29 చదువు రాసిన సువర్ణ చరిత
అంతా ఆటలే …
ప్రైమరీ ఎడ్యుకేషన్ బీర్కూర్లోనే. ఏడు, ఎనిమిది తరగతులు మాత్రం చెన్నయ్‌లో చదివాను. మళ్ళీ తొమ్మిది, పదవ తరగతులు బీర్కూరు గవర్నమెంట్ స్కూలు. టీచర్లంతా నిజామాబాద్ నుంచి వచ్చేవారు. టీచింగ్ అంతంత మాత్రం.మా టెన్త్ బత్చ్ లో అంతా ఫెయిలయ్యాం. అప్పటికి నాకు చదువుపై ఆసక్తి తక్కువ. ఆటలంటే మాత్రం మహా ఇష్టం. చదువు తప్ప మిగతా వాటిలో చాలా యాక్టివ్. వ్యాసరచన, స్టోరీ టెల్లింగ్, క్యారమ్స్, భోఖో… ఏదైనా వరుస పెట్టి నాకే ప్రైజులు. ఓసారి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కువచ్చిన ఎమ్మెల్యే ఆశ్చర్యపోయారు నా ప్రైజులు చూసి. అలా ఆటలపై ఆసక్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ నాకు ఆటలంటే మహా ఇష్టం. అదే అవకాశం వస్తే ఏమాత్రం వదిలేది లేదు. బాల్యం గుర్తు చేసుకుంటే టెంత్ ఎని సార్లు ఫెయిలైనాసన్న బాధ కన్నా… ఆటలతో బాల్యం బాగా ఎంజాయ్ చేశానన్న ఆనందమే ఎక్కువ. స్నేహితులతో కలిసి వెన్నెల్లో రాత్రి పదిగంటల దాకా ఆడాను. ఇపుటి బాల్యానికి లేని అద్భుతమైన ఆనందం అది.
మళ్ళీ టెన్త్ ఫెయిల్
టెన్స్‌లో మూడు సుబ్జేక్ట్లు పోయాయి. మ్యాథ్స్ సైన్స్, ఇంగ్లీషు. మా నాన్ననేను మెడిసిన్ చేయాలని అంటుండే వారు. ఇంట్లో ఆ వాతావరణం లేకుండేదనుకోండి. నేను ఫెయిలై కూర్చున్నా. ఇంకా చిన్నదాన్నే పరమూడేళ్ళే కావడంతో మళ్ళీ టెన్స్‌లో వేశారు. అదే స్కూలు, అదే చదువు… మరియు ఆటలు. అలాగే అవే సబ్జెక్టుల్లో టెన్త్ ఫెయిలయ్యాను. అంతే, చదువుకు బ్రేక్ పడింది. ఆటలు మాత్రం మానలేదు. రెండు మూడు సంవత్సరాలు ఖాళీ. లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకుని చదవడం, స్నేహితులతో ఆటలు. క్లాసు పుస్తకాలంటే అయిష్టం కానీ, మిగతా జనరల్ నాలెడ్జ్, చరిత్ర ఇలాంటి పుస్తకాలు మాత్రం బాగా చదివేదాన్ని. ఇక ఖాళీగా ఉన్నానని పెళ్ళి చేస్తా మన్నారు ఇంట్లో. అదే జరిగితే ఏ ఇంటిలో గృహినిగా సెటిలయ్యేదాన్ని ఈ హోదా కలే అయ్యేది.
‘కల’ కలం …
నా జీవితాన్ని మార్చేసిన రకం ఇది. అప్పటికి 17 ఏళ్ళు అనుకుంటా. పూర్తిగా గుర్తులేదు కానీ, చదువుకు సంబంధించిందే. బాగా చదువుకున్నట్టు, ప్రపంచం అద్భుతంగా మారిపోయినట్టు, ఇంకా చదువుకోవాలని ఆశపడుతున్నట్టు. తెల్లారి లేచిన దగ్గర్నుంచీ అదే ఆలోచన. రోజంతా ఏడుస్తూ కూర్చున్నా అప్పటికే పెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నారు. నేను చదువుకుంటానని పట్టుబట్టాను. ఆ రోజంతా ఏడుపు, ఉపవాసం, మొత్తానికి ఇంట్లో సరేసన్నారు. అదీ టర్నింగ్.
