"

42 ‘నిఘాలో ‘ వ్యాసాలు…

రహస్య, రాజకీయ, సామాజిక, ఆర్థిక సాంస్కృతిక, మానవ హక్కుల ఉల్లంఘన రోజూ జరుగుతూనే ఉంది. అణచివేత, ఏర్పాటు, విద్యావకాశాలు నిరాకరించడం, గౌరవంగా బటిక్ హక్కును నిరాకరించడం, ఇలాంటి సంఘటనలు లెక్కలేనన్ని భూమి, నీరు, వేతనాలు, ఇతర జీవన వనరులు అడిగిన సందర్భాలలో దళితులపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. వీటి పై ‘సాక్షి’ సంస్థ పత్రిక నిఘాలో నేను ఆర్టికల్స్ రాసేదాన్ని.

“ఆదివారం కాంటాక్ట్ క్లాసులు వింటే చాలు, సగం సబ్జెక్టు వచ్చేస్తుంది. అంట బావుంటాయి క్లాసులు. ఆ తర్వాత విద్యార్థులంతా కలిసి చర్చించే వాళ్ళం. దానితో ఏంఏ పాసవడం చాలా తేలిక అయింది.”

 

అంబేద్కర్ వర్శిటీ … డిగ్రీ, పీజీ 

సాక్షిలో ఉద్యోగం చేస్తూనే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేశాను. ఉద్యోగం, చదువు కాస్త కష్టమే అనిపించింది కానీ, చదువుపై ఉన్న ఆసక్తి ఆ ఇబ్బందిని జయించగలిగింది. పైగా చదువులో నేను అంత డల్ కాదు. దానితో పాటు నేను చేసే ఉద్యోగం కూడా ఉద్యమానికి సంబంధించే కావడంతో డిగ్రీ చదవడం సులభం అయింది. డిగ్రీలో సోషియాలజీ తీసుకున్నాను. అందుకే ఎంఏలో కూడా సోషియాలజీ చేశాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అదివారం కాంటాక్ట్ క్లాసులు వింటే చాలు, సగం సబ్జెక్టు వచ్చేస్తుంది. అంత బాగుంటాయి క్లాసులు. ఆ తర్వాత విద్యార్థు లంతా కలిసి చర్చించే వాళ్ళం. దానితో ఎంఏ పాసవడం చాలా తేలిక అయింది. దానికితోడు మా బ్యాచ్ అంతా చాలా తెలివైనవారు. అందరూ తర్వాత బాగా సెటిలయ్యారు. సోషియాలజీలో నేను డొమెస్టిక్ వయొలెన్స్ పై ప్రాజెక్టు చేశాను. అరవై ఆరు శాతం మార్కులతో పీజీ పూర్తిచేశాను. ఇంటర్లోనే చదువు ఆగిపోతుందనుకున్న నేను పీజీ చేయడం, ఎంఫిలో కూడా చేరడం ఆశ్చర్యం, ఆనందం అనిపిస్తోంది. దానికి ప్రధాన కారణం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని వేరుగా చెప్పకర్లేదు.

మిస్సయిన ఉస్మానియా ఎంఫిల్…

మదురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ చేస్తున్నాను. నిజానికి ఉస్మానియా యూనివర్సిటీలో కూడాఎంఫిల్ సీటు వచ్చింది. కౌన్సిలింగ్ రోజున జాయిన్ కూడా అయ్యాను. ఇన్‌కమ్ సర్టిఫికెట్ లేకుంటే తెస్తానని రాసిచ్చిబయటికి వచ్చాను. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఫిల్… చాలా గొప్పగా అనిపించింది, ఇరవై అడుగులు వేసి గేటుదాకా వెళ్ళాను. మైకులో ఎనౌన్స్‌మెంట్. నేను నాన్లోకల్ కనుక సీటు కాన్సిల్ అయిందని… చాలా బాధేసింది.అలా ఉస్మానియాలో ఎంఫిల్ చేసే అవకాశం పోయింది. నా కన్నా తక్కువ మార్కులొచ్చిన తెలంగాణ అమ్మాయికి సీటు ఇచ్చారు.

ఆర్థిక ఇబ్బందుల వల్లే…

ఆర్థిక ఇబ్బందుల వల్లే నేను ఉన్నత విద్యకు చేరువ కాలేకపోయా. పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ రాశా. సీటు వచ్చింది.ఎంసెట్ రాశా. సీటు వచ్చింది. టీటీసీ రాశా సీటు వచ్చింది… అన్ని సందర్భాలలో ఆర్థిక ఇబ్బందుల తోనే ఆ కోర్సుల్లో చేరలేకపోయా. సాయం చేయడానికి కూడా ఎవ్వరూ లేకపోయారు. టీటీసీ కాల్‌లెటర్ వచ్చినప్పుడు సాక్షిలో పనిచేస్తున్నా కాల్‌ లెటర్ చూసిన అప్పటి డైరెక్టర్… ‘దేశానికి పంతులమ్మలు కరువా? దళితుల హక్కుల గురించి మాట్లాడేవారు,పోరాటం చేసేవారు కావాలి. నువ్వు ఈ ఫీల్డ్లోనే ఉంటే సమాజానికి ఏమైనా చేయొచ్చు’ అన్నారు. నా కది ఇన్స్పిరేషన్గా అనిపించింది. వెంటనే టీటీసీ కాల్‌లెటర్ చించివేశాను. సాక్షిలోనే ఉండిపోయా. ఏడు సంవత్సరాల తర్వాత కొన్ని కారణాలతో బయటికి రావాల్సి వచ్చింది.

ఆలోచనలేని అభ్యసనం నిరుపయోగం, అభ్యసనం లేని ఆలోచన ప్రమాదకరం.
– ఎమర్సన్

 

 

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

మేముసైతం... Copyright © 2009 by డా ఘంటా చక్రపాణి is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.