ముందుమాట
విద్యార్థులే స్ఫూర్తిదాతలు
సార్వత్రిక విశ్వవిద్యాలయాల స్థాపన ఉన్నత విద్యారంగంలో ఒక వినూత్న ప్రయోగం, ఈ ప్రయోగం భారతదేశంలో 1982లో ‘ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం’(నేడు డా॥ బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయంగా పిలువబడుతుంది) ఆరంభం కావడం అందరూ హర్షించదగ్గ విషయం. ఆచార్య జి.రాంరెడ్డిగారి విద్యారార్శనికత, పరిమిత వనరులతో ఎక్కువ మంది విద్యార్థులకు ఉన్నత విద్య కల్పించాల్సిన సామాజిక అవశ్యకత, వాటి రాజకీయ వ్యవస్థ సంపూర్ణ మద్దతు ఆంధ్రప్రదేశ్లో ఈ నూతన ప్రక్రియను ‘ఓపెన్ యూనివర్సిటీ’ పేరుతో ప్రారంభించడానికి ప్రధానంగా తోడ్పడ్డాయి. విద్యారంగంలో నూతన వ్యవస్థల స్థాపనలో ఎదురయ్యే ఇబ్బందుల నన్నింటినీ ఈ సంస్థ నిర్మాణంలో కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. విద్యారంగంలో దూరవిద్యా పద్ధతి ఉపయోగంపై తీవ్రమైన అభ్యంతరాలుండేవి. ఈ పద్ధతి ద్వారా నాణ్యమైన విద్యను అందించలేమనే సందేహాలూ ఉండేవి. మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయంగా ఈ పరిమితులన్నింటినీ అరిగమించాల్సిన అవసరం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రావడం ఒక చారిత్రక అవకాశం. ఈ చారిత్రక అవసరాన్ని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చాలా సమర్థవంతంగా నిర్వహించిందని చెప్పడానికి సందేహం లేదు. ఆచార్య జి.రాంరెడ్డి గారి కృషి, పట్టుదల, నాయకత్వం, ఈ భావానికున్న సామాజిక ప్రాధాన్యత, అనేక ఒడిదుడుకులను తట్టుకుని(ఒక దశలో మూసి వేయాలనే తలంపులతో సహా) నిలబడిన ఒక గొప్ప సామాజిక ప్రయోజనం గల విద్యారంగ ప్రయోగంగా చెప్పుకోవచ్చు.
గత 25 సంవత్సరాలకు పైగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేక లక్షల మందికి విద్యావకాశాలు కల్పించడంతో పాటు, దూరవిద్యా పద్ధతికి దేశంలో ప్రామాణికతను కల్పించడంలో కూడా ప్రధానమైన పాత్రను నిర్వహించింది. వ్యక్తిగతంగా నాకు ఇది ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం. ఆచార్య జి.రాంరెడ్డి గారి శిష్యుడిగా నాకు ఈ విశ్వవిద్యాలయంలో పనిచేసే అవకాశం లభించింది. దాదాపు 20 సంవత్సరాలుగా అనేక పదవులలో పనిచేసే అవకాశం కూడా కలిగింది. ఇది గొప్ప అనుభవం, అనుభూతి, నూతన ప్రయోగంలో అన్ని స్థాయిల్లో పాల్గొన్నాననే తృప్తి. ఇంకా ఎంతో చేయాల్సి ఉన్నప్పటికీ, చేసింది తక్కువేమీ కాదనే అభిప్రాయం నాకు ఉంది. ఈ సంపుటిలోని విద్యార్థుల వ్యక్తిగత జీవితంపై ఈ విశ్వవిద్యాలయ ప్రభావాన్ని చదివినప్పుడు ఈ విశ్వవిద్యాలయ కృషికి ఎంతో ఆనందిస్తున్నాను.
సామాన్యంగా విశ్వవిద్యాలయాల గొప్పతనాన్ని అంచనా వేసేటప్పుడు ఆ విశ్వవిద్యాలయంలో చదివిన వారికి ఎన్ని ఉన్నత పదవులు లభించాయి, ఎంత మంది విదేశీ సంస్థల్లో పనిచేస్తున్నారు, ఎంత వేతనాలు పొందుతున్నారన్న విషయాలను చెబుతూ ఉంటారు, అలాకాకుండా ఎంత మంది బీదవారు ఉన్నత విద్యను పొందారనో, ఎంతమంది కూలి వృత్తిని చేసుకుంటున్నవారు, జైళ్ళలో మగ్గేవారు, హోటళ్ళలో పనిచేసేవారు, గృహాలకు అంకితమైన వారు ఉన్నత విద్య ద్వారా తమ జీవితాలను మార్చుకున్నారనే విషయాలను ప్రమాణంగా తీసుకున్నట్లయితే అంబేద్కర్ విశ్వవిద్యాలయం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే విశ్వవిద్యాలయంగా పరిగణించవచ్చని ఈ సంపుటిలోని విద్యార్థుల జీవితానుభవం నుంచి అంచనా వేయడం తప్పు కాదేమో. ఇది అంచనా వేసే వారి విలువలకు సంబంధించిన విషయం కూడా.
