13 లక్ష్యాన్ని ఎవ్వరికీ చెప్పలేదు
నేను గ్రూప్-1 టార్గెట్గా పెట్టుకున్న విషయం ఏనాడూ బయటకు చెప్పలేదు. ఒకవేళ నేను దాన్ని సాధించలేకపోతే మమ్మల్ని ఇంకెంత అవహేళన చేస్తారో నేను ఊహించగలను. కష్టాలు నన్ను బాగా రాటుదేల్చగా, క్రమశిక్షణా యుతమైన జీవితం వల్ల ఎటువైపు నుంచి ఎన్ని రకాల వ్యతిరేకతలు వెల్లువైనా నాకిష్టమైన పనులను సంకోచించకుండా చేసుకుంటూ పోయాను. నాకు మంచి అనిపించింది చేశాను. నా కెరీర్ కోసం, చదువుకోసం నేను పడ్డ కష్టం ఊరికే పోలేదు. ఏడవ తరగతి వరకు మామిళ్ళపల్లిలో చదివాను. ఎనిమిదవ తరగతి నుంచి
పదవ తరగతి వరకు కావూరులోని చెరుకుపల్లి ఎ.పి రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్ లో చదివాను. ఇంటర్ పొన్నూరులోని కె.ఎస్.కె. కాలేజీలో చదివాను. నాన్న ఎం.పి.సి గ్రూపులో చేర్చించారు, నాకు సైన్సెస్ అంటే అస్సలు ఇష్టం ఉండేదికాదు. మొదటి నుంచి సమాజమన్నా, మానవ సంబంధాలన్నా నాకు బాగా ఆసక్తి, ఉత్సుకతలు ఉండేవి. ఆ కారణం వల్లనో ఏమో నాకు ఆర్ట్ కోర్సులపైనే మక్కువ ఎక్కువ ఉండేది. ఇంటర్ లో మార్కులు బాగా రాలేదు. దానికి కారణం సైన్సెస్ పట్ల నాకు ఆసక్తి లేకపోవడమే. అందుకే ఓపెన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ తీసుకుంటానని పట్టుపట్టి మరీ తీసుకున్నాను. ‘సైన్స్ సబ్జెక్టు చదవకపోతే నిన్ను కాలేజీలో చేర్పించను’ అని నాన్న మందలిస్తే నెలరోజులు ఏడ్చి నా పంతాన్ని నెగ్గించుకున్నాను. హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ కాంబినేషన్లో జాయినయ్యాను.
అన్నయ్యలుంటే…
1994లో ఆగస్టులో డిగ్రీ అయింది. ఈ మధ్యలో టైప్ నేర్చుకుని కొంతకాలం టైపిస్టుగా పనిచేశాను. తర్వాత టాక్స్ కన్సెల్లెంట్ దగ్గర కొంతకాలం పనిచేశాను. 1994-95లో చిక్కడపల్లిలో ఒక ఎంటర్ప్రైజెస్ ఆఫీసు ఇన్చార్జిగా చేరాను. 1995 సంవత్సరంలో బిఇడి (ఆర్ట్స్ సబ్జెక్టులతోనే) ప్రవేశ పరీక్ష రాస్తే దాని ఫలితాలు డిసెంబర్లో వచ్చాయి. నాకు బిఇడిలో సీటు వచ్చింది. విజయవాడ మాంటిస్సోరి మహిళా కళాశాలలో బిఇడి చేశాను. 1997లో బిఇడి ఫలితాలు రావడం, పాసవడం, పట్టా తీసుకోవడం జరిగాయి. నాకు పొలిటికల్ సైన్స్, సోషియాలజీ ఇష్టమైన సబ్జెక్టులు. అందుకే 1996 మేలో ఉస్మానియా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పొలిటికల్ సైన్స్ ఎంఏ చేశాను. తర్వాత అక్కడే హిస్టరీ చేశాను. ఎకనామిక్స్కు మాత్రం అంబేద్కర్ యూనివర్సిటీలో చేశాను. ఇన్ని ఎంఏలు ఎందుకు చేశారు అని మీరు అడగొచ్చు. నాకు చదువంటే అంత పిచ్చి. ఎప్పుడూ ఏదో ఒక కోర్సు చదువుతూనే ఉండాలనిపిస్తుంది. మాకు అన్నయ్యలుంటే మమ్మల్ని ఇలా చదివించి ఉండేవారా అనే అనుమానం వస్తుంటుంది అప్పుడప్పుడు. కాని అన్నయ్యలుండి ఉంటే మమ్మల్ని చదివించరనేది నా నిశ్చితాభిప్రాయం. ఆడపిల్లకు పెళ్ళి, మగపిల్లాడికి ఉద్యోగం అన్న ఆలోచన ఊళ్ళల్లో పెద్ద వాళ్ళకే కాదు ఎక్కువ మంది అబ్బాయిల్లోనూ ఉండడాన్ని నేను గమనించాను. ఇది పురుషాధిక్య సమాజమని వారి ఈ ఆలోచనా సరళి మనకు అనుక్షణం గుర్తు చేస్తుంటుంది.