"

9 అమెరికా ఆలోచన

ఆనందం పొందామా, ఏ బాధలేకుండా ఉన్నామా అని కాదు, జీవితంఎంత గాఢంగా ఉందన్నది ముఖ్యం. అందుకే జీవితంలో మరో మలుపునకు నాంది పలికాను, అమెరికాలో మాకు చాలా మంది బంధువులు ఉన్నారు. వారినిచూసి నాకు అమెరికా వెళ్ళాలన్న ఆలోచన వచ్చింది. నేను మా కజిన్ ను అడిగా. అక్కడ సెటిలయ్యేంత వరకు సాయం చేస్తావా అని, నాకు కావల్సిన ఎడ్యుకేషన్ డిటెయిల్స్ చెప్పింది. ప్రయత్నం చేయమని ప్రోత్సహించింది. మరో కజిన్‌కు సాఫ్ట్వేర్కు సంబంధించిన కన్సల్టెన్సీ ఉంది. నేను కంప్యూటర్ కోర్సు చేయడానికి సిద్ధం అయ్యా. కంప్యూటర్ నాలెడ్జ్ ఉందని, అనుభవం కూడా ఉందని రెజ్యూమ్ తయారుచేసి వాళ్ళకు
ఇచ్చా. తెలుగుమీడియం కాబట్టి హెచ్ వన్ వీసా రాలేదని చెప్పారు. అదీ మొదటి విఘ్నం. నాకు బాధ కలిగింది. కానీ, నిరాశ పడలేదు. నా స్నేహితుల ద్వారా వివరాలు సేకరించాను. ఒక ఫ్రెండ్ సోదరుని కన్సల్టెన్సీ ద్వారా ప్రయత్నం చేశాను. ఆయన ద్వారా హెచ్వన్ వీసాకి అప్లయ్ చేశా.

సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్…

ఈ మధ్యలో ఉద్యోగానికి సెలవు పెట్టి హైరబాబాద్‌కు మారాను. సాఫ్ట్వేర్ ట్రైనింగ్లో జాయిన్ అయ్యాను. అయితే ఈసారి కూడా వీసా రాలేదు. మరో విఘ్నం, ఏం చేయాలో అర్థం కాలేదు. సాఫ్ట్వేర్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు అమెరికా వెళ్ళడానికి ఎన్నో మార్గాలున్నాయని తెలిసింది. మళ్ళీ ఉత్సాహం తెచ్చుకున్నాను. ఓ ఫ్రెండ్ విజిటర్ వీసాపై వెళ్ళవచ్చని చెప్పాడు. ఇదంతా జరుగుతోంది కానీ, పిల్లలకు ఇబ్బంది అవుతోంది. కష్టం అనిపించినా వారిని హాస్టల్లో చేర్పించాను. ఇంట్లో ఘర్షణ. అయినా నేను లెక్కచేయలేదు. అమెరికా నుంచి పేపర్లు వచ్చాయి. ఆ తర్వాత అనేక ప్రయాసల మధ్య నాకు వీసా వచ్చింది. ఈ విషయంలో నా స్నేహితులకు కృతజ్ఞతలు చెప్పాలి. నా జీవితాన్ని మార్చేసిన మలుపు ఇది.

అమెరికా … కష్టాలు

ఒక ఎదురుదెబ్బ తగిలినంత మాత్రాన సాధించదలచుకున్న ప్రయోజనం నుంచి
వెనుకంజ వేయవద్దు.– షేక్స్పియర్

