43 ఇందిరా ప్రభలో…
రూరల్ డెవలప్మెంట్ వారి నోటిఫికేషన్ చూసి అప్లయి చేశా. ఎపీఆర్ఎల్పీ ప్రాజెక్టులో అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్గా ఉద్యోగం వచ్చింది. నిజానికి జెండర్ సబ్జెక్టుపై మహబూబ్నగర్లో పని చేయాలన్నారు. కాని నేను హైదరాబాద్నుంచి షిఫ్ట్ అయ్యే అవకాశం లేక, హైదరాబాద్లోనే చేస్తానని ఇంటర్వ్యూలో రిక్వెస్ట్ చేశా. కాంప్రహెన్సివ్ లాండ్డెవలప్మెంట్ ప్రోగ్రామ్(ఇందిర ప్రభ)లో ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్గా పనిచేయమన్నారు.
ఎంతో కష్టపడితేనే….
మేము ఎదుర్కొన్న పరిస్థితే మా తమ్ముడు ఎదుర్కోకూడదని, అక్కా నేను కలిసి వాడిని చదివించాం. ఇప్పుడు మా ఆర్థిక పరిస్థితి ఫర్వాలేదు కనుక వాడి చదువుకు అంతగా ఇబ్బంది కాలేదు. సీఫెల్ ద్వారా లీఈడీ చేశారు. ఇప్పుడొక ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. అక్క అంగన్‌వాడీలో టీచర్‌గా పనిచేస్తోంది. ఏమైనా పేద, దళిత కుటుంబంలోంచి వచ్చిన వారు ఎంతో కష్టపడితేనే కానీ చదువుకోవడం, బాగా స్థిరపడడం సాధ్యం కాదు. గెలుచుకున్న ప్రతి అక్షరం వెనుక అంతులేని శ్రమ ఉంటుంది.
అక్షరాస్యతే ముఖ్యం…
ఏ వ్యక్తి జీవితంలోనైనా, మొత్తం సమాజంలో నైనా విద్య విలువైన సాధనం. ఆధునిక సమాజంలో వ్యవహారాలన్నీలిఖిత మాధ్యమంలోనే జరుగుతున్నప్పుడు అక్షరాస్యతే కీలకం అవుతుంది. వ్యక్తి తన ప్రయోజనాలను, హక్కులను కాపాడుకోవడానికి అక్షరాస్యత, విద్య ఆయుధాలు అవుతాయి. ఉపాధి పొందాలన్నా, జీవితంలో స్థిరపడాలన్నా… చివరికి బస్సు ఎక్కాలన్నా అక్షరాలు తెలిసి ఉండాలి. సామాజిక మార్పుకు కూడా విద్య కీలకం. పల్లెల్లో పాతుకుపోయిన అనేక అసమానతలకు, మూఢ నమ్మకాలకు, దోపిడీకీ, హింసకు, అజ్ఞానమే మూలమని నేను అక్కడ తిరిగినప్పుడు గ్రహించాను. నిజానికి అంతర్జాతీయ ఒప్పందాలు, రాజ్యాంగ నియమాలు, రాజ్యాంగ సవరణలు ఎన్ని ఉన్నా ఇప్పటికీ విద్యాహక్కు సంపూర్ణంగా అమలవుతున్న దాఖలాలు కనిపించవు. గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలు ఇంకా పెరగాలి. అవి లేకపోవడం వల్ల దళితులు, ముఖ్యంగా బాలికలు ఎక్కువగా నష్టపోతున్నారు. మగపిల్లలైతే పక్క ఊరికైనా పంపిస్తారు కానీ, ఆడపిల్లలు ఇంట్లో కూర్చోవల్సిందే.