ఈ సంపుటిలోని విద్యార్థుల జీవితాలు, సార్వత్రిక విశ్వవిద్యాలయ విద్యకే స్ఫూర్తిదాయకాలని భావిస్తున్నాను. సాంప్రదాయక విద్యా వ్యవస్థలో సాధారణంగా అధ్యాపకులు స్ఫూర్తిదాయకులుగా ఉంటారు(అందరూ కాదనుకోండి), అయితే సార్వత్రిక విద్యలో ఆ అవకాశాలు తక్కువ. అధ్యాపకులతో విద్యార్థులకు ప్రత్యక్ష సంబంధాలు పరిమితం. విద్యార్థి ఆధారితమైన దూరవిద్యలో విద్యార్థులే స్ఫూర్తిదాయకులుగా ఉంటారు. భిన్న నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులకు, సార్వత్రిక విశ్వవిద్యాలయాలు అందించిన విద్య ద్వారా వారి జీవితంలో వచ్చిన మార్పులే దూరవిద్యా సంస్థలకు, విద్యార్థులకు మార్గదర్శకాలు. ఈ సంపుటిలో వివరించిన, ఆగిపోయిన చదువులకు వచ్చిన అవకాశాలు, ఆ చదువులతో మారిన వారి జీవితాలు మట్టిలో మాణిక్యాలుంటాయనడానికి నిదర్శనాలు. పుట్టుకతోనే ఎవరూ గొప్ప వారు కాదనడానికి, నేటి సామాజిక పటంలో ‘ఫెయిల్యూర్’గా భావించబడే వారు కూడా, అవకాశాలు వస్తే ఏ విధంగా రాణిస్తారనేది వాస్తవ జీవితాల నుంచి గుర్తించడానికి ఈ వ్యక్తిగత జీవితాలు, చిత్రణ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు జైలు గోడల మధ్య ఉన్నవారికి, కూలిపని చేసుకునే వారికి, వివాహంతో విద్య ఆగిపోయిన వారికి ఈ విశ్వవిద్యాలయం కల్పించిన అవకాశాలు, వాటిని ఉపయోగించుకుని వారు సాధించిన విజయాలు ఈ విశ్వవిద్యాలయ స్థాపనను సార్థకం చేశాయని అనుకుంటున్నాను.
ఈ విద్యార్థుల జీవిత పాఠాలను అందరికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ విశ్వవిద్యాలయ కృషిని సరైన అంచనా వేయడానికి, ఎక్కువ మంది సరైన అవగాహనతో దూరవిద్యను అభ్యసించడానికి తోడ్పడతాయని భావిస్తున్నాను. అందుకే ఈ కృషిని సామాజిక బాధ్యతగా భావించి చేసిన సామాజిక శాస్త్రవేత్త అయిన డా. ఘంటా చక్రపాణిని, అదేవిధంగా విశ్వవిద్యాలయాన్ని అభినందిస్తున్నాను. ఎక్కువ మందికి జాతీయంగా, అంతర్జాతీయంగా సార్వత్రిక విద్యారంగంలోని వారందరికీ ఈ విషయాలను తెలియజేయడం ఎంతో ఉపయోగకరం. ఇవన్నీ సార్వత్రిక విద్యారంగం మొత్తం గర్వించదగ్గ విషయాలు. అందుకే దీనిని ఇంగ్లీషు, హిందీ భాషలలో కూడా ప్రచురిస్తే లాగుంటుందని భావిస్తున్నాను.
ఈ విశ్వవిద్యాలయం ఇంకా చేయాల్సింది. చేయగలిగింది ఎంతో ఉంది. ఈ విశ్వవిద్యాలయం ఇంకా చేయాల్సింది, చేయగల్గింది ఎంతో ఉన్నప్పటికీ, మంచి పనిని మొదలుపెట్టినందుకు, చేస్తున్నందుకు ఈ కార్యక్రమంతో సంబంధం ఉన్న అందరినీ అభినందిస్తున్నాను. ఈ విశ్వవిద్యాలయంతో దీర్ఘకాలం అనుబంధం గల వ్యక్తిగా, అలాగే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సెంటర్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్ పాలక మండలి సభ్యుడిగానూ ఈ ప్రచురణకు ముందుమాట రాయడానికి అవకాశం కలగడం ఎంతో ఆనందంగా ఉంది. విశ్వవిద్యాలయలు విద్యావకాశాలను మాత్రమే కలిగిస్తాయి. వాటిని ఉపయోగించుకోవడం మన పైననే ఆధారపడి ఉంటుందనే సందేశాన్ని ఈ పుస్తకం నుంచి విద్యార్థులు పొందగలిగితే ఈ ప్రచురణ లక్ష్యం నెరవేరినట్టుగా భావిస్తాను.
వి.యస్.ప్రసాద్
15-1-2009