పాలేరు బతుకులో పన్నీటి వాన – జంగయ్య
పాలబుగ్గల జీతగాడా…
పసుల గాసె మొనగాడా
పాలు మరసీ ఎన్నాళ్ళయ్యిందో
కొలువు కుదిరీ ఎన్నేళ్ళయ్యిందో..
– ఇదీ జంగయ్య జీవితపు నేపథ్య గీతం. పాలుగారే ఆరేళ్ళ పసితనంలోనే ‘పసుల మంద’లో పడిన జంగయ్యకు… జీతం, అప్పు జమా ఖర్చుల్లో మిగిలింది పన్నెండేళ్ళ వెట్టిచాకిరీకి తాకట్టుపడ్డ జీవితం. వెట్టి కట్టుబాట్లను ఒక్కొక్కటిగా తెంపేసుకుంటూ చదువు సాయంతో జీవితపు ఒక్కో మెట్టూ ఎక్కి ఎదిగిన జంగయ్య ఇవాళ ఒక విశ్వవిద్యాలయ ఉద్యోగి. రంగారెడ్డి జిల్లాకు చెందిన జంగయ్యను కదిపితే చెమర్చే ఆయన కళ్ళల్లో పశువుల మందలో కరిగిపోయిన బాల్యం కనిపిస్తుంది. ప్రతి మాటలో అచంచల ఆత్మవిశ్వాసంతో ఆయన వేసిన అడుగుల సవ్వడి వినిపిస్తుంటుంది. జీవితంలో పద్దెనిమిదేళ్ళ దాకా పాలేరుగా ఉన్న ఆయన ఇవాళ ఎంఏ పట్టాదారు. బాల్యమంతా చేతిలో ముల్లుగర్రే తప్ప పలకా బలపం పట్టి ఎరుగని జంగయ్య డా. బి.ఆర్.అంబేద్కర్ పార్వత్రిక విశ్వవిద్యాలయంలో బిఏ, ఎంఏ పూర్తిచేసి ఒక సామాజిక శాస్త్రవేత్తగానో, సంఘ సేవకుడిగానో మారి తన ఊరిలో తనలాంటి వారి బతుకు రాత మార్చాలని కలలు కంటున్నాడు. అడుగడుగునా అవమానాల పాలై తిట్లు, చీత్కారాలు, కర్ర దెబ్బలకు కమిలిపోయిన బాల్యాన్నీ, బాధల్నీ తడుముకుంటూనే చదువు నేర్పిన సాహసంతో తన కలల్ని సాకారం చేసుకుంటున్నాడు. ఎండల్లో ఎండిపోయి, వానల్లో తడిసిపోయి పల్లెదాటి, పల్లేర్లు రాటి, తుమ్మచెట్ల ముళ్ళలాటలు దాటి, అక్షరం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో ఆ ఊరికి ఒక కొత్త దారి చూపిన జంగయ్య ప్రస్థానాన్ని ఆయన మాటల్లోనే విందాం.
మా అమ్మా నాన్న లక్ష్మీ, బీరయ్యలు. మాది రంగారెడ్డి జిల్లా కీసరమండలం, చీర్యాల గ్రామం. మా అమ్మా నాన్నలకు ఎనిమిది మందిమి పుట్టాం.ఇద్దరు దుర్భర పేదరికానికి బలయ్యారు. అరుగురం మిగిలాం. నేను నాలుగోవాడిని. పేరుకు రాజధాని పక్కనే కానీ, అక్షరానికి నోచుకోని ఊరు మాది. ఇక నా చిన్నప్పుడు చదువనేదే ఎరుగం. ఎందుకంటే ఐతకడానికి ‘జీతం’ చేయడమేసరిపోయేది. జీతమంటే నెలనెలా డబ్బులొచ్చే ఉద్యోగం కాదు. వెట్టి! మేకలు,గొర్రెల దగ్గర కావలి. మా నాయన అదే చేసేవారు, మా అన్న అదే చేసేవాడు… నాదీ అదే పని. అరేళ్ళకే గొంగడి వేసుకుని, కాళ్ళకు చెప్పులు లేకుండా పొలాలు, కంచెల వెంబడి పశువులను మేపే పనికి కుదిరాను. సంవత్సరానికి యాభై రూపాయల జీతం… పటేల్ దగ్గర. ఇంతా చేసి జీతం మిగిలిందేమీలేదు. ఇల్లు గడపడానికి అప్పులు, అప్పులు తీర్చడానికి చాకిరీ.. వెట్టిచాకిరి. ఇదంతా బతుకు గడవడానికే. మా అయ్య వెనుకనే అన్న.. ఆయన వెనుక నేనూ, నా తమ్ముడూ అంతా జీతగాళ్ళమే. చారెడు చెక్క భూమి లేదు.వ్యవసాయం లేదు. అయితే జీతం… లేకుంటే కూలి. అరేళ్ళ వయస్సులో జీతానికి కుదిరిన నేను 18 ఏళ్ళదాకా… అంటే పన్నెండేళ్ళు పటేళ్ళ దగ్గర జీతానికే పనిచేశాను. దుర్భరమైన పని… కాళ్ళకు చెప్పులు, నెత్తిన గొంగడి.. పనికి పెట్టుకున్న పటేళ్ళే ఇవ్వాలి… అవి అడిగే ధైర్యం మాకు లేదు…ఇచ్చే కనికరం వాళ్ళకు లేదు. ఎండైనా, వానైనా ఉత్తకాళ్ళతోనే, ఒంటిపై సరిగ్గాబట్టలు ఉండేవేకావు. బాల్యం సగం చిరుగులే. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే పుట్టెడు దారిద్ర్యం, సగం ఎండిన డొక్క, సగం నిండిన కడుపు చదువుకు ఎలా దూరం చేశాయో చెప్పడానికే. బతకడానికే చాకిరీ చేసే జీవితాల్లో చదువు గురించి ఆలోచన రావడమే ఒక సాహసం.
Media Attributions
- జంగయ్య Photograph from DrBRAOU
జంగయ్య