ఉద్యోగానికి లాంగ్లీవ్ పెట్టి పిల్లలకు ఇబ్బంది కలగకుండా చూసుకొని, మే 2, 2000న అమెరికాకు ఎగిరి పోయాను. అమెరికా అయితే చేరాను కానీ ఊహించినంత అందమూ, అద్భుతాలూ లేవక్కడ. ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. అక్కడా విమర్శలే బంధువుల నుంచి. పిల్లలను, ఉద్యోగాన్ని వదలి వచ్చానని. మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నానని. నేను చేసే ప్రతి పనిని సమాజం తప్పుపడుతోంది. ఒకసారి ఆ మాటలకు తలొగ్గామా ఇక అంతే. మనం కోరుకున్నది అందదు. అందుకే మనసు రాయి చేసుకున్నాను. గెస్త్‌హౌస్‌లో ఉండే అవకాశం ఉంది కానీ, బంధువుల వద్దే ఉండాలని కుటుంబం నుంచి ఒత్తిడి. మా కజిన్ దగ్గరికి వెళ్ళాను. అక్కడా అనుకూల వాతావరణం లేదు. నాకు ఉద్యోగం చూడడం, నేను అక్కడ ఎక్కువ కాలం ఉండడం ఇష్టం లేదని గ్రహించాను. నా దగ్గరున్న వెయ్యి డాలర్లలో వారి దగ్గరికి వెళ్ళడానికే 350 డాలర్లు ఖర్చయ్యాయి. మరో వంద డాలర్లు ఫోన్ చేయడానికి. పైగా అప్పటికే మూడు వారాలు అయిపోయాయి. మరో కజిన్కు ఫోన్ చేశా. విజిట్ వీసాతో నువ్విక్కడ పని చేయకూడదు, చట్టవిరుద్ధం అన్నారు. అయితే ఇండియన్ షాపులో పని చేయవచ్చని నాకు తెలుసు. అదే చెప్పాను. చివరికి మూవీ క్యాసెట్ షాపులో సేల్స్ గర్ల్‌గా ఉద్యోగం దొరికింది. కాస్త ఆసరా… తర్వాత న్యూజెర్సీలో జాబ్ ఉందని అక్కడికి ప్లయిట్లో వెళ్ళే డబ్బులేక బస్సులో వెళ్ళాను. మళ్ళీ ఎక్కడ ఉండాలనే సమస్య మొదలయ్యింది. మా బంధువులకు సొంత ఇల్లు ఉంది కానీ, వారు నేను ఉండటానికి ఇష్టపడలేదు. అక్కడే పనిచేస్తున్న గుజరాతి అమ్మాయి, నేనూ కలిసి పేయింగ్ గెస్ట్గా ఉండేట్లు మాట్లాడుకున్నాము. ఆ ఇల్లు నేనుపనిచేసే షాపునకు రెండు మైళ్ళ దూరం. రోజూ నడిచి వెళ్ళేరాన్ని, రోజుకుపన్నెండు గంటలు పనిచేసేదాన్ని. నేను హెచ్వన్ వీసాకు అప్లయి చేయాలంటే విజిటర్ వీసా ఎక్స్టెన్షన్ చెయ్యాల్సి ఉంటుంది. పరిస్థితి ఘోరం. ఎవరిని అడిగినా సరైన సలహా ఇవ్వడం లేదు. నాకు అక్టోబర్ వరకే విజిటర్ వీసాఉంది. బంధువులకు ఫోన్‌చేస్తే ఫోన్ ఎత్తడం లేదు. మరికొందరు బిజీ అంటున్నారు. అప్పుడూ స్నేహితులే ఎంకరేజ్ చేశారు.

మరో మలుపు…

ఒకసారి షాపులో పనిచేస్తుండగా ఒకతను గుర్తుపట్టి పలకరించాడు. ఆయన డాక్టర్ బండా ప్రకాశ్‌గారి అల్లుడు, సుధాకర్. వరంగల్లో ఒకసారి నన్ను చూశారు. ఆయన పరి చయంతో అమెరికాలో నా లైఫ్ మలుపు తిరిగింది. వాళ్ళ అన్నయ్య(సంజయ్) ‘సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీలో ఉద్యోగం వచ్చేలా చేశాడు. ప్రకాశ్గారు మా ఫ్యామిలీకి క్లోజ్ కావడం కలిసి వచ్చింది. ఇండియానాలో ఒక వారం ట్రైనింగ్. వెయ్యి డాలర్ల జీతంతో ఉద్యోగం, వసతి. నాకు సంజయ్ శిక్షణ ఇప్పించి సౌత్ కకరోలినాలోని ఆఫీసుకు తీసుకెళ్ళారు. అక్కడి వారిని పరిచయం చేశారు. వాళ్ళ కజిన్స్ కూడా అక్కడ పనిచేస్తున్నారు. తెలుగువాళ్ళ మధ్యలో చాలా కంఫర్ట్ అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు చేసిన టైపింగ్ అప్పుడు చాలా ఉపయోగపడింది. కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఆఫ్ అమెరికా కంపెనీలో రిక్రూటర్గా ఉద్యోగం, జీతం తక్కువైనా బాగా ఉపయోగపడిన ఉద్యోగం అది. ఆ కంపెనీ లాయర్తోనే విజిటర్ వీసా ఎక్స్టెన్షన్కు అప్లయి చేశా. అదృష్టవశాత్తు ఎక్స్టెన్షన్ వచ్చింది. హెచ్ వన్‌కు అప్లయి చేశాను. తర్వాత సంవత్సరానికి అరవై వేల డాలర్ల శాలరీతో జాబ్ ఆఫర్ వచ్చింది. దానితో వర్జీనియా వెళ్ళాను. మంచి జీతం, పసతి, ఫ్రీ ట్రాన్స్పోర్ట్. ఇక సెటిలయ్యాను అనుకున్నా చాలా డబ్బు పొదుపు చేశా. ఇంతలో హెచ్వన్ వచ్చింది. అమెరికా ఒంటరి పోరాటంలో గెలిచాను.

