ఫస్ట్ నుంచి టెన్త్ దాకా హాస్టల్లో ఉండి చదువుకున్నాను. అమ్మ రావడానికి లేదు. నాన్న మాత్రమే వచ్చేవారు. ఆయన వస్తూ వస్తూ అమ్మ జ్ఞాపకాలు మోసుకొచ్చేవారు. అమ్మ ఒడిలో ఉండాల్సిన నేను అమ్మ లేకుండా… కన్నీళ్ళతో… అయితే హాస్టల్ జీవితం నాకు స్నేహితులను ఇచ్చింది. ఒంటరితనాన్ని దూరం చేసింది. బాధలు, కష్టాలు, పేదరికం మధ్య వెన్నెలలా వెలిగేది స్నేహమే. ఇదే నా జీవితాన్ని నిలిపింది. గ్రూప్ యాక్టివిటీస్, పాటలు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ స్నేహితులతో జీవితం పెనవేసుకుపోయింది. నాకు శాపాన్నిచ్చిన దేవుడు నాకు చేసిన ఫేవర్ ఏమిటంటే నా చుట్టూ ఉన్న వాళ్ళకు గొప్ప మనసు ఇవ్వడం. నా జీవితంలో ప్రతి అడుగు స్నేహితుల చేయి పట్టుకునే వేశాను. చిన్నప్పటి నుంచీ గొప్ప వాళ్ళ జీవితానికి సంబంధించిన పుస్తకాలు చదివేదాన్ని. నాన్న నాకు డబ్బులు ఇవ్వలేకపోయినా గాంధీ, నెహ్రూ, షేక్స్పియర్ లాంటి మహానుభావుల పుస్తకాలు మాత్రం ఇచ్చారు. అవే కరదీపికలు. వేసవి సెలవులు వచ్చినా ఇంటికి వెళ్ళేదాన్ని కాదు. నాన్న కూడా రమ్మనే వారు కాదు. అమ్మతో కమ్యూనికేషన్ పోయింది. కన్నీటి పొరల వెనుక మసక మసగ్గా కనిపించే అమ్మ రూపం, జ్ఞాపకాలు క్రమక్రమంగా కనుమరుగవుతున్నాయి. అనుబంధాలు పేదరికం ముందు ఎలా తలవంచుతాయో తెలిసింది. బాధలో ఆనందాన్ని అగ్నిలో మాధుర్యాన్ని పొందడం నేర్చుకున్నాను. వేసవి సెలవుల్లో హాస్టల్ సూపరింటెండెంట్ వాళ్ళతోనే ఉండి టైపింగ్ ప్రాక్టీస్ చేసేదాన్ని. తర్వాత కష్టకాలంలో అదే ఉపయోగపడింది.
పెళ్ళయింది… చదువు ఆగింది
నేను పడిన శ్రమ ఫలించింది. నాన్న కోరిక నెరవేరింది. టెన్త్ ఫస్ట్ క్లాసులోపాసయ్యాను. నాకింకా చదువుకోవాలన్న ఆశ. నాన్నకు మళ్ళీ ఉద్యోగం రావడం నా ఆశలకు ఊపిరిపోసింది. ఆంధ్ర బాలికా జూనియర్ కాలేజీలో ఇంటర్ (బ్రెపిసి)లో సీటు వచ్చింది. నేను, నా ఫ్రెండ్ ‘బాల’ వరంగల్‌లో ఉమెన్స్ హాస్టల్లో చేరాం. డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారి భార్య శోభగారు ఉచితంగా నిర్వహించే హాస్టల్ అది. నాన్నకు మహబూబాబాద్‌లో ఉద్యోగం. అందుకే నేను హాస్టల్లో చేరాలని నిర్ణయించుకున్నాను. నాన్నకు అది నచ్చలేదు. నన్ను ఆంధ్ర బాలికా కాలేజ్ నుంచి తీసేసి ఒకేషనల్ పాలిటెక్నిక్‌లో జాయిన్ చేశారు. అది రెండేళ్ళయితే టీచర్స్ ట్రెయినింగ్తో సమానం. టీచర్ ఉద్యోగం కోసం నాన్న చేర్పించాడు. కానీ తర్వాత సమానం కాదన్నారు. అది కాస్తా వృథా అయింది. కోర్సయితే పూర్తి చేయగలిగాను. నాన్న నాకు పెళ్ళి చేయాలని నిశ్చయించాడు. ఈ విషయంలో నాకూ, నాన్నకూ అభిప్రాయ భేదాలు వచ్చాయి. అమ్మ కూడా నాకు సహకరించలేదు. నాకు పెళ్ళే ముఖ్యమని ఆమె అభిప్రాయం. అప్పటికి నాకు పదహారేళ్ళు. ఇంకా చదువుకోవాలని హైదరాబాద్‌లో బిఎస్సీ(హోమ్ సైన్స్) అడ్మిషన్ కూడా సంపాదించాను. కానీ చదువు కుదరలేదు. వరుసకు అత్తగారు మా ఇంటికి వచ్చి రాజీకట్నం లేకుండా నన్ను కోడలిగా చేసుకుంటానన్నారు. నాన్న సంతోషంగా ఓకే అన్నాడు. పెళ్ళి బాజాలు మోగాయి. నేను అత్తగారింట్లో మాత్రం ఇష్టంలేని, నా ప్రమేయంలేని మలుసు ఇది. అడుగుపెట్టాను, నాకేమాత్రం ఇష్టంలేని, నా ప్రమేయంలేని మలుపు ఇది. జీవితంలో గొప్ప మార్పును, కలనాన్ని కోరే నన్ను, కెరీర్‌పై దృష్టి, ఆసక్తి ఉన్న నన్ను కుటుంబ సంకెళ్ళు కట్టి పడేశాయి.
గృహిణిగా…
గుడ్డిలో మెల్లలాగా అత్తగారు దగ్గరి బంధువులే కావడం ఒడిదుడుకులున్నా సర్దుకు పోవడానికి సహకరించింది. వాళ్ళది వ్యవసాయ కుటుంబం.అప్పటిదాకా పట్టణంలో ఉన్న నాకు ఆ వాతావరణం రుచించలేదు. అయినా ఆ జీవితానికి అలవాటుపడ్డాను, మాకు తోడుగా ఇద్దరమ్మాయిలు భూమ్మీదకొచ్చారు, బంధాలింకా బిగుసుకుంటున్నాయి. గృహిణిగా లాగానే ఉన్నప్పటికీ ఏదో వెలితి వెన్నాడుతుండేది. ఈ జీవితం నాది కాదు…. ఏదో మార్పు కావాలని ఉండేది. మా వారు సమ్మిరెడ్డి ఉద్యోగస్తులు కారు. ఇక కుటుంబాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత నాదే అనుకున్నాను. మార్పుకు శ్రీకారం చుట్టాలన్న పట్టుదల రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. పైగా వ్యవసాయ పనులు చేయాల్సి వచ్చేది. అది నాకు ఇష్టం ఉండేదికాదు.
ఉద్యోగంలోకి…
జీవితాన్ని మలుపుతిప్పే అద్భుతం వెతుక్కుంటూ వచ్చింది. నెహ్రూ యువజన కేంద్రం నుంచి రాత్రి బడి నడిపే అవకాశం వచ్చింది. అదే టర్నింగ్ పాయింట్. రాత్రిబడి రిపోర్ట్స్ ఇవ్వడానికి హన్మకొండ వెళ్ళేదాన్ని. అప్పుడే ‘నేషనల్సర్వీస్ వాలంటీర్’ నోటిఫికేషన్ వచ్చింది. అప్లయి చేశాను. కాల్ లెటర్ వచ్చింది. ఎగిరి గంతేశాను. ఎంతో ఆనందం.నేను కోరుకున్న మార్పు నా దగ్గరికి వస్తున్నదనిపించింది. ఉద్యోగం వచ్చింది. నేను ఆ ఉద్యోగంలో చేరడం ఇంట్లోవాళ్ళకు ఇష్టంలేదు. మా కుటుంబంలో ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయరు. అందరినీ ఎదిరించి, ఒప్పించి ఉద్యోగంలో చేరాను. మా ఆయనకు హన్మకొండకు మారడం ఇష్టం లేదు. పైగా నా జీతం 750 రూపాయలే. అయినా నేను మొండిధైర్యంతో ముందుకు అడుగేశాను. ఉద్యోగరీత్యా వరంగల్ జిల్లా అంతా తిరగాల్సి వచ్చింది. యూత్ క్లబ్‌లు,మహిళా మండళ్ళు ఏర్పాటుచేయడం నా పని. నాకెంతో ఇష్టమైన పని… జనంలో ఉండడం.