పాన్ షాప్ నుండీ వోల్వో మేనేజర్ గా – వెంకటేశ్వరరావు

నాన్న బొగ్గుగని కార్మికుడు_ బొగ్గుగని వెనుక ‘యముని మహిషపు లోహ గంటల’ చప్పుడే వినిపించేది. భూతంలా తెరుచుకున్న గనిలోకి నాన్న పోతున్నప్పుడల్లా అతని లేత గుండెలు ఆవిసిపోతుండేవి. గని కార్మికుల మరణాలు ప్రశ్నలు రేకెత్తించేవి. చదువులేమి ఎలాంటి పనులు చేయిస్తుందో, బతుకు తెరువుకోసం మృత్యువు అంచుదాకా ఎలా వెళ్ళేలా చేస్తుందో అమ్మ మాటలతో తెల్పింది. అప్పుడే అతనికి చదువు విలువ మనసుకు పట్టింది. అందుకే ఆర్థికస్థితి ముళ్ళబాట పరుస్తున్నా, పాన్ షాప్ నడపాల్సి వచ్చినా, తన ఉన్నత విద్య లక్ష్యాన్ని మరచిపోలేదు. చెల్లీ, తమ్ముళ్ళ చదువుకోసం, కుటుంబ భారాన్ని మోయడం కోపం ఉద్యోగాలెన్నో చేయాల్సి వచ్చినా ఉన్నత విద్యను విస్మరించలేదు. అంబేద్కర్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసి బహుళజాతి సంస్థలో మేనేజర్ అయ్యారు. చెల్లీ, తమ్ముళ్ళను స్థిరపడేలా చేశారు. కష్టాలను జయించారు. పాన్ షాపు నుంచి వోల్వో సంస్థ మేనేజర్ దాకా వెంకటేశ్వరరావు ప్రస్థానం సాగింది.
నేను జీవితం ఎక్కడ నుంచి మొదలు పెట్టానో చెబుతాను. ఆర్థిక సమస్యలు మనిషిని ఎలా ఎదగకుండా అడ్డుకుంటాయో చెబుతాను. అన్ని సంకెళ్ళ మధ్య నుంచి నేనెలా బయటపడగలిగానో చెబుతాను. లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు మార్గం ఎన్ని ముళ్ళ పొదలతో ఉన్నా లక్ష్య సారన సాధ్యమేనని నమ్మిన వాడిని నేను. ఒక్కసారి నా జీవితపు పుటల్లోకి రండి –
మాది కరీంనగర్ జిల్లా గోదావరిఖని. ఐదు దశాబ్దాల క్రితం ఇక్కడికివచ్చిన మా నాన్న బొగ్గుగని కార్మికుడిగా చేరాడు. బొగ్గు వెలికి తీయడానికి 1960 లో అధునిక టెక్నాలజీ ఉండేది కాదు. భూమి పొరల్లోంచి బొగ్గునుమనుషులు తవ్వి తీయాల్సిందే. అత్యంత ప్రమాదకరమైన పని ఇది. ఎంతోమంది చనిపోయేవారు. ఇది నా బాల్యాన్ని ఎంతో కలవర పెట్టింది. బతుకుతెరువుకోసం చేసే పని బతుకునే మింగేయడం. గనిలో కూరుకుపోయి మరణించిన కార్మికుల శవాలు వారి ఇళ్ళకు తీసుకు వస్తుంటే అంతులేని విషాదం.భార్యా పిల్లలు, బంధువుల రోదన… పనికోసం బతుకును బలిపెట్టడం నా చిన్నమనసుకు మింగుడు పడేదికాదు. అసలెందుకు మరణిస్తున్నారన్న ప్రశ్న వేధించేది. నేను ప్రశ్నలతో అమ్మను వేధించేవాడిని. గని పైకప్పు కూలి కార్మికులు మరణిస్తున్నారని అమ్మ చెప్పేది. మరి ఎందుకు ఆ పని చేయడం అనేది నా ప్రశ్న.
“మనకు చదువుల్లేవు. అందుకే ఇలాంటి పని” అని అమ్మ సమాధానం. చదువుఎంత అవసరమో మనసులో నాటుకున్న సందర్భం అది. ఏదైనా జరగరానిది మా కుటుంబానికి కూడా జరిగితే, అన్న ప్రశ్న వెన్నును వణికించేది. నాన్నపనికి వెళ్ళినప్పుడల్లా భయం వేసేది. ‘నువ్వు నాలాగా చదువుకుంటే ఇలాంటికష్టాలు ఉండవు. కష్టపడి చదువుకో…” అని అమ్మ అంటుండేది. ఆ మాటలేనాకు మార్గదర్శకం అయ్యాయి. చిన్నప్పుడే నా లక్ష్యం ఏమిటో నాకు స్పష్టమయింది. కానీ అది చేరడం అంత సులభం కాదని తర్వాత తెలిసింది. ఎందుకంటే దారినిండా ముళ్ళే.
Media Attributions
- venkateswarlu