5 అంబేద్కర్ వర్సిటీ ప్రకటన
ప్రెస్ మూతపడినా లేపాక్షి మండలం ఈనాడు విలేఖరిగా నెలకు ఎంతో కొంత డబ్బులు చేతిలో పడేవి. పైగావార్తలు సేకరించడం, రాజకీయ పార్టీల సమావేశాలకు వెళ్ళడం, కవరేజ్, కొత్తరంగం, కాసింత ఉత్సాహం. తర్వాతహిందూపూర్కు ప్రమోట్ చేశారు. అక్కడికొచ్చాక తేడా తెల్పింది. రెండు పేజీలు చేసినాయన ఉదయం రిపోర్టర్. ఒకపీజీ చేసి హిందీ, ఇంగ్లీషు, కన్నడ మాట్లాడుతున్నాయన ఆంధ్రప్రభ రిపోర్టర్. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ డిగ్రీ చేశారు.చదువుకున్న వాళ్ళుగా వీరికి పేరుండేది. నాకు చెంచు సుబ్బయ్యశర్మ కొడుకుగానే గుర్తింపు తప్ప… ఇంకేం లేదు.చదువుకు సంబంధించి వారికీ నాకూ లాగా తేడా ఫీలయ్యాను. నేను ఇంటర్ ఫెయిల్… ఎలాగైనా డిగ్రీ చేయాలన్నకోరిక తారస్థాయికి చేరింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ(అంబేడ్కర్ యూనివర్సిటీ అప్పటి పేరు)డిగ్రీ ప్రవేశ పరీక్ష ప్రకటన పత్రికలో చూశాను. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు, ఆ ప్రకటన నా కోసమే వేసినట్టుఅనిపించింది. ప్రవేశ పరీక్ష రాశాను. రాసిన రోజే అనుకున్నాను… పాసవుతానని. ఎందుకంటే ఇంటర్లో నన్ను అడ్డుకున్న ఇంగ్లీషు లాంటి సబ్జెక్టులేమీ లేవు. అన్ని నాకు తెల్పినవే… తెలుగు, జనరల్ నాలెడ్జ్. అలా డిగ్రీలోకి ఎంటరయ్యాను.పరీక్ష ఫలితాలు పేపర్లో చూసుకున్నప్పుడు కలిగిన ఆనందం ఇప్పటికీ గుర్తుతుంది. ప్రతి ఆదివారం కౌన్సెలింగ్ క్లాసులకువెళ్ళడం, పోస్ట్లో పుస్తకాలు అందుకోవడం, సీరియస్గా నోట్స్ రాసుకోవడం… మళ్ళీ చదువుల ఒడిలోకి చేరినట్టుఅనిపించింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు లిటరేచర్… ఏదీ కష్టంగా తోచలేదు. చదువు కదలడంమొదలయ్యింది. డిగ్రీ పూర్తయ్యింది. తెలుగు నాకెంత బాగా వచ్చునంటే… ఒక్కోసారి కౌన్సెలర్ రాకపోతే నేనే తెలుగుక్లాసులు తీసుకునే వాణ్ణి.
పీజీ లక్ష్యం…
ఈనాడు జర్నలిజం స్కూలు ప్రవేశ పరీక్ష రాసి సెలక్డయ్యాను. అప్పటికి నేను డిగ్రీ పూర్తి చేయలేదు. సెలక్డయిన వారిలో ఇద్దరికే డిగ్రీ లేదు. అందులో నేను ఒకడ్ని. మా బ్యాచ్‌లో పీజీలు, డాక్టరేట్లు చేసినవారు, క్యాంపస్‌లో జర్నలిజం కోర్సులు చేస్తున్నవారు ఉన్నారు. వారితో పోలిస్తే అదే చదువుల తేడా. అగాధంలా కనిపిస్తోంది. వారందరినీ చూస్తే అప్పటిదాకా ‘డిగ్రీ’ ఉంటే చాలు అనుకున్న నాకు పీజీ కూడా ఉండాలని అనిపించింది. అంటే లక్ష్యం మారింది. అప్పటిదాకా విలేఖరిగా హిందూపురంలో పని చేసినప్పుడు చాలా మంచి ఆర్టికల్స్, వార్తలు రాసేవాణ్ణి. నాకు ‘విద్యార్థత’ లేకపోవడం వల్ల అవి నేను రాసినవిగా ఒప్పుకునేవారు కాదు. డెస్క్లో ఎవరో తిరగరాసి ఉంటారని భావించేవారు. ఇలాంటి సంఘటనలన్నీ బాగా చదవాలన్న కోరికను మరింత పెంచాయి. అప్పుడు నా ముందు ఉన్న లక్ష్యం పీజీ,తెలుగులో పిహెచ్డీ చేయాలనీ. అదే పట్టదలతో శ్రీకృష్ణదేవరాయ యూనిపర్సిటీలో తెలుగులో ఎంఏ, ఉస్మానియాలో బీసీజీ, తెలుగు యూనివర్సిటీలో ఎంసీజే, సంస్కృతం, హిందీ సర్టిఫికేట్ కోర్సులు, చదువు ప్రయాణం కొన సాగింది. దానికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీయే మూలకారణం. ఎంతగా చదువులో పడిపోయానంటే ఇకదాన్ని వదలలేదు. ఇంకా చెప్పాలంటే భవిష్యత్తులో కూడా వదిలే ప్రసక్తే లేదు. మళ్ళీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ చేయాలి. మెడల్ తీసుకోవాలి. ఇదే నా జీవిత లక్ష్యం. ఒక స్థాయిదాకా చదువు, విద్యార్హత ఎంత అవసరమో నాకు అనుభవం ద్వారా తెల్సింది. అంబేద్కర్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష ప్రకటన నా అవసరాన్ని తీర్చింది.
