6 అనుభవాల సారం
రెగ్యులర్ స్టూడెంట్‌గా చదవడం కంటే అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేయడంవల్ల నాకు ఒక కొత్త ప్రపంచం పరిచయం అయింది. వివిధ వయస్సులు, భిన్నమైన జీవితానుభవాలు గల వాళ్ళు నాకు స్నేహితులయ్యారు. వారి నుంచి నేనెంతో నేర్చుకోగలిగాను. డిగ్రీలో 70 ఏళ్ళ వయస్సున్న అశ్వత్తయ్య నా క్లాస్‌మేట్. రెగ్యులర్ డిగ్రీలో ఇది ఊహించలేం. క్లాసుల మధ్య విరామం వచ్చినప్పుడు ఆయన జీవితానుభవాలు, కష్టాలు నాతో పంచుకునేవారు. ఆయన ఎలా కష్టాలు పడిందీ… తిరిగి కోలుకున్నదీ నాతో చెప్పేవారు. ఆయన సమస్యలలో పోలిస్తే నావి అల్పంగా తోచేవి. నా జీవన పోరాటంలో ఈ పరిచయాలు ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రతి మజిలీ మళ్ళీ నన్ను నేను రీచార్జ్ చేసుకోవడానికి సాయపడ్డాయి. సమస్యల్లో ఉన్నామన్న ‘సెల్ఫ్ పిటీ’ దగ్గరికి రానీయకుండా చేశాయి. ఆయన కష్టాల ముందు నా సమస్యలు సముద్రంలో అవగింజంత అనిపించేవి. మెట్లెక్కడానికి కష్టపడే వయస్సులో ఆయన మా పక్కన కూర్చొని చదవడానికి వచ్చాడు. మనలో ఒక పాజిటివ్ దృక్పథాన్ని నింపడానికి అశ్వత్తయ్య లాంటి వ్యక్తుల పరిచయం కంటే ఇంకేం కావాలి. ఇలాంటివి రెగ్యులర్ కాలేజీ్‌ల్లో దొరకవు. అందుకే నాకు మళ్ళీ అంబేద్కర్ యూనివర్సిటీ నించే డిగ్రీ చేయాలనుంటుంది.
ఇప్పుడు పని జరిగిన దానిని బట్టి 4-5 లక్షల టాక్స్ కడుతున్నాను. అప్పుడు ఇరవై ముప్పై వేల రూపాయలకు,నానా యాతన పడేవాళ్ళం, ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి. ఇప్పుడది ఆలోచిస్తే సిల్లీగా అనిపిస్తుంది కానీ,అప్పుడదే భారం. ఆ పరిస్థితి నుంచి బయటపడి నాకు నేనుగా నిరూపించుకున్నాక నాన్న ఎంతో ఆనందపడ్డారు.ఇప్పుడు నాన్నకు, ఫ్యామిలీ సర్కిల్లో నేనంటే ఎంతో గురి. వారికేదైనా సమస్య వస్తే నన్నే సంప్రదిస్తారు. నేను చెప్పినదాన్ని అనుసరిస్తారు. వీటన్నిటితోపాటు నా జీవితంలో అడ్డుపడిన ఇంగ్లీషును జయించగలిగాను. ఇంగ్లీషు వార్తలు తెలుగులోకి అలవోకగా రాయగలిగాను. ఇప్పుడు నా కమ్యూనికేషన్ అంతా ఇంగ్లీషులోనే.
***
నన్ను ఇంటర్‌లో ఆపింది, రెగ్యులర్ స్టూడెంట్‌గా చదవకుండా చేసింది… ఇంగ్లీషు మాధ్యమమే, తెలుగులో ఇంటర్‌చేసి ఉంటే సంప్రదాయక చదువులతో తెలుగు లెక్చరర్‌గా స్థిరపడి వుండే వాణ్ణేమో. ఇంగ్లీషు మీడియం తీసుకుని ఇంటర్ ఫెయిలవడం వద్దే నా సక్సెస్ స్టార్టింగ్ పాయింట్ ఉందనిపిస్తోంది. నా కెరీర్లో మార్పునకు, అభివృద్ధికి, సర్కిల్ పెరగడానికి, సమాజంలో జర్నలిస్ట్‌గా గుర్తింపు పొందడానికి, ఇంట్లో అందరూ నన్ను గౌరవించడానికి, నా స్నేహితులు, చదువుల విషయంలో నన్ను సలహాలడిగే స్థాయికి చేరడానికి, అప్పటి ఇంటర్ ఫెయిల్‌తో పాటు అంబేద్కర్ యూనివర్సిటీలో కాలుమోపడం కూడా కారణమే.