28 14 ఏళ్లకు జాతీయ అవార్డు …
అప్పటికి ఆకాశవాణి జాతీయస్థాయిలో సాగింది. ప్రతి సంవత్సరం జరిగే గొప్ప ఉత్సవం అది. దానిలో నాకు గోల్డ్మెడల్ వచ్చింది. అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు బహూకరించారు. తర్వాత ఎన్ని విజయాలు సాధించినా నా జీవితంలో అదే గొప్ప సంఘటన. ద్వారం వెంకటస్వామి నాయుడు, సెమ్మంగుడి శ్రీనివాస్, సుబ్రహ్మణ్య వీళ్ళె, బృందా ముక్త, బుధలూరి కృష్ణమూర్తి, వోలేటి వెంకటేశ్వర్లు లాంటి ఉద్దండులైన జడ్జీలను మెప్పించి గెలవడం గొప్ప జ్ఞాపకం. ఆ తర్వాత జరిగిన సంఘటన మరీ అద్భుతం. ఢిల్లీ ఆకాశవాణి నాతో సోలో కచేరీ ఏర్పాటు చేసింది. అప్పటి దాకా సోలో లేదు. అదో రికార్డు. అప్పట్లోనే వెయ్యి రూపాయల పారితోషికం ఇచ్చారు. ఢిల్లీలోని ప్ప్రథమ స్టార్ హోటల్ ‘అశోక’లో విడిది. చాలా గౌరవం ఇచ్చారు. బొంబాయిలో ఒకసారి పాల్హాట్ మడిఅయ్యర్ చేయాల్సిన కచేరి చేసే అదృష్టం నాకు కలిగింది. ఇంకా విశేషమేమంటే హాస్పిటల్లో ఉన్నఆయన నా మృదంగ వాయిద్యం వినడానికి నలుగురి సాయంతో నా కచేరీకి వచ్చారు. ప్రేక్షకుల మధ్యలో కూర్చుని నా కచేరి విని అక్కడి నుంచే నన్ను ఆశీర్వదించారు. నవమృదంగంపై నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ‘మృదంగ చరిత్రలో గొప్ప అధ్యాయం మొదలయింది’ అని ఆయన నన్ను ఆశీర్వదించారు.సంగీతంలో ఒక సంప్రదాయాన్నే సృష్టించిన మహావిద్యాంసుల వాత్సల్యం అది.
గిన్నిస్ రికార్డు…
నా జీవితంలో మరో మరుపురాని ఘట్టం మృదంగ మహాయజ్ఞం, అన్న పానాదులు లేకుండా 36 గంటల పాటుచేసిన సంగీత యజ్ఞం అది. నేను ప్రతిపాదించగానే తామే ప్రభుత్వం తరపున నిర్వహిస్తామని అప్పటి సాంస్కృతిక శాఖామంత్రి భాట్టం శ్రీరామమూర్తి ముందుకు వచ్చారు. ఆ శాఖలోని డైరెక్టర్ జేవీ సోమయాజులు ఈ యజ్ఞాన్ని పర్యవేక్షించారు. హైదరాబాద్‌లోని శృంగేరి మరంలో వేదమంత్రాల మధ్య జరిగిన ఈ యజ్జం 24 గంటలు
అనుకున్నది 36 గంటలు సాగింది. ఇది గిన్నీస్ బుక్లోకి చేరింది. ఈమని కృష్ణశాస్త్రి, బాలమురళీ కృష్ణ, నూకల దిన సత్యనారాయణ లాంటి మహా మహులు పాల్గొన్నారు. దాశరథి, సి.నారాయణరెడ్డి, శేషేంద్రశర్మ లాంటి కవులూ, ముఖ్యమంత్రి అంజయ్య, గవర్నర్ అబ్రహం వచ్చారు. తెల్లవార్లూ సంగీతం ప్రవహించిందక్కడ.
సినిమా సంగీతం…
సప్తపది, భద్రం కొడుకో… సినిమాలకు సంగీతాన్నందించాను. ఎన్టీరాహారావు గారు ఆయన విశ్వామిత్ర సినిమాకు కూడా పనిచేయాలని ఆహ్వానించారు. దానికీ సంగీతం అందించాను. సినిమా… అదో లోకం. అక్కడి సంస్కృతి, గౌరవం వేరు. సాధారణంగా సంగీత ప్రపంచంలో కనిపించే గురుశిష్య సంబంధాలు ఉండవు. ఎంతటి వాడైనా సినిమా సక్సెస్ అయితేనే నిలబడేది. ఇప్పటిదాకా సినిమా ఎందుకు సక్సెస్ అవుతుందో చెప్పగలిగే వారు లేరు. అంతా దైవాధీనం. నేనప్పటికే సంగీత రంగంలో పేరు సంపాదించుకున్నా మళ్ళీ నేనిక్కడ కెరీర్ మొదలుపెట్టాలి. వంద కచేరీలు చేసినా రాని డబ్బు రెండు మూడు సినిమాల్లో వస్తుందేమోగానీ… కచేరీల్లో దొరికే ఆత్మసంతృప్తి అక్కడరాదు. అందుకే మళ్ళీ నా ప్రపంచంలోకి వచ్చా.
పీఠాధిపతిగా ఎన్నో కోర్సులు …
నేను బడికి వెళ్ళి సాధారణ విద్యను అభ్యసించింది లేదు. అంబేద్కర్ విశ్వవిద్యాలయమే నా తొలి బడి. అకాడమీ విద్య చేయలేకపోయినా నా సంగీతానుభవంతో, వివిధ దేశాలలో తిరిగి అక్కడ పద్ధతులు గమనించిన అనుభవంతో అనేక కోర్సులను… నా హయాంలో తెలుగు యూనివర్సిటీలో ప్రవేశపెట్టాను. విద్యార్థులకు అనేక అవకాశాలు కల్పించాను. తెలుగు యూనివర్సిటీని ఒక మోడల్ విశ్వవిద్యాలయంలా తీర్చిదిద్దాను. అప్పటిదాకా గాత్రం మాత్రమే ఉన్న బీఏ సంగీతం కోర్సులో మృదంగం, వీణ, వయోలిన్ ప్రవేశపెట్టాను. ఎంఏ కోర్సు ప్రవేశపెట్టాను. పెయింటింగ్, మోడ్రన్ ఆర్ట్… లాంటి బహుముఖ కోర్సులతో బీఏ నాలుగేళ్ళ కోర్సు చేశాను. ఇది బాగా పేరు తెచ్చిపెట్టింది. నాట్యంలో భరతనాట్యం, ఆంధ్రనాట్యం నేను తెచ్చిందే. ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన సాయంత్రం కోర్సులు నా హయాంలో వచ్చినవే. గాత్రం, వీణ, వయోలిన్, మృదంగం, దోలు… ఇవన్నీ సాయంత్రం కోర్సులలో ఉన్నాయి. టూరిజం కోర్సు,నాట్యంలో జానపదం నృత్యం, హరికథ, లలిత సంగీతం… సంగీతంలో పీహెచ్డీ ఇవన్నీ నా పర్యవేక్షణలో రూపుదిద్దుకున్నవే. నాదస్వరం, డోలులో కూడా పీహెచ్డీ చేయవచ్చు. వీటన్నింటిని రూపుదిద్దడానికి నేనెంతో శ్రమించాను.నా కచేరీలన్నీ వదులుకున్నాను. అయినా తెలుగు యూనివర్సిటీ ఒక మోడల్ విశ్వవిద్యాలయంలా తీర్చిదిద్ధానన్న సంతృప్తి మాత్రం ఉంది.