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ…
అప్పుడే అంబెడ్కర్ ఓపెన్ వర్శిటీ నోటిఫికేషన్ పడింది. బహుశా మాదే ఫస్ట్ బ్యాచ్. టెన్త్ రాయడం, ఇంటర్ చేయడం… ఇదంతా ఎందుకు ఓపెన్ వర్శిటీ నుండి డిగ్రీ చేస్తావా అని నాన్న అడిగారు. సరేనన్నాను. అంబెడ్కర్ ఓపెన్ యూనివెర్సిటీతో పాటు, ఆంధ్రా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసాను. రెండింటిలో పాసయ్యాను. ఆంధ్రా యూనివర్సిటీ స్టడీ సెంటర్ లేదు. అంబేద్కర్ వర్సిటీకి నిజామాబాద్ లో స్టడీ సెంటర్ ఉంది. అందుకే ఈ యూనివర్సిటీలో చేరిపోయాను. ఆదివారాలు క్లాసులకు అటెండ్ అయ్యేదాన్ని.
ఇంగ్లీష్ మీడియం …
టెన్త్‌లో ఇంగ్లీషు రెండుసార్లు ఫెయిలైన నేను డిగ్రీ ఇంగ్లీషు మీడియంలో రాయడం ఒక సాహసం. నా ఈ నిర్ణయం విని నాన్న ఆశ్చర్యపోయారు. ఇంగ్లీషు అక్షరం ముక్కరాదు. ఇంగ్లీషు మీడియం ఎలా చదువుతావు అన్నారు. కానీ, నేను ఏదైనా ఒక పట్టాన వదిలేదాన్ని కాదు. అనుకున్నానంటే నూరు శాతం పర్ఫెక్ట్గా చేయాల్సిందే. డిగ్రీలో ఇంగ్లీషు లిటరేచర్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ తీసుకున్నాను. ఇంగ్లీషులో చాలా పూర్. ఇక దానిపై పడ్డాను. చేతిలో అక్స్‌ఫర్డ్ డిక్షనరీ… ఒక గ్రామర్ బుక్. ఒక్కొక్క పదం, ఒక్కో వాక్యం నాకు నేనే నేర్చుకున్నాను. పల్లెటూళ్లో మరో అవకాశం లేడు. ట్యూషన్ చెప్పడానికి ఎవరూ లేరు. ఆదివారం నిజామాబాద్‌లో స్టడీ క్లాసులకు వెళ్ళినప్పుడు జిల్లా లైబ్రరీలో రిఫరెన్స్ పుస్తకాలు తెచ్చుకుని చదివేదాన్ని. మొదటి నుంచీ పుస్తకాలు చదివే అలవాటు బాగా ఉపయోగపడింది. ఇంగ్లీషు లిటరేచర్ తీసుకోవడం వెనుక చిన్న కారణం ఉంది. మా దగ్గర ఓ సభకు ఎన్టీఆర్ వచ్చారు. ఆయన ప్రసంగం, అక్కడ జర్నలిస్టుల హడావుడి, ఆ తర్వాత పేపర్లలో వారి రిపోర్టింగ్ నాకు చాలా ఆసక్తి అనిపించింది. ఆ తర్వాత మా దగ్గర రేషన్ షాపులో జరుగుతున్న అవకతవకలపై ఆంధ్రప్రభకు లెటర్ రాశాను. పాఠకుల లేఖలో అది నా పేరు, ఊరుతో సహా అచ్చయ్యింది. చాలా త్రిల్లింగ్. అప్పటి నుంచీ జర్నలిజంపై ఆసక్తి కలిగింది. నిజానికి నాన్న ‘లా’ చేయమనేవారు. నాకేమో జర్నలిస్ట్ కావాలని, జర్నలిస్ట్ కావాలంటే ఇంగ్లీషు లిటరేచర్ చదవాలని ఎవరో చెప్పారు. అందుకే డిగ్రీలో ఇంగ్లీషు లిటరేచర్ తీసుకున్నా… ఇంగ్లీషు రాకపోయినా.