"

33 జూనియర్ లెక్చరర్ గా… 

2001 సంవత్సరంలో ఎంఫిల్ నోటిఫికేషన్ వచ్చింది. ఐదవ ర్యాకు సాధించి ఎంఫిల్ అడ్మిషన్తో ఓల్డ్ పీజీ హాస్టల్కు చేరాను. ఇక అక్కడి నుంచి చదువు పతాక స్థాయికి చేరింది. రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలదాకా చదివే వాడిని. ఇంతలో జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ పడింది. గతంలో ‘గ్రూపు’ పరీక్ష రాసిన అనుభవం, సివిల్స్ కోచింగ్, అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ పునాది బాగా ఉపయోగపడ్డాయి. చివరికి అనుకున్న లక్ష్యం సాధించాను. జూనియర్ లెక్చరర్ అయ్యాను. ఆటో నడిపిన నేను… జీవితంలో అనేక పాఠాలు నేర్చుకున్న నేను… ఇక పిల్లలకు పాఠాలు నేర్పాలి.

అంబేద్కర్ వర్సిటీకి కృతజ్ఞతలు

ఎక్కడ కంది గ్రామం… ఎక్కడ దళితవాడ. ఇసుక బట్టీల్లో, చక్కెర ఫ్యాక్టరీల్లో నలిగిన బాల్యం… ఆటో చక్రాలతో పరుగిడిన యవ్వనం. అక్షరమక్షరాన్ని చెమట చుక్కలు పిండి సాధించిన ఆనందం. అడుఅడుగు ఎదుగుతూ… నాకు నేను ప్రోత్సహించుకుంటూ… దీని చుట్టూ అంబేద్కర్ యూనివర్సిటీ మెరుపు ఉంది, ఇంటర్ ఫెయిలై, చదువుకు దారులు మూసుకు పోయాయనుకున్న సమయంలో అంబేద్కర్ యూనివర్సిటీ దారిచూపింది. క్యాంపస్ చదువులకు చేర్చింది. ఉన్నత విద్యా పఠానాలను కల్పించింది. నాకు గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చింది. జీవితంలో స్థిరపడేలా చేసింది. భూమయ్య మాస్టారు, సాయిలు మామ, ముసలయ్య సారు… వీరందరి తోపాటు నేను శిరసు వంచి నమస్కరించేది అంబేద్కర్ యూనివర్సిటీకే. దళితవాడ కూలీని, హైదరాబాద్ వీధుల్లో ఆటో డ్రైవర్ను…ఇప్పుడు లెక్చరర్గా చేసింది అదే.

పేరు ప్రఖ్యాతలు పెరుగుతున్న కొద్దీ తలదించుకునే నడవాలి తప్ప, తలకెక్కించుకోకూడదు.
– హరివంశరాయ్

 

 

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

మేముసైతం... Copyright © 2009 by డా ఘంటా చక్రపాణి is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.