకు తెలియకుండా అంబేద్కర్ యూనివర్సిటీ నిర్వహించే డిగ్రీ ఎంట్రన్స్పరీక్ష అప్లికేషన్ పూర్తిచేసి నా వద్దకు తెచ్చి నన్ను సంతకం చేయమన్నాడు. నేను వద్దన్నా బలవంతంగా నాతో సంతకంచేయించి అప్లై చేశాడు. అలా నేను అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థినయ్యాను. ఇది మరో జీవితం.