"

తలెత్తుకుని నిల్చిన పిడికెడు చైతన్యం – జాజుల గౌరి

తలెత్తుకుని నిల్చిన పిడికెడు చైతన్యం – జాజుల గౌరి

చీకట్లు కమ్ముకున్న జీవితంలో అక్షరాలు నక్షత్ర లా ఎలా మిలమిలా మెరుస్తాయో ఆమెకు తెల్సు, అమావాస్యలను తొలగిస్తూ డిగ్రీలు చందమామల్లా ఎలా వెన్నెల పంచుతాయో ఆమెకు అనుభవం. దళిత కుటుంబం నుంచి వచ్చి చదువుకు దూరమైన రాజుల గౌరి… తన ప్రతి చెమట చుక్కను అక్షరంగా మార్చి రచయితగా ఎలా ఆవిర్భవించిందో, అక్షరంపై సాధికారత ఎలా సంపాదించిందో, ఆమె జీవిత సంఘర్షణలు, అవమానాలు సాక్ష్యాలిస్తాయి. ఎనిమిదో తరగతితో చదువు మానేసి, పదమూడేళ్ళకు పెళ్ళికూతురై, పెళ్ళంటే ఏవిటో తెలియకుండా అత్తగారింట్లో అడుగు పెట్టింది. ఉప్పెనలా తన చుట్టూ ముసురుకుంటున్న ఆర్థిక సమస్యలు, అవమానాలు, బాధ్యతలను జయించడానికి చదువే మార్గమని నమ్మింది. రోజుకు ఐదు రూపాయల కూలీగా పనిచేసినా, మీటర్ ఫ్యాక్టరీలో రోజుకు 7.30 కూలికి చెమటోడ్చినా, నాలుగు డబ్బులు మిగులుతాయని నమ్మింది. నాలుగు డబ్బులు మిగులుతాయని ప్లాస్టిక్ పేపర్లు కడిగే పనికి కుదిరినా, ఆమె మనసు నిండా శిఖరంలా పెరుగుతున్నది చదువుకోవాలనే ఆకాంక్ష… కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, కూలి పని భారం, సామాజిక అంక్షలు వీటన్నింటి మధ్య ఆమె శిఖరాయమాన పట్టుదలను చూసి చదువుల తల్లి వేయి చేతులతో ఆమెను ఆహ్వానించింది,  అభినందించింది. ఇప్పుడామె చేతిలో అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ, బీసీజే, ఎంసీజే, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం ఉన్నాయి. ఆమె రాసిన ‘మన్నుబువ్వ’ కథా సంకలనానికి వరించిన ప్రతిష్ఠాత్మక అవార్డులున్నాయి. ఆమె మనసు నిండా మట్టివాసన వేసే కవితలున్నాయి, జీవితమంతా సుగంధాలు చిమ్మే ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయి. అవి సాకారం చేసుకునేందుకు ఆమెకు… తాను సాధించిన అక్షరాలున్నాయి..

Media Attributions

  • gouri

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

మేముసైతం... Copyright © 2009 by డా ఘంటా చక్రపాణి is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.