"

డిప్యూటీ కలెక్టరయిన ‘మట్టి’ మనిషి…కట్టా హైమావతి

డిప్యూటీ కలెక్టరయిన ‘మట్టి’ మనిషి…కట్టా హైమావతి

పల్లెటూరు నుంచి ‘మట్టి’ కాళ్ళతో నడుచుకుంటూ వచ్చిన మామూలు రైతుబిడ్డ ఆమె, నాట్లేస్తూ, కలుపులు తీస్తూ పొలం పనులన్నీ అవలీలగా చేసుకుంటూ తన కలలను మరిచి పోకుండా, లక్ష్యం వదులుకోకుండా డిప్యూటీ కలెక్టర్గా ఎదిగిన మట్టి మనిషి ఆమె. నలుగురు ఆడపిల్లల్లో ఒకతెగా పుట్టి, దూరవిద్యద్వారా సుదూర తీరాలు ప్రయాణించి అలిసిపోయిన ఆమె కళ్ళల్లో ‘తల్లిదండ్రుల పేరు నిలబెట్టానన్న ఆనందం మిలమిలా మెరుస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన కట్టా హైమవతి పని చేసుకుంటూనే చదువుకుని ఇవాళ డిప్యూటీ కలెక్టర్ కాగలిగింది. డా. బి.ఆర్.అంబేద్కర్ పార్వత్రిక విశ్వవిద్యాలయంలో బిఏ, ఎంఏతో పాటు ఉస్మానియాలో మరో రెండు ఎమ్మేలు చేసిన హైమవతి చదువంటే తనకు ప్రాణమంటోంది. ఆడ పిల్లలకు చదువెందుకంటూ ఈసడించుకున్నందరికో ఆమె తన ఎదుగుదలతో సమాధానాలు చెప్పి, ఇంకెందరికో మార్గదర్శి అయ్యింది. టైపిస్టుగా, టీచర్గా ఇలా ఎన్నో పనులు చేసి ప్రతి పనిలో తనదైన ముద్రవేసిన హైమవతి ఇవాళ తనలాంటి ఆడపిల్లలను ఆదుకుంటోంది. ‘కాలేజీకి వెళ్ళి కలెక్టరవుతావా’ అని ప్రశ్నించే పురుషాధిక్యపు అవహేళనలకు తన చదువుల్తో మౌనంగా జవాబు చెప్పిన డిప్యూటీ కలెక్టర్ కథ_

రైతు కుటుంబం

“మాది గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని మామిళ్ళపల్లి గ్రామం. నాన్న కట్టా సుబ్బారెడ్డి. అమ్మ భారతీదేవి. వ్యవసాయ కుటుంబం. నాలుగైదు ఎకరాల మించి పొలం మాకు లేదు. అమ్మా నాన్నలకు మేం నలుగురం ఆడపిల్లలం. నేను మూడో దానిని. మేం నలుగురమూ ఎవరికి నచ్చిన కెరీర్లో వాళ్ళం ప్రవేశించాం. అక్క వ్యాపారం చేస్తోంది. రెండో సోదరి మద్రాసులో సిఏ చేసి ప్రాక్టీస్ చేస్తోంది. నా తర్వాత సోదరి టీచర్ గా పనిచేస్తోంది. నేను గ్రూప్ 1 పరీక్షలు రాసి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యాను. ఇది నేను ఊహించనిదే కాని ఈ విజయం నాకు ఇచ్చిన ఆనందం మాటల్లో చెప్పలేను. ముఖ్యంగా మా నాన్న ‘నా పేరు నిలబెట్టావు’ అంటూ సంతోషంతో ఉప్పొంగిపోవడం నా జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేను. ఆడపిల్లలం విద్యావంతులం కాగలిగామంటే అంతా మా అమ్మా నాన్నల క్రెడిట్. ఇప్పుడు మా కుటుంబం పొందుతున్న ఆనందం వెనుక కొన్ని సంవత్సరాలు ఎడతెగకుండా పడ్డ కష్టం దాగుంది. ఈ స్థాయికి రావడానికి చుట్టాల నుంచి అమ్మా నాన్నలు ఎదుర్కొన్న విమర్శలు, అవహేళనలు ఎన్నో ఉన్నాయి. పొలం తప్ప ఆస్తిపాస్తులు ఏమీలేని వాళ్ళం. ఉన్న ఆ కొద్దిపొలం కూడా నాన్న మా చదువుల కోసం వదులుకున్నారు. మా చదువులు, లక్ష్యాల పరంగా బంధువులు కావాల్సినంత నిరుత్సాహ పరచాలనే చూశారు. కాని వారి ఆ చర్యలు, మాటలే నన్ను మొండిదాన్ని చేశాయి. నా లక్ష్యంపై మరింత ఏకాగ్రతతో దృష్టి సారిచి కృషి చేసేట్టు చేశారు. డిప్యూటీ కలెక్టర్ లక్ష్యాన్ని చేరుకునేలా చేశాయి.

Media Attributions

  • himavathi

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

మేముసైతం... Copyright © 2009 by డా ఘంటా చక్రపాణి is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.