"

11 అంబేద్కర్ యూనివర్సిటీ, డిగ్రీ…

మొదటి రెండు సంవత్సరాలు నాకు చదువుపై అంత ఇంట్రస్ట్ కలగలేదు. ఆదివారం క్లాసులకు కూడా సరిగా వెళ్ళేవాడిని కాదు. ఖైదీగా పనులలో శ్రమతోపాటు, తాత్కాలిక విడుదలకు కూడా నిరాకరించడంతో నేను కుంగిపోయాను. చదువుపై శ్రద్ధ పెట్టకపోవడంతో డిగ్రీ రెండవ సంవత్సరం ఒక సబ్జెక్టు తప్పాను. అందరూ పాసయ్యారు. నేను ఒక్కణ్డే ఫెయిలయ్యానన్న ఆలోచన, చాలా చిన్నతనంగా ఫీల్ అయ్యాను. అయితే ఈ డిగ్రీలు కూడు పెడతాయా?లేక విడుదలకు సహకరిస్తాయా? అన్న ఆలోచన ఉండేది. కో-ఆర్డినేటర్ సత్యనారాయణ ఎంత ఎంకరేజ్ చేసినా సహకరించే వాణ్ణికాదు. అయినా ఆయన వదలకుండా నన్ను మూడవ సంవత్సరంలో అడ్మిషన్ చేయించారు. అప్పటికే ఫెయిలయ్యానని ఫీల్ అవుతున్న నేను పౌరుషం వచ్చి ఎలాగైనా పాస్ కావాలనుకున్నాను. శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాను. అర్థం అయ్యీ కానట్టు ఉండేది. అలా చదువుతూనే దానిలో రుచి తెలుసుకున్నాను. మొత్తానికి 2002 కల్లా డిగ్రీ పూర్తయింది. అంటే సాతులూరి చలపతిరావు, బీఏ అన్నమాట.

మానవజాతిని మార్చాలని ప్రతివారూ చూస్తారు. కానీ తనను తాను మార్చుకోవాలని మాత్రం ఎవరూ చూడరు.– లియో టాల్స్టాయ్

ఎంఏ సోషియాలజీ…

డిగ్రీ పూర్తయ్యాక పీజీ చేయాలని సత్యనారాయణ మాస్టారు పట్టుబట్టారు. అప్పటికే నా శిక్షాకాలం దాదాపుగా పదేళ్ళు పూర్తయ్యింది. ఎప్పుడైనా విడుదల అయ్యే అవకాశం ఉంది. అప్పట్లోగా పీజీ పూర్తి చేస్తానా అనుకున్నాను.అందుకే పీజీకి అప్లయి చేయలేదు. అంబేద్కర్ యూనివర్సిటీ అప్పటి రిజిస్ట్రార్ ఘంటా చక్రపాణి పీజీకి అప్లయి చేసినవారిలో నా పేరు లేకపోవడం గమనించి సత్యనారాయణ గారితో మళ్ళీ చెప్పించి పీజీకి అప్లయ్ చేసేలా ఒప్పించారు. ఎంఏ సోషియాలజీ తీసుకున్నాను. ఆదివారం క్లాసులు చెప్పడానికి వచ్చే మంగాయమ్మ మేడమ్, కోటిరెడ్డి సార్…ఎంతో సులభంగా అర్థమయ్యేట్లు చెప్పేవారు. సమాజంలో నిత్యం జరిగేవే చదువుకోవడం కాస్త ఉత్సాహాన్ని ఇచ్చింది. సమాజం గురించి ఇంకా తెలుసుకోవాలనిపించింది. ఎంతో తెలుసుకున్నట్టు అనిపించింది. మొత్తానికి సోషియాలజీ ఆసక్తికరంగా చదివాను. ఫస్ట్ క్లాసులో పాసయ్యాను. సాతులూరి చలపతిరావు, ఎంఏ.. వింతగా, ఆనందంగా అనిపించింది.

