8 అందేద్కర్ యూనివర్సిటీ పెద్ద మలుపు…
ఇంతకీ విషయం ఏమిటంటే నా ఉద్యోగం ఒక్క సంవత్సరం మాత్రమే. నేనా సంగతి ఇంట్లో చెప్పలేదు. అయిపోయాక నిరుద్యోగినయ్యాను. పిల్లలు స్కూలుకు వెళుతున్నారు. ఇల్లు గడవాలి. మా వారు ప్రైవేటు ఉద్యోగం చేసేవారు కానీ ఇల్లు గడపడం కష్టంగా ఉండేది. నేను కోరి ఎంచుకున్న జీవితం కన్నా బంధించడమూ, శాసించడమూ నాకు ఇష్టం లేదు. నేను టైలరింగ్ నేర్చుకుని పెట్టీకోట్స్ కుట్టి షాపులకు ఇచ్చేదాన్ని. టైపింగ్లో చేరి పానయ్యాను. దాంతోపాటు అంబేద్కర్ యూనివర్సిటీలో చేరి డిగ్రీ చేయాలన్న ఆలోచన వచ్చింది. అదే పెద్ద మలుపు నా జీవితానికి. ఈ రోజు నేనీ స్థాయికి వచ్చానంటే అదే కారణం. చదువు వల్ల పిల్లలతో తక్కువ సమయం గడిపేదాన్ని. పిల్లలు చిన్నవాళ్ళయినా బాగా అర్థంచేసుకుని సహకరించేవారు. నిజానికి ఫీజు కట్టడానికి డబ్బులు కూడా ఉండేవికాదు. ఎలాగైతేనం డిగ్రీ పూర్తి చేశాను.
చిన్న వ్యాపారం…
అదే సమయంలో డాక్టర్ బండా ప్రకాశ్‌గారు పరిచయం అయ్యారు. ఆయన యూనివర్సిటీ సిండికేట్ మెంబర్. నేను ఆయన్ను ఉద్యోగం ఇప్పించమని అడిగాను. కానీ ఆయన నాతో లైబ్రరీ ఓపెన్ చేయించారు. లైబ్రరీ, టైపింగ్, టైలరింగ్ అన్నీ దానిలోనే. అలా ఎన్నో కష్టాలమధ్య నేను కోరిన జీవితాన్ని గడుపుతూ వచ్చాను. ఎన్ని కష్టాలు పడినా పిల్లలను చూస్తే శ్రమ మాయమయ్యేది. కష్టాలకు వెరచి వెనుకడుగు వేయలేదు.బుక్స్ బాగా చదివేదాన్ని. కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వారంటే నాకు చాలాఇష్టం. నేను పడే పాట్లు, నా జీవన విధానం… ఇదంతా మా ఫ్యామిలీలో వింతగా చూసేవారు. ఈసడింపులు, అసహ్యాలు నాకు మామూలయ్యాయి. నేనెప్పుడూవాటికి భయపడలేదు. అందరూ పడుకున్నాక నాకు డే స్టార్ట్ అయ్యేది. చదువూసంధ్యా అన్నీ అప్పుడే.
స్పెషల్ టీచర్‌గా…
డిగ్రీ ఉండి వాకేషనల్ పాలిటెక్నిక్ చేస్తే టీచర్ ఉద్యోగానికి అర్హత వస్తుందని తెలిసింది. అప్పటికే డిగ్రీ ఫైనలియర్ రాశాను. ఫలితాలు రావాల్సి ఉంది. పరీక్షలు రాసినట్టుగా ప్రూఫ్ పెట్టి టీచర్ ఉద్యోగానికి అప్లైచేయమని స్నేహితులు సలహా ఇచ్చారు. నేను దరఖాస్తు చేసుకున్నాను. స్పెషల్ టీచర్‌గా అపాయింట్మెంట్ వచ్చింది. జీవితానికి ఒక దారి ఏర్పడింది. దానికికారణం అంబేద్కర్ యూనివర్సిటీ. డిగ్రీ కూడా మంచిమార్కులతో పూర్తి చేశాను. అటు ఉద్యోగం, ఇటు డిగ్రీ ఇక నా ఆనందానికి అవధుల్లేవు. దానితోపాటు మా వారికి సిటిజన్ క్లబ్‌లో ఉద్యోగం వచ్చింది. జీవితం గాడిన పడింది.
