"

జైలు గోడల మధ్య జీవిత పాఠాలు – చలపతిరావు

చీకటి పడుతోంది. నరసరావుపేట, చిలకలూరిపేట రోడ్డుపై బస్సు దూసుకు పోతోంది. అప్పటిదాకా ప్రయాణికుల్లా కూర్చున్న ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ డబ్బాలతో సీట్లలోంచి లేచారు. దోపిడీకి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో జరిగిన చిన్న పొరపాటుతో 22 ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. ఆ ఇద్దరూ చలపతిరావు, విజయవర్ధవరావు.

***

గుంటూరు జిల్లాకు చెందిన ఆ చలపతిరావే, ఇప్పుడు సాతులూరి ‘చలపతిరావు, ఎంఏ’ అయ్యాడు. ఘోరమైన నేరంతో ఉరికి చేరువయ్యాడు. సుప్రీంకోర్టు శిక్ష ఖాయం చేసింది. కొందరు సరైన శిక్షన్నారు. కొందరు జాలిపడ్డారు. మానవతావాదులు ఉరిపై చర్చలు జరిపారు, మొత్తం మీద ఉరిశిక్ష జీవిత ఖైదుగా మారింది. వెంట్రుక వాసిలో తప్పిపోయిన మృత్యువు. అప్పటి నుంచి పధ్నాలుగేళ్ళు జైలు గోడల మధ్య గడిపాడు. జైలు జీవితం ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్పిందంటున్నాడాయవ. చదువు తప్పి, జీవితం గాడితప్పి, చిన్న చిన్న నేరాలతో జులాయిగా తిరిగి, పెద్ద నేరంచేసి జైలు పాలై బయట ప్రపంచం ఏమిటో తెలియకుండా గడిపే తనకు, అంబేద్కర్ యూనివర్సిటీ విద్యాదానంతో విశాల ప్రపంచాన్ని చూపిందంటున్నారు. యూనివర్సిటీ అందించిన ఉత్సాహంతో, ప్రోత్సాహంతో సోషియాలజీలో ఎంఏ పూర్తిచేసిన చలపతిరావు నేరశాస్త్రంలో పీహెచ్‌డీ చేయాలన్న ధ్యేయంతో ఉన్నాడు.

సాతులూరి చలపతిరావు, ఎంఏ. ఈ పేరు, దాని వెనుక పట్టా చూసినప్పుడల్లా ఆశ్చర్యమూ, ఆనందమూ కలుగుతాయి. ఈ పట్టా వచ్చే నాటికి ఉరిశిక్ష పడేంత నేరమూ, పధ్నాలుగేళ్ళ కారాగారవాసమూ ఉన్నాయి. వాటికి ముందు ఈ పట్టా ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో? ఒక జీవిత ఖైదీగా అజ్ఞానంతో నిండిన నా గతమూ, ఎంఏ సోషియాలజీతో నేను అర్థం చేసుకుంటున్న వర్తమానమూ… అంబేద్కర్ యూనివర్సిటీ వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ మీకు వివరిస్తాను. ఖైదీ కూడా మనిషే. అతనికీ విజ్ఞానం కావాలి, ఖైదీలూ విద్యావంతులు కావాలనే ఉన్నతాశయంలో ఉచిత విద్యను అందిస్తున్న అంబేద్కర్ వర్సిటీకి సవినయంగా నమస్కరిస్తూ నా గురించి చెబుతాను.

Chalapathi Raoచలపతిరావు

 

టెన్త్ ఫెయిల్…

నేను క్రైస్తవ మతాన్ని స్వీకరించిన మాలకులస్తుడిని, గుంటూరు జిల్లాలోని ‘హుస్సేన్ నగర్’ అనే గ్రామం మాది. ఇక్కడే ‘మాలపల్లి’ అనే పేటలో మా నివాసం. నాన్న చినపాములయ్య, అమ్మ కాశమ్మ, మాల మాదిగలమంతా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. మా కుల పెద్ద మా పెదనాన్న పెద పాములయ్య.నేను 3వ తరగతి వరకు నందిగామలోని జర్మన్ హాస్టల్లో, 5వ తరగతి వరకు హుస్సేన్నగర్లో, 6వ తరగతి నుంచి 10 దాకా గుంటూరు జిల్లా నరసరావుపేటలో చదివాను. టెంత్‌దాకా నాకు కుటుంబ పరిస్థితులు తెలియవు. అవసరానికి కావలసిన డబ్బులు తీసుకోవడం, ఇవ్వకపోతే ఏదో పనిచేసి డబ్బులు సంపాదించి ఖర్చులకు వాడుకోవడం. స్నేహితులు, సినిమాలు, షికార్లు… అంతే.అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకపోతే తిండి మానేయడం… అమ్మా నాన్న అప్పోసప్పో చేసి తెచ్చివ్వడం. వాటికోసం వారెంత బాధ పడతారన్న విషయం అప్పట్లో తెలిసేదికాదు. స్నేహితులు, సరదాలు… టెన్త్ ఫెయిల్ అయ్యాను. చదువుపై కోరికా పోయింది. ఇదిలా ఉండగా అనేక మార్పుల మధ్య మా కుటుంబం గుంటూరుకు మారింది.

 

Media Attributions

  • Chalapathi Rao – Photograph by DrBRAOU

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

మేముసైతం... Copyright © 2009 by డా ఘంటా చక్రపాణి is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.