37 కుటుంబ పరిస్థితి …
మాది చేనేత కుటుంబం. పూర్వీకులంతా కులవృత్తి చేసి పేదరికంలోనే మగ్గిపోయారు. మా పరిస్థితీ అంతే. తాత ముత్తాతల ఆస్తిపాస్తులేం లేవు. వారు మా చేతికి మిగిల్చి వెళ్ళిన మగ్గం మా బతుకులకు చిరుగులనే మిగిల్చింది. అందుకే మా నాన్న నేతను వదలి బడిపంతులు ఉద్యోగం ఎన్నుకున్నారు. అదీ అంతంత మాత్రమే ఆదుకున్నది. మేము ఐదుగురం సంతానం. నాన్నకు కుటుంబ భారం పెరిగింది. ఉద్యోగానికి తోడు చిన్నచిన్న వ్యాపారాలను చేసి నిలదొక్కుకోవడానికి ప్రయత్నించారు. కానీ కాలం కలిసి రాలేదు. ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాం. అది నేరుగా మా చదువులపై ప్రభావం చూపింది. ఉన్నత చదువులకు దూరమయ్యాయి. అక్కా చెల్లెళ్ళం నలుగురం పదవ తరగతి వరకే చదివాం.
స్పిన్నింగ్ మిల్ లో పనికి …
ఆర్థిక భారాన్ని మోయడం నాన్న ఒక్కడి వల్లా కావడం లేదు. ఒంటి చేత్తో బతుకు నేత అసాధ్యం కదా. అందుకే మేమందరం తలో చేయి వేశాం. నలుగురం దగ్గర్లోనే ఉన్న స్పిన్నింగ్ మిల్ కంపెనీలో కార్మికులుగా చేరాం. చదువు దూది పంజరంల గాలికి కొట్టుకు పోయింది. బతుకు బరువు ముందు అది అల్పం. దాదాపు మూడు సంవత్సరాలు ఆ కంపెనీలో పనిచేశాం. ఆ తర్వాత ముగ్గురు అక్కల పెళ్ళిళ్ళు జరిగాయి. కుటుంబం గడవడమే కష్టం అంటే ఇది ఆదారం అయింది. ఇంటి పరిస్థితి ఇంకా ఘోరంగా మారింది. భయంకరమైన పేదరికం. తినడానికి తిండి కూడా లేని పరిస్థితిని ఎదుర్కొన్నాం.
విద్యావాలంటీరుగా
చదువు విషయానికొస్తే నేను పుట్టిన ఊరురాల్ గడి మలక్పేట(రంగారెడ్డి జిల్లా) లోని స్కూల్లో టెంత్ దాక లేదు. అక్కడ సెవెన్త్ వరకూ చదువుకుని పొరుగూరిలో టెన్త్ చదివాను. చిన్నప్పటి నుంచి చదువంటే ప్రాణం. ప్రతి తరగతిలో నేనే ఫస్ట్, చదువే కాదు…పాటలు, పద్యాలు, ఆర్ట్, ఆటలు, కల్చరల్ యాక్టివిటీ స్లో చురుగ్గా ఉండేదాన్ని,అమ్మాయిలు పొరుగూరికి పోయి చదవడమే కష్టం. అలాంటిది అక్కా చెల్లెళ్ళం పదవ తరగతి దాకా చదవగలిగాం. అక్కలందరి చదువు పరవ తరగతి వద్దే ఆగిపోయింది. ఇక నా పనీ అంతే అనుకున్నాను. పైగా కంపెనీలో రోజువారీ కూలి. అప్పటి దాకా చదువుల్లో ఫస్ట్గా ఉన్న నేను కంపెనీలో పనికి కుదరడంచాలా బాధగా అనిపించేది. అందుకే రోజువారీ కూలీ పని చేస్తూనే ప్రైవేటుగా ఇంటర్ పరీక్షలు రాసి పాసయ్యాను. దానితో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యావాలంటీర్ గా మా ఊరిలోనే ఉద్యోగం వచ్చింది. కంపెనీ కూలి పని నుంచి మోక్షం లభించింది. మళ్ళీ చదువుల తల్లికి దగ్గరయ్యాను. కాసింత ఊరట. నేను చదివిన పాఠశాలలోనే ఉద్యోగం దొరకడం అదృష్టంగా భావించాను. పైగా ఆ పాఠశాలలోనే మా నాన్న కూడా ఉపాధ్యాయుడు.
అంబేద్కర్ వర్శిటీ… డిగ్రీ
ఆ పాఠశాలలో సహోద్యోగుల ప్రోత్సాహంతో అంబేద్కర్ యూనివర్సిటీ లో డిగ్రీ చేశాను. నాకు మొదటి నుంచీ తెలుగు సాహిత్యంపై ఆసక్తి ఉండేది.అందుకే డిగ్రీలో తెలుగు సాహిత్యం, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టులు తీసుకున్నాను. అలా ప్రైవేటు టీచర్గా ఉంటూనే డిగ్రీ చదివాను. సుహాసినీ, హనుమంతరెడ్డి,మోహన్ రెడ్డి, గోపాలరెడ్డి… ఈ ఉపాధ్యాయులంతా నాకెంతో సహకరించారు, ప్రోత్సహించారు. గోపాలరెడ్డి భార్య మజెమ్మ అంబేద్కయూనివర్సిటీ క్యాంపస్లో పని చేస్తున్నారు. నేను డిగ్రీ పూర్తి చేయడానికి వీరి ప్రధాన కారణం. వీరిని నా జన్మంతా స్మరిస్తాను. డిగ్రీఫస్టియర్లోనే నాకు వివాహం అయింది. ఆయన పెద్దగా చదువుకోకపోయినా విద్యపై అభిమానం,గౌరవం ఉన్నవారు. ఉన్నత చదువులు చదవాలన్న నా ఆశకు ఆయన ఊపిరి పోశారు.
చదువుల గ్రాఫ్…
ఎంపీ(తెలుగు) కూడా అంబేద్కర్ యూనివర్సిటీలో చేయాలనుకున్నా కానీ ఆ సబ్జెక్ట్ అక్కడ లేదని తెలియడంతో ఉస్మానియా నుంచి ఎంపీ(తెలుగు) చేశా.అంబేద్కర్ యూనివర్సిటీలో పడిన ఉన్నత చదువుల పునాదిపై ఎంఏ, ఎంఫిల్,పీహెచ్డీలను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సాధించాను. అంతకు ముందే తెలుగు పండిట్ శిక్షణను పూర్తిచేసి డీఎస్సీ ద్వారా పండిట్ గ్రేడ్-I, పండిట్గ్రేడ్-II ఉద్యోగాలను పొందగలిగాను. యుజీసీ వారు నిర్వహించే నెట్/కేరర్ పరీక్షను పీఠిక తర్వాత రాసి అత్యున్నతమైన కేరర్ అవార్డుపొందాను.
2005లో పాఠశాలకు సెలవు పెట్టి పీహెచ్డీ పరిశోధక విద్యార్థిగా ఉంటూ హైదరాబాద్లో కోటి మహిళా కళాశాలలో లెక్చరర్గా పనిచేశాను. అలాగే సికిందరాబాద్ వైఎంసీఏ బాలుర జూనియర్ కాలేజీలోని అంబేద్కర్ యూనివర్సిటీ కేంద్రంలో తెలుగు సాహిత్యంలో కౌన్సెలర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉన్నది. ఇక్కడే డిగ్రీ చేసిన నేను ఇక్కడే కౌన్సెలర్గా పని చేయగలిగాను.