చదువుల బడిలోకి…
నిజానికి మా సర్కిల్లో కూడా అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ డిగ్రీ అంటే గౌరవం ఉండేదికాదు. దానికప్పుడు చివరి స్థానమే. రెగ్యులర్ డిగ్రీకీ దానికీ తేడా ఉంటుందనే అభిప్రాయం ఉండేది. నేను ఉద్యోగం… అదీ నైట్ షిఫ్ట్‌లలో పనిచేస్తూ చదివేవాణ్ణి. దానికి విలువ లేదంటారేం అన్న బాధ ఉండేది. ఆ సర్టిఫికెట్‌తో ఉద్యోగం సంపాదించాలన్న ఉద్దేశం ఏమీలేదు కానీ, నా జీవితంలో వెలితిని, నా సర్కిల్లో వస్తున్న ఎగతాళిని తట్టుకోవడానికి డిగ్రీ చేశాను. అది వేసిన పునాది ఏమిటో తెలుగులో పీజీ ఫలితాలు నిరూపించాయి. అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. అలాగే ఉస్మానియా బీసీజే ప్రవేశ పరీక్షలో టాప్‌టెన్‌లో నేను ఒకట్టి. అలాగే తెలుగు యూనివర్సిటీ ఎంసీజే ప్రవేశ పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ నాదే. అదుపు తప్పి నా నుంచి దూరమైన చదువును మళ్ళీ నా నియంత్రణలోకి తెచ్చుకున్నాను… అదీ అంబేద్కర్ యూనివర్సిటీ సాయంతో. ఒకసారి అదుపులోకి వచ్చాక తిరుగులేకుండా పోయింది. ఇప్పుడెవ్వరూ అనలేరు, అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ వాల్యూ లేనిదీ అని. నేను డిగ్రీ కూడా రెగ్యులర్ స్టూడెంట్ ఎలా చదువుతాడో… అలాగే కష్టపడి సిన్సియర్గా చదివి పాసయ్యా.
ఫెయిల్యూర్, సక్సెస్…
ఉద్యోగం చేస్తూనే.. రెగ్యులర్గా చదివే వాళ్ళు ఎలా మార్కులు తెచ్చుకున్నారో అలాగే మార్కులు తెచ్చుకున్నా. చదువుతో పాటు వారందరికీ లేని ఉద్యోగానుభవం నాకు మిగిలింది. డిగ్రీలు, పీజీలు పాసయ్యాక తెలుస్తోంది. చదువు విషయాల్లో గానీ, సమర్థత విషయంలో గానీ నేనేం తక్కువగా లేనని. నన్ను ఇంటర్లో అపింది, రెగ్యులర్ స్టూడెంట్గా చదవకుండా చేసింది… ఇంగ్లీషు మాధ్యమమే. తెలుగులో ఇంటర్‌చేసి ఉంటే సంప్రదాయక చదువులతో తెలుగు లెక్చరర్‌గా స్థిరపడి వుండే వాణ్డేమో. ఇంగ్లీషు మీడియం తీసుకుని ఇంటర్ ఫెయిలవడం వద్దే నా సక్సెస్ స్టార్టింగ్ పాయింట్ ఉందనిపిస్తోంది. నా కెరీర్లో మార్పునకు, అభివృద్ధికి, సర్కిల్ పెరగడానికి, సమాజంలో జర్నలిస్ట్‌గా గుర్తింపు పొందడానికి, ఇంట్లో అందరూ నన్ను గౌరవించడానికి, నా స్నేహితులు, చదువుల విషయంలో నన్ను సలహాలడిగే స్థాయికి చేరడానికి, అప్పటి ఇంటర్ ఫెయిల్లో పాటు అంబేద్కర్ యూనివర్సిటీలో కాలుమోపడం కూడా కారణమే. అందుకే నేను తెలుగులో పీజీ చేసినా, బీసీజే, ఎంసీజేలు చేసినా, గోల్డ్‌మెడల్ సంపాదించినా… వీటన్నింటికీ అవకాశం ఇచ్చింది అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీయే. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, తేజ టీవీ, ల్యాంకో కంపెనీ, తేజ న్యూస్‌లో వివిధ హోదాల్లో పనిచేయగలిగినా, ఇప్పుడు ధాత్రి కమ్యూనికేషన్స్‌కు సీఈవోగా మీడియా కమ్యూనికేషన్స్ వ్యాపారం లోకి ప్రవేశించినా… ఆ క్రెడిట్ అంతా అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీకే దక్కుతుంది.