32 అంబేద్కర్ యూనివర్సిటీ… ఒక మలుపు
ఎలాంటి అర్హతలు లేకుండానే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేయవచ్చు అన్న ప్రకటన నా జీవితాన్ని మరో మలుపు తిప్పింది. రెగ్యులర్ డిగ్రీ మరియు ఈ డిగ్రీ ఒకటేనని, సివిల్ సర్వీసెస్ అయినా రాయవచ్చన్న సమాచారం. ఇంటర్ ఫైలురెతో చదువు అయిపోయిందన్న నాలో ఈ వార్తలు ఉత్సాహాన్ని నింపాయి. అప్పటికే అంబేద్కర్ యూనివర్సిటీ గురించి విన్నాను.కానీ, అది రెగ్యులర్ డిగ్రీతో సమానం కాదని ప్రయోజనం, విలువ ఉండదనీ తప్పుడు అభిప్రాయం ప్రచారంలో ఉంది.‘ఉదయం’ పేపర్లో దాని గురించి రాసిన సమగ్ర సమాచారం ఆ అభిప్రాయాన్ని మార్చేసింది. అంబేద్కర్ యూనివర్సిటీ అర్హత పరీక్ష రాసి పాసయ్యాను. 1993లో డిగ్రీ ఫస్టియర్లో చేరాను. ఇంటి వైపు చూస్తే ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతోంది.ఉన్నత చదువులు చదవగలుగు తాననే ఆశ సన్నగిల్లుతోంది.
ఆటో… డిగ్రీ
చదువుకు ఇబ్బంది కాకూడదనుకున్నాను. అలాగే ఇంటికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించుకున్నాను. ఇదే లక్ష్యంతో ఆటో నడపడం నేర్చుకున్నాను. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా ఆటో నడపడం, ఇంటికి వచ్చాక రాత్రి రోజూ కనీసం గంటయినా చదువు. ఆదివారం మాత్రం అంబేద్కర్ వర్సిటీ క్లాసులకు అటెండ్ అయ్యేవాడిని. నిజంగా ఆ క్లాసులు విద్యార్థులకు ఒక వరం. పరీక్షలకు నెల రోజులు ముందు నుంచీ బులెట్ పాయింట్స్ చదివే వాడిని. పరీక్షలప్పుడు మాత్రం అంతా చదువే…. వేరే పని, లోకం లేదు. ఉదయం నుంచీ సాయంత్రం దాకా చదవడమే. అలా 1996లో డిగ్రీ పూర్తిచేశాను. ఆ తర్వాత లాసెట్ రాశాను. వెయ్యి లోపు ర్యాంకు వచ్చింది.పదాల రామిరెడ్డి లా కాలేజీలో అడ్మిషన్ కోసం ప్రయత్నించాను. కానీ, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కారణంగా అడ్మిషన్లు వాయిదా పడ్డాయి. అలా ‘లా’ మిస్సయ్యింది.
ఉస్మానియా… పీజీ
1998లో ఉస్మానియా యూనివర్సిటీ పీజీ ఎంట్రన్స్ నోటిఫికేషన్ పడింది. నేను, నా ఫ్రెండ్ నా ఆటోలోనే వెళ్ళి ఎంపీ పొలిటికల్ సైన్స్కు అప్లయి చేశాం. ప్రవేశ పరీక్ష కోసం బాగా కష్టపడ్డాను. ముప్పయి ఎనిమిదవ ర్యాంకు వచ్చింది. ఉన్నత విద్య లక్ష్యానికి చేరువయ్యాను అనిపించింది. పూట గడవడమే కష్టమవు తుంటే ఉస్మానియాలో పీజీ చేయడం… ఇంట్లో వ్యతిరేకత వచ్చింది. ఎలాగో కష్టపడి చదువుకుంటానని వారిని ఒప్పించాను. ఉస్మానియాలో సీటు రావడమే గొప్ప. దానిని వదులు కోవద్దనుకున్నాను. నా చదువుతో కుటుంబ ఆర్థిక పరిస్థితి మారుస్తానని వారికి ఆశకల్పించి ‘ఉస్మానియా’లో చేరాను. కాని అదంత సులభం కాదని తర్వాత తెలిసింది. కాలేజీ, హాస్టల్స్, లైబ్రరీ… చదవడం అదే నా దినచర్య. ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ బాగా ఉపయోగపడింది. ఆ పుస్తకాలు చదివే ఎపీడీఎస్సీ పరీక్షలు రాసేవాణ్ణి. మొత్తానికి ఎంఏ ఫస్టియర్లో నేనే క్లాస్ ఫస్ట్. రెండో సంవత్సరం పూర్తయ్యేసరికి నాలుగో ర్యాంకులో నిలిచాను. ఐదు వేల రూపాయల మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది.
మళ్లి క్యాంపుస్ కు…
పీజీ పూర్తి చేశాను. చదువు సరే… బతుకు తెరువు ఎట్లా? ఇంట్లో ఒత్తిడి.. ఎలా స్థిరపడడం? గ్రూప్-1, గ్రూప్-II పరీక్షలు రాశా కానీ, ఉద్యోగం రాలేదు. ఊర్లో ఉండడం సాధ్యం కాలేదు. మా హాస్టల్లో వార్డెన్గా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ముసలయ్యకు ఫోన్చేసి నా బాధలు చెప్పాను. ఆయన రెండు నెలలకు సరిపడా కిరాణా సామానుతో పాటు పాకెట్మనీ ఇచ్చి క్యాంపస్లో ఉండే అవకాశం కల్పించారు. రెండు నెలలపాటు కాంపిటీటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ ఆటోను ఆశ్రయించాను. అలా ఆటో నడుపుతూనే ఆర్ట్స్ కాలేజీ కోచింగ్ సెంటర్లో సివిల్స్ ప్రిలిమ్స్ కోసం అడ్మిషన్ తీసుకున్నాను. ఆరు నెలలపాటు కొంత వెసులుబాటు. చదువుపై పూర్తిగా దృష్టి పెట్టి అవకాశం.