ఇండియాలో పిల్లలు…

వారానికి రెండుసార్లు ఫోన్ చేసేదాన్ని. దాదాపు రెండేళ్ళయ్యింది వారినిచూసి మరోవైపు పిల్లలకు టెన్త్ అయిపోయింది. హైదరాబాద్లోనే ఇంటర్లో చేరారు. బాగా చదువుతున్నారు. ఎక్కడ పనిచేసినా అందరితో సత్సంబంధాలు నెరపడం నాకు శ్రీరామ రక్ష అయింది. సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ గురించి బాగా అవగాహన వచ్చింది. అదే బిజినెస్ చేస్తే బావుంటుందన్న ఆలోచన వచ్చింది.ఒక ఫ్రెండ్తో కలిసి బిజినెస్ ప్రారంభించాను. కానీ వర్కవుట్ కాలేదు. అప్పటికి డెస్వర్ స్టేట్లో ఉన్నాను. మళ్ళీ బిజినెస్ పార్టనర్ కోసం చూస్తున్నాను. పిల్లలను చూడాలని చాలా అనిపించేది. కానీ హెచ్వన్ స్టాంపింగ్ అయితేనే వెళ్ళాలని నిశ్చయించాను. ఆ రోజు రానే వచ్చింది. టికెట్ బుక్ చేసుకున్నా. ఈ మధ్యలో ఎప్పుడో అప్లయి చేసిన సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ ఉద్యోగం కోసం కాల్‌లెటర్ వచ్చింది. అరిజోనా స్టేట్లో ఇంటర్వ్యూ, అక్కడ ఉద్యోగం రాలేదు

“ఆనందం పొందామా, ఏ బాధల్లేకుండా ఉన్నామా అని కాదు. జీవితం ఎంత గాఢంగా ఉందన్నది ముఖ్యం. అందుకే జీవితంలో మరో
మలుపునకు నాంది పలికాను, అమెరికాలో మాకు చాలా మంది బంధువులు ఉన్నారు. వారిని చూసి నాకు అమెరికా వెళ్ళాలన్న ఆలోచన
వచ్చింది.”

కానీ, అక్కడే బిజినెస్ ప్రారంభించాలన్న ఆలోచన బలపడింది. వెంటనే కంపెనీ రిజిస్టర్ చేశాను. సెప్టెంబర్లో ఇండియాకు వచ్చాను. పిల్లలను చూసినప్పుడు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. మళ్ళీ మూడు
నెలలు వారితో గడిపి అమెరికాకు తిరిగి వచ్చాను. బిజినెస్ అయితే మొదలుపెట్టాను గానీ, కాస్త కష్టంగా అనిపించింది. మరో పార్టనర్ని చేర్చుకున్నాను. బిజినెస్ డెవలప్ చేయడంపైనే మా ధ్యాస, బాగా అభివృద్ధి సాధించాం. డబ్బు బాగా వస్తోంది. కానీ పిల్లలకు దూరంగా ఉన్నానన్న బాధ వెన్నాడుతోంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇండియాకు వచ్చి పిల్లలను చూసి వస్తున్నాను. వేసవి సెలవుల్లో పిల్లలు, మా వారు అమెరికా వస్తుండేవారు. 2005 దాకా ఇలాగే సాగింది. గ్రీన్కార్డ్ వచ్చింది. ఇప్పుడందరం అమెరికాలోనే ఉన్నాం. హ్యాపీ ఫ్యామిలీ, పిల్లలు బీనా, బిందు ఇక్కడే చదువుతున్నారు. పిల్లలు ఇక్కడే సెటిలయ్యాక నేను ఇండియా వచ్చి అక్కడే ఉండాలన్న ఆలోచన. బాధ్యతలన్నీ అయిపోయాక, కాలం కలిసి వస్తే ఇండియాలో ‘వృద్ధాశ్రమం’ నడపాలని ఉంది.

అమెరికాలో బిజినెస్ ఆలోచన…

ఏ లక్ష్యంతో అమెరికా వచ్చానో అది సాధించగలిగాను. కానీ, పిల్లలు, భర్త… చాలా మిస్సయ్యాను. పిల్లలు గుర్తొస్తే మనసు బ్లేడ్‌తో కోసినట్టు ఉండేది. ఎగిరి అక్కడ వాలాలనుండేది. నేను చిన్నప్పుడు అమ్మకు దూరమైన రోజులు గుర్తు కొచ్చేవి.

చూశారుగా పరంగల్ పల్లె అమ్మాయి ఎన్ని కష్టాలుపడి, ఎన్ని అవరోధాలను, విమర్శలను ఎదుర్కొని, అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ సాయంతో నిలదొక్కుకుని, అమెరికా దాకా ఎలా ఎదిగిందో… అందుకే అంబేద్కర్ యూనివర్సిటీ వారికి కృతజ్ఞతలతో సెలవు.

జ్ఞానం ఉన్న చోట శక్తి ఉంటుంది. తెలివి ఉన్నచోట వెలుగు ఉంటుంది.- హాబ్స్

 

* * *

 

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

మేముసైతం... Copyright © 2009 by డా ఘంటా చక్రపాణి is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.