"

అక్షర భువన భవనపు బావుటాలు

‘మేము సైతం…’ పై చదువుల ప్రభుత్వ గణాంకాల పట్టిక కాదు. కుబ్జ రాజకీయవాదుల ప్రచారార్భటి కాదు. పచ్చ కామెర్ల కథనాల రాశి సైతం కాదు. సామాజిక విశ్లేషకులను తట్టి లేపే పుస్తకం ఇది. అతి సామాన్యుల వాస్తవ విజయగాథలు ఎట్లా ఉంటాయో గాఢంగా ఆలోచింపచేసే సంకలనం ఇది. కష్టనిష్ఠూరాల కోర్చి సామాజిక సాధికారికతను సాధించిన కొంతమంది స్త్రీ పురుషుల గుండెల కదలికల సమాహారం ఇది. మంచి భవిష్యత్తుకోసం కలలు కంటూ, ఆ కలలను గుండె దిటవుతో సాకారం చేసుకున్న అక్షర యోధుల హృదయ చాలనం ఇది. ఉన్నత విద్యావకాశాల కోసం, మేలైన వృత్తులకోసం, మంచి బతుకుకోసం, మరింత మంచి సమాజం కోసం తపించే లక్షలాది లాభాసర్పద్రష్టులందరూ తాము సైతం ‘మేము సైతం…’గా