"

చదువు ద్వారా సాధికారత

సెంటర్ ఫర్ సోషల్ ఎంపవర్ మెంట్ 

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్

మనం నాగరికత సమకూర్చిన వస్తుగత ప్రయోజనాలను వదులుకోవచ్చునేమోగాని, సర్వోత్కృష్టమైన విద్య అందించే ఫలాలను సంపూర్ణంగా అనుభవించే అవకాశాలను, హక్కులను మాత్రం కోల్పోకూడదు – డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్

సమసమాజ స్థాపనకు విద్యే సరైన ఆయుధమన్న బాబాసాహెబ్ తాత్విక సూత్రాన్ని స్ఫూర్తిగా చేసుకుని డా. బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం సమాజంలోని అన్ని వర్గాలకూ మెరుగైన విద్య, శిక్షణ అందించాలనే లక్ష్యంతో కొనసాగుతోంది. ఈ దిశలో విశ్వవిద్యాలయం ఇప్పటికే 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అణగారిన వర్గాల వారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని విద్యద్వారా అందుబాటులోకి తేవాలన్న ప్రయత్నంలో లక్షలారి మంది జీవితాల్లో కొత్త వెలుగు ప్రసాదించిన డా. బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక నిశ్శబ్ద విప్లవానికి వేదికగా నిలిచిపోయింది.

డా॥ అంబేద్కర్ విశ్వవిద్యాలయం రజతోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని విద్యావకాశాలను మరింత సరళతరం చేస్తూ విశ్వవిద్యాలయాన్ని సామాన్య ప్రజానీకానికి మరింత చేరువగా తీసుకు వెళ్ళాలన్న లక్ష్యంతో ‘సెంటర్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్’(సిఎస్ఇ) ప్రారంభమైంది. దూరవిద్యా మండలి(డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్) ఆర్థిక సహకారం, ప్రోత్సాహంతో ప్రారంభమైన సి.ఎస్.ఇ లక్ష్యం సామాజిక సాధికారత, సంపూర్ణ వికాసం సమాజంలో అన్ని వర్గాలకూ సమానమైన అవకాశాలు దక్కాలన్నది మా స్వప్నం. మరీ ముఖ్యంగా అణగారిన వర్గాలు, చారిత్రకంగా అణచివేత మూలంగా విద్యకూ, విజ్ఞాన వికాసాలకూ దూరమైన వారికి దూరవిద్య ద్వారా చేరువై వారిలో నిభిదీకృతమైన శక్తులను వెలికితీసి వారిలోని నైపుణ్యాలకు సానపెట్టాలన్న ప్రయత్నం మాది.

సాధికారిత అనేది ఒక విస్తృత భావన. ఒక మనిషిలో లేదా సముదాయంలో అంతర్గతంగా ఇమిడి ఉన్న శక్తియుక్తులను వెలికితీసి వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఆధ్యాత్మికంగా బలోపేతం చేసే సాధనం. తమ జీవితాలను తామే సృజనాత్మకంగా మలుచుకునే ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించే ఆయుధం. వ్యక్తుల్లో, సామాజిక వర్గాల్లో విద్యపట్ల, అభివృద్ధి పట్ల, హక్కులపట్ల, మానవీయ విలువల పట్ల, ప్రపంచం పట్ల, ఆ ప్రపంచ గమనం పట్ల అవగాహన కలిగించడం ఈ సెంటర్ ఉద్దేశాల్లో ప్రధానమైనవి.

సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ తో పలువురు ప్రముఖ విద్యావేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు, పరిశోధకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలిసి పనిచేస్తున్నారు. విద్యా వికాసానికి దోహదపడాలని, వికాసం సమానత్వానికి తోడ్పడాలని సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ ఆశిస్తోంది. చదువుకుని సాధికారత సాధించిన మా విద్యార్థులను మీ అందరికీ పరిచయం చేయాలన్న లక్ష్యంతో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నాం. ఇది విశ్వవిద్యాలయం గడచిన 25 సంవత్సరాల కృషికి అద్దం పడుతుందని ఆశిస్తున్నాం.

డా॥ ఘంటా చక్రపాణి సమాజశాస్త్ర శాఖ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. అలాగే ఈ విశ్వవిద్యాలయం రజతోత్సవాల సందర్భంగా దూరవిద్యా మండలి సహకారంతో “సెంటర్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్’(సిఎస్ఇ)ను ఏర్పాటుచేసి ఆ ప్రాజెక్టు డైరెక్టరుగా కూడా ఉన్నారు. అధ్యాపకుడిగానే కాక రచయితగా, పాత్రికేయుడిగా, సామాజిక, రాజకీయ విశ్లేషకుడిగా మానవ హక్కుల ఉద్యమ కార్యకర్తగా చక్రపాణి సుపరిచితులు.

Media Attributions

  • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ Photograph from DrBRAOU

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

మేముసైతం... Copyright © 2009 by డా ఘంటా చక్రపాణి is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.