ఉద్యోగం… ఛాలెంజ్
నిజానికి టీచర్ ఉద్యోగంలో చేరిననాడు నా జీతం 398 రూపాయలే. అవి సరిపోక చిట్స్ నడిపేదాన్ని, టైలరింగ్ చేసేదాన్ని, నిరుత్సాహ పడేదాన్ని కాదు. ఆ తర్వాత ఉద్యోగం రెగ్యులర్ అయి జీతం పెరిగింది. కాస్త మంచి ఇంట్లోకి మారాము. మా వారి సంపాదన పెరిగింది. నేను చదువును వదలి పెట్టలేదు.ఎంఏ ఇంగ్లీషులో చేరాను. దానితో పాటు రామకృష్ణాపురంలో ఉద్యోగం, దానిపైబాగా దృష్టి పెట్టాను. చేతినిండా పని ఉండేది కాదు. ఊరికే తిని కూర్చున్నట్టు ఉండేది. ఫోర్త్ క్లాస్ వరకే ఉండేది. గ్రామస్తులు, విద్యాకమిటీ, సర్పంచ్‌తో మాట్లాడి ఫిఫ్త్ క్లాస్కు వర్మిషన్ సంపాదించాను. అందరూ బాగా సహకరించారు.
కొత్త స్కూలు బిల్డింగ్ కోసం చందాలు సేకరించాం. ఈ క్రమంలో నేను ఎదుర్కొన్న వ్యతిరేకత… నొసటి విరుపులు… ఛాలెంజింగ్గా ఉండేది. మొత్తానికిసాధించాం. ఇదేకాకుండా ఫోర్త్ క్లాస్ అయిపోగానే ఆడపిల్లలను చదువుమాన్పించి ఆ తర్వాత పెళ్ళిళ్ళు చేసేవారు. అలాకాకుండా ఫిఫ్త్ నుంచి సెవెంత్‌వరకు పర్మిషన్ సంపాదించాను. డ్రాపౌట్లు, స్టాఫ్ ప్రాబ్లమ్ అని చాలామంది వ్యతిరేకించారు. నేను పట్టు వదల్లేదు. కొత్త బిల్డింగ్, సెవన్త్ వరకు స్కూల్…సాధించాక గొప్ప సంతృప్తి.
ఎంఏ వన్ సిట్టింగ్… ప్రమోషన్
స్కూలు గొడవలో పడి చదువును అశ్రద్ధ చేశాను.పైగా ఇంగ్లీష్ లిటరేచర్ సరిగా అర్థమయ్యేది కాదు.అంతా తెలుగు మీడియం చదువు. ఎంఏ ఇంగ్లీషు మూలన పడింది. దానితో పట్టుదల మరింత పెరిగింది.ఎలాగైనా పీజీ చేయాలని అనుకున్నాను. ఈసారి ఎంఏ సోషియాలజీ రాసి వన్ సిట్టింగ్లో పూర్తిచేశాను. ఆతర్వాత టీచర్ ఉద్యోగం నుంచి ప్రమోషన్. మండల్ గర్ల్ చైల్డ్ ఆఫీసర్‌గా, అమ్మాయిల డ్రాపౌట్లు నిరోధించడం, ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ సెంటర్లు ఏర్పాటు నిధులు మంజూరు చేయించడం. ఇలా నాకు ఇష్టమైన పనులు నా చేతుల్లోకి వచ్చాయి. జనంలో జలప్రవాహంలా తిరుగుతుంటేనే నాకు ఆనందం. టూ వీలర్ కొని చుట్టుప్రక్కల గ్రామాలన్నీ తిరిగాను. ఈ ఉద్యోగం చాలా నచ్చింది. ఫ్యామిలీ పరంగా కష్టమే అయినా మంచి విజయాలు సాదించాను. అప్పుడు పీహెచ్డీ చేయాలని నిర్ణయించుకున్నాను.