"

16 అంబేద్కర్ వర్సిటీ, ఎంబీఏ….

అంబేద్కర్ యూనివర్సిటీ ఎంబీఏ కరస్పాండెన్స్ కోర్సు ఆఫర్ చేస్తోందని తెలిసింది. నాకు తెలిసేటప్పటికే ఫస్ట్బత్చ్ అడ్మిషన్ అయిపోయింది. అప్పటి నుంచే ఎంట్రన్స్ పరీక్షకు ప్రిపేర్ అయ్యాను. 1995లో ఎంట్రన్స్ రాశా. 44వర్యాంక్ వచ్చింది. హైదరాబాద్లోని స్టడీ సెంటర్లో జాయిన్ అయ్యే అవకాశం వచ్చింది. కానీ గోదావరిఖని నుంచి ప్రతివారం రావాలంటే కష్టమని వరంగల్ స్టడీ సెంటర్ ఎంచుకున్నాను. ప్రతివారం రెగ్యులర్గా క్లాసులకు హాజరయ్యే వాడిని. వరంగల్కు ప్రతివారం రావాలంటే చాలా కష్టమయ్యేది. ఆదివారం పొద్దున్నే 4 గంటలకు లేవడం, ఐదు గంటలకల్లా రైల్వేస్టేషన్కు, ఎనిమిది గంటల కల్లా వరంగల్ స్టేషన్లో దిగేవాడిని. తొమ్మిది గంటల నుంచి క్లాసెస్. సాయంత్రం నాలుగున్నర నించి. ఐదునారావరకు బ్రెక. ఇంటికి చేరేసరికి రాత్రి తొమ్మిదిన్నర అయ్యేది. వారమంతా కంపెనీలో పని, ఆదివారం రోజంతా చదువు, ప్రయాణం. చాలా కష్టంగా అనిపించేది. కానీ, క్లాసెస్ బాగా ఉపయోగపడతాయి. అందుకే వాటిని మిస్సయ్యేవాడిని కాదు. ప్రతి సంవత్సరం చివరిలో కరెస్పాండెన్స్ కోర్సులు చేసే విద్యార్థులకు అంబేద్కర్ యూనివర్సిటీ వారు కౌన్సిలింగ్ క్లాసులు నిర్వహిస్తారు.

అవి ఎంతో ఉపయోగకరమైనవి.మార్కెట్ విజ్ఞానం కూడా పెంచే విధంగా ఉంటాయి. పరీక్షలకు ముందు ప్రతి ఏటా వారం రోజులు సెలవుపెట్టి ఫ్రీ అయ్యేవాణ్ణి. దానితో ఎప్పుడూ ఫెయిలవ కుండా ఎంబీఏ పూర్తిచేశాను. పని  ఒత్తిడి లో కూడా ఎంబీఏ పూర్తి చేయగలిగాను. ఎంబీఏ కల నెరవేరడంతో పాటు ఉద్యోగంలో ఇంక్రిమెంట్ కూడా ఇచ్చారు. 2005 సంవత్సరంలో మళ్లీ నేషనల్ సంస్థ ‘వోల్వో’లో రీజినల్ మేనేజర్గా చేరాను. మంచి ఉద్యోగం. చెల్లెలు,తమ్ముళ్ళు కూడా బాగా చదువుకున్నారు. దానితో జీవితంలో మంచిగా స్థిరపడ్డారు. మా అబ్బాయి, అమ్మాయి కూడా బాగా చదువుతున్నారు.

***

గొప్ప లక్ష్యాన్ని సాధించాలని ప్రయత్నించి విఫలం కావడం నేరం కాదు. గొప్ప లక్ష్యం లేకపోవడం నేరం.

-లోవెల్

చూశారుగా, బాగా చదువుకోవాలన్న అమ్మ మాటలు… నన్నెక్కడి దాకా తీసుకు వచ్చాయో. నేను చదువుకోవడంతో పాటు మా వాళ్ళను కూడా చదివించగలిగాను. అంబేద్కర్ యూనివర్సిటీ ఎంబీఏతో మంచి ఉద్యోగంలో సెటిలయ్యాను. అర్జునుడు పిట్ట కన్నును మాత్రమే చూసినట్టు నేను నా చిన్నప్పటి నుంచి పైచదువులపైనే దృష్టి పెట్టాను. ఎన్ని అవరోధాలైనా అధిగమించగలిగాను. స్థిరపడగలిగాను. దానికి అంబేద్కర్ యూనివర్సిటీ సాయం చేసింది.

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

మేముసైతం... Copyright © 2009 by డా ఘంటా చక్రపాణి is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.