"

12 డిప్యూటీ కలెక్టరయిన ‘మట్టి’ మనిషి…కట్టా హైమావతి

పొలాలు అమ్మి చదివించారు…

ఇంటర్ వరకూ నేను కాలేజీకి వెళ్ళి చదివాను. నాకు చిన్నతనం నుంచీ చదువంటే ప్రాణం. అక్కచెల్లెళ్ళం నలుగురం చదువుకుంటామంటే నాన్న ఏనాడూ ‘వద్దు’ అనలేదు. ‘మీకు నచ్చిన పని చేయండి’ అన్నది ఆయన సరళి. చాలా మితభాషి. ఆడపిల్లలం ఏం చేసినా నేను మీ వెన్నంటి ఉన్నానన్న భరోసాను మౌనంగానే మాకు అందించారాయన. మా చదువుల కోసం సొంత ఊరును, ఉన్న కొద్ది పొలాన్ని వదులుకుని 1990లో హైదరాబాద్ వచ్చేశారు. వ్యవసాయాన్ని కొంతకాలం కౌలుకిచ్చారు. ఆ తర్వాత మా చదువులకు అవసరపడి ఉన్న పొలాన్ని కూడా నాన్న అమ్మేశారు. తర్వాత మా రెక్కల కష్టమే కుటుంబ పోషణకు ఆధారమైంది. కుటుంబంలోని ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ చదవును కొనసాగించాం. మేం చదువుకోవడం, నాన్న మా కోరికను వద్దనకుండా అనుమతించడం ఊళ్ళో ఎందరికో ఆశ్చర్యంగా ఉండేది. ఎందుకంటే మాలో ఏడవ తరగతి అనగానే అడపిల్ల్ని చదువు మాన్పించేస్తారు. 15 ఏళ్ళకు పెళ్ళిచేసి అత్త వారింటికి పంపేస్తారు. నాన్న వేరే ఊరికి పంపి మరీ మమ్మల్ని చదివించడాన్ని ఎత్తిపొడిచేవారు. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? అంటూ నన్ను అడిగేవారు. పొలాలు అమ్మి పిల్లల్ని చదివిస్తున్నారు. ఇక వాళ్ళ పెళ్ళిళ్ళు చేయగలరా? కట్నం ఇవ్వగలరా? చదివి వాళ్ళేం సాధిస్తారు? ఇలా సాగిపోయేవి వాళ్ళ మాటలు. ఇలా ఎందరో మాటల ‘దాడుల’కు పాల్పడుతున్నా అమ్మా నాన్నలు చెదరలేదు. మా చదువులను చదువెందుకని ఏనాడూ ఆపలేదు. నిరుత్సాహపరచలేదు. ఇంటర్ వరకూ డైరెక్టు స్టూడెంట్నే కానీ పల్లెలో నేను పెరిగిన పరిస్థితులు, ఉన్న పరిసరాలు వేరు. 15 ఏళ్ళకే పెళ్ళి చేసేస్తారు. చదువంటే ప్రాణం పెట్టే నాలో ఇక ఇంటర్తో నా చదువు ఆగిపోతుందేమోనే భయం పట్టుకుంది. ఆ ఊహకే నా గుండెలు పిండేసినట్టు అనిపించింది. పైగా అడపిల్లివి నువ్వేం చేయగలవు? పెళ్ళి చేసుకుని వెళ్ళిపోవాలి అన్న చుట్టాల విసుర్లు నన్ను తీవ్ర అశాంతికి గురిచేశాయి. ఇంకా చెప్పాలంటే నన్నెంతో రెచ్చగొట్టాయి కూడా, అలాంటి మానసిక స్థితిలో నాకు తెలిసిన ఒక అమ్మాయి ‘కాలేజీకి వెళ్ళకుండానే మనం చదువుకునే వీలుంది’ అంటూ అంబేద్కర్ యూనివర్సిటీ గురించి చెప్పింది. అప్పటి వరకూ దాని గురించి నేను వినలేదు. ఆ రోజు నా సంతో – షానికి పట్టవగ్గాలు లేవు. నాకు చిన్నదారి కనిపించింది. దాన్ని ‘రాదారి’గా మలచుకోగలిగే స్వభావం నాలో పుష్కలంగా ఉంది. అలాగే నాకు నచ్చని పని ఎవరు చెప్పినా చేయని మొండితనమూ తక్కువవేమీ లేదు. ఇవి నన్ను నా లక్ష్యం వైపు ప్రయాణించేలా రాటుదేల్చాయి.

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

మేముసైతం... Copyright © 2009 by డా ఘంటా చక్రపాణి is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.