గురి తప్పని గుండె ధైర్యం – కృష్ణప్రసాద్

మాట వినని గుండె అతన్ని ఇబ్బంది పెట్టింది. లక్ష్యంపై గురి తప్పేలా చేసింది. కానీ అతనిలో ఉత్సాహాన్ని, ధైర్యాన్ని, పట్టుదలను తగ్గించలేక పోయింది. అదుపుతప్పి వేగంగా కొట్టుకునే గుండెముందు అతని వ్యక్తిత్వం తలవంచకుండా నిబ్బరంగా నిలబడింది. శ్రమ చేయనివ్వని గుండె జబ్బు డాక్టర్ కావాలన్న లక్ష్యాన్ని చేరుకోనివ్వకుండా తప్పించగలిగిందే కానీ, మరో కొండలాంటి లక్ష్యాన్ని ఎంచుకోలేకుండా చేయలేకపోయింది. ఆయన ఐఏఎస్ లక్ష్యం కోపం అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీ చేశారు. తన శక్తిమేరకు శ్రమించి ప్రయత్నం చేశాడు. అనారోగ్యాన్ని జయించిన అతని గుండె ధైర్యం_ అతన్ని డిగ్రీకి, పీజీకి, టీచర్‌గా జీవితంలో స్థిరపడడానికి, ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవడానికి చేరువ చేసింది.
గుప్పెడంత గుండె
మాది వరంగల్ జిల్లా కడిపి కొండ. నాన్న సరస్వతీ శిశుమందిర్‌లో టీచర్. అది సేవాసంస్థ కనుక జీతం తక్కువ. ఆర్థిక సమస్యలు ఎక్కువగానే ఉండేవి. పైగా తరచూ బదిలీలు. నేను సరస్వతీ శిశుమందిర్‌లోనే టెంత్ పూర్తి చేశాను. చదువులో బాగానే ఉండేవాడిని. కానీ ఆరోగ్యమే సరిగా ఉండేదికాదు. గుండెజబ్బు. కొద్దిగా శ్రమ కలిగినా హార్ట్ బీట్ పెరిగేది. అందుకే ఆటలు, ఇతర యాక్టివి టీస్‌కు దూరంగా ఉండేవాడిని. వాటినుండి దృష్టి మరల్చడానికి చదువులో ఎక్కువ సమయం గడిపేవాడిని. చదువుకుంటే మంచి ఉద్యోగంలో చేరవచని అమ్మా నాన్న ఎంకరేజ్ చేసేవారు. అలా కష్టపడడం వల్లే టెంత్స్టేట్లో 11వ ర్యాంకు వచ్చింది. అమ్మా నాన్న ఎంతగానో సంతోషపడ్డారు.
ఉప్పెనంత ఊహ …
ఒక ఊరిలో హాస్టల్ పక్కనే మేం నివాస ముండే వాళ్ళం. అక్కడ పిల్లల ఆరోగ్య సమస్యలు, డాక్టర్ లేక వారు పడే పాట్లు రోజూ చూసేవాణ్ణి. ఇదంతా నా మనసుపై బాగా పనిచేసింది. ఎలాగైనా డాక్టర్ కావాలనుకున్నా పేద,గ్రామీణ ప్రజలకు సేవ యాలని నిశ్చయించుకున్నాను. ఈ ఊహ మేరకు ఇంటర్లో బైపీసీ గ్రూపు తీసుకున్నా స్టేట్ ర్యాంకర్ కనుక ఎస్.ఆర్.జూనియర్‌కాలేజీ ఉచితంగా సీట్ ఆఫర్ చేసింది. సీటీకాదు పుస్తకాలు, హాస్టల్ సీటు కూడా ఫ్రీగానే ఇచ్చింది. ఇది అమ్మా నాన్నలకు భారం తగ్గించినట్టయ్యింది. ఇక స్తకాల మధ్యే గడపడం మొదలుపెట్టాను. సెలవుల్లో కూడా హాస్టల్లోనే ఉండేవాడిని. ఆటలపై ఆసక్తి, ఆరోగ్యం రీత్యా అవకాశమూ లేకపోయేసరికి ఎక్కువగా లైబ్రరీలోనే గడిపేవాడిని. ఎప్పుడూ అదే ఆలోచన డాక్టర్ కావాలని. ఫస్టియర్‌లో బాగా మార్కులొచ్చాయి. స్టేట్ ర్యాంక్ వచ్చింది. రెండో సంవత్సరంలో మళ్ళీ అనారోగ్యం. గుండె చెప్పిన మాట వినడం లేదు. హార్డ్ బీట్ పెరిగింది డాక్టర్లు శ్రమ పడకూడదన్నారు, విశ్రాంతి అవసరమన్నారు. అప్పటికే అమ్మా నాన్న చాలా డబ్బులు వెచ్చించారు. ఇక వాళ్ళను కష్టపెట్టకూడదు.విశ్రాంతి తీసుకున్నాను దానితో చదువుకునే సమయం తగ్గింది. అమ్మానాన్నపక్కనే ఉండి అన్నీ చూసుకునేవారు. నా అనారోగ్యం వారిని బాగా కలిచివేసింది. మరోవైపు అనారోగ్యం చదువుకు సహకరించడం లేదు. సెకండీయర్‌లో పాసయ్యాను. కానీ ఎక్కువ మార్కులు స్కోర్ చేయలేకపోయాను. అలాగే ఎంసెట్‌లో కూడా మంచి ర్యాంక్ రాలేదు. వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి నన్ను వైద్యుడిని కానీయకుండా అడ్డు పడింది.
Media Attributions
- krishnaprasad