పిహెచ్ డీ చేయాలని…

నేను నేర్చుకున్న విద్య, సాధించిన డిగ్రీలు నాకేమిచ్చాయి అన్న ఆలోచన అప్పుడప్పుడూ వస్తుంది. విజ్ఞానాన్ని,వివేకాన్ని నేర్పిందని అనుకుంటాను. బైదీగా చిన్నచూపు చూసినవారే నా చదువు చూసి గౌరవిస్తున్నారని గమనించాను. బయట ఉన్నప్పుడు అతికష్టం మీద టెన్త్ పూర్తి చేసిన నేను ఖైదీగా ఎంఏ పూర్తి చేయడం నమ్మశక్యంగా అనిపించలేదు. అప్పుడప్పుడూ నా పేరు పక్కన ఎంఏ అని రాసుకుంటూ ఉంటాను. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎంత గొప్పగా ఉంటుందో చెప్పలేను. ఎంఏ పక్కనే పి హెచ్ డీ కూడా రాసుకోవాలన్న కోరిక కలిగింది. నేను చూసిన వ్యక్తులపైనే పరి శోధన చేయాలనుకున్నాను. ఉరిశిక్షలో ఉండగా నేరస్తుల మనస్తత్వాన్ని గమనించేవారిని. వారిలో మార్పు గమనించాను, ఇదే సబ్జెక్టుపై పీహెచ్ డీ చేయాలనుంది. సోషియాలజీ తెలుసుకున్నాక సమాజం బాగా అర్ధమవుతోంది. నేరం, నేరస్తుడి మనస్తత్వమూ అర్థమవుతున్నాయి.

నేరస్తులను శిక్షించుటే ప్రధానం కాదు, నేరం చేయడానికి ఏ పరిస్థితులు పురికొల్పుతున్నాయో వాటిని తొలగించడం ముఖ్యం.– అల్బర్ట్ కా

పాఠాలు, గుణపాఠాలు…

14 సంవత్సరాలుగా జైల్లోనే ఉంటున్నాను. 1993 నుంచి నేటివరకు బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు. పేపర్లలోనూ, టీవీల్లోనూ చూడడమే. అంబేద్కర్ యూనివర్సిటీ విద్య ద్వారా విజ్ఞాన ప్రపంచాన్ని చూపించింది. దానికి ఖైదీలంతా కృతజ్ఞులై ఉండాలి. జైల్లో చదువుతోపాటు చాలా నేర్చుకున్నాను. వాటిలో ముఖ్యమైంది చిత్రకళ.దాదావు ఐదారు వందలు పెయింటింగ్స్ వేశాను. బాగా పేరొచ్చింది. కొంతమందికి నేర్పించాను. బుక్ బైండింగ్, స్క్రీన్ ప్రింటింగ్, స్ప్రే పెయింటింగ్… ఇలా ఎన్నో నేర్చుకున్నా కంప్యూటర్ విద్యలో కూడా ప్రవేశించాను. ఫోటోషాప్, పేజిమేకర్లను కూడా నేర్చుకున్నాను. ఇదేకాక అనేక పాఠాలు, గుణపాఠాలు నేర్చుకున్నాను.

***

జైలులో పరీక్ష రాస్తున్న ఖైదీలు
జైలులో పరీక్ష రాస్తున్న ఖైదీలు

నేను నేర్చుకున్న విద్య, సాధించిన డిగ్రీలు నాకేమిచ్చాయి అన్న ఆలోచన అప్పుడప్పుడూ వస్తుంది, విజ్ఞానాన్ని వివేకాన్ని నేర్పిందని అనుకుంటాను. ఖైదీగా చిన్నచూపు చూసినవారే నా చదువు చూసి గౌరవిస్తున్నారని గమనించాను. బయట ఉన్నప్పుడు అరికట్టమ్మీద బెన్త్ పూర్తి చేసిన నేను ఖైదీగా ఎంఏ పూర్తి చేయడం నమ్మశక్యంగా అనిపించలేదు. అప్పుడప్పుడూ నా పేరు పక్కన ఎంఏ అని రాసుకుంటూ ఉంటాను.

 

 

Media Attributions

  • జైలులో పరీక్ష రాస్తున్న ఖైదీలు – photograph by DrBRAOU

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

మేముసైతం... Copyright © 2009 by డా ఘంటా చక్రపాణి is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.