అభినందన

ఆచార్య ఓ.ఆర్.రెడ్డి
వైస్ ఛాన్సలర్
అందరికీ ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకు రావాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేయడం ద్వారా 1982లో డా॥ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడమైంది. ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో 2006లో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలలో భాగంగా ‘మేము సైతం’ పేరుతో డా॥ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో చదివి, ఉన్నత శిఖరాలను అధిరోహించిన కొంతమంది విద్యార్థుల విజయగాథలను, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సహకారంతో ఈ విశ్వవిద్యాలయంలో నెలకొల్పిన, సెంటర్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్ ప్రచురించడం చాలా సంతోషం. రెండు సంవత్సరాల పాటు సెంటర్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్ అనేక మంది విద్యార్థుల విజయ గాథలను వెలుగులోకి తీసుకొచ్చింది. వాటిలో విలక్షణమైన కొన్నింటిని ఈ పుస్తకంలో పొందుపరచడమైంది.
ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భాన్ని పురస్కరించుకుని 25 మంది విద్యార్థుల జీవిత గమనాన్ని, జీవితంలో వారు విద్య ద్వారా సాధించిన విజయాలను ఈ పుస్తకంలో విశదీకరించడమైంది. ఈ విజయ గాథల ప్రచురణ ఉద్దేశం డా| బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ కీర్తిని చాటుకోవడంగాదు. ప్రపంచ ప్రజలకు ఈ విశ్వవిద్యాలయంలో చదివిన విద్యార్థుల ప్రతిభా పాటవాలను గురించి తెలియజేయడమే మా ప్రధాన ఉద్దేశం. విద్యార్థులు తాము అధిరోహించిన విజయ సోపానాలను సరళమైన భాష, సమగ్రమైన భావన స్ఫురించే రీతిలో రూపొందించిన ఈ సంకలనం, చదువు పట్ల ఆసక్తిని ఏ కొంత మందిలోనైనా పెంచగలిగితే సెంటర్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్ ఆశయం, లక్ష్యం నెరవేరినట్లే. ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్న అశేష జనానికి, వివిధ రంగాలలో ఈ విశ్వవిద్యాలయ సహకారంతో ఉన్నత స్థానాలకు ఎదిగిన విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. ఈ పుస్తకాన్ని ప్రచురించడంలో చొరవ చూపిన సెంటర్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్లో భాగస్వాములైన ప్రతీ ఒక్కరికి అభినందనలు.
(ఓ.ఆర్.రెడ్డి)
Media Attributions
- ఆచార్య ఓ ఆర్ రెడ్డి Photograph from DrBRAOU