చదువుతో వచ్చిన సదవకాశం – కొండ్రు పుష్పలీల

అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ ఆమె జీవితాన్ని అనూహ్యంగా మార్చేసింది. కాలేజీలోకి, ఉస్మానియా యూనివర్సిటీలోకి, ఉద్యమాల్లోకి, చర్చల్లోకి, ప్రజల్లోకి, రాజకీయాల్లోకి, చివరికి అధికారంలోకీ ఆమెను నడిపించింది. అప్పటిదాకా సాధారణ గృహిణిగా ఉన్న పుష్పలీల అమాంతం ఎమ్మెల్యేగా, మంత్రిగా అవతరించారు. కుటుంబం అలనా పాలనకు మాత్రమే పరిమితమైన ఆమె జీవితం అనేక సామాజిక ఆంక్షలను బద్దలు కొట్టుకుని విశాల ప్రపంచంలోకి విస్తరించింది. అక్షరంతో పాటు వచ్చిన అదృష్టం ఆమె జీవితాన్ని మార్చేసింది. చదువు ఇచ్చే ధైర్యం, గౌరవం, ఆత్మవిశ్వాసం ఆమెకు అనుభవంలోకి వచ్చాయి. ‘దళిత కుటుంబంలో పుట్టిన నేను ఇంటికే పరిమితం కాకుండా బాహ్యప్రపంచంలోకి వచ్చి భిన్నమైన వ్యక్తులను, వ్యక్తిత్వాలను గమనించగలిగాను’ అంటారామె. లెక్చరర్గా, కౌన్సిలర్గా, రేడియోలో యాంకర్గా, ఎమ్మెల్యేగా, మినిస్టర్గా… ఇన్ని అవతారాలకు అంబేద్కర్ యూనివర్సిటీ అందించిన ‘డిగ్రీ’యే కారణమని పుష్పలీల కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఆటపాటల చదవు…
చిన్నప్పుడు చదువుపై ఆసక్తి ఉండేది కాదు. ఇప్పటి ఒత్తిడి తో పోలిస్తే ఇపుడు తక్కువే . ఎనిమిది మంది సంతానంలో నేను రెండవ దాన్ని చాలా గారాబం, స్కూలుకు వెళ్ళాలంటే బద్దకం, చదువంతా అటా పాటగా సాగింది. ఇంటికి దగ్గర్లోనే చిన్న స్కూల్లో చదివేవాళ్ళం. ఆ తర్వాత సికిందరాలాబ్, మహబూబ కాలేజీ దగ్గర్లోని ‘కాన్వెంట్ స్కూల్’కు మార్చారు. అప్పుడది చాలా ఫేమస్.టాంగాలో వెళ్ళే వాళ్ళం నేనూ మా అక్కయ్య. ఓ రోజు టాంగా రాకపోతే మేమిద్దరం నడిచి వెళ్ళాం. పిల్లలు నడచి వెళ్ళకూడదని మళ్ళీ స్కూలు మార్చి ఇంటి దగ్గరే చిన్న స్కూల్లో వేశారు. కాన్వెంట్లోనే చదివితే ఏమయ్యాదాన్నోమొత్తానికి గవర్నమెంట్ స్కూల్లో పడ్డాం. పదవ తరగతిలోపే ఐదారు స్కూళ్ళు మారాను. టీచర్ నచ్చకపోతే స్కూలు మారడమే. మా నాన్న చదువుపై ఎప్పుడూ ఒత్తిడి చేసేవారు కాదు. కేవలం ప్రోగ్రెస్ రిపోర్టులో ‘ఎర్రగీత’ రాకుండా చూసుకో…అనేవారు.
Media Attributions
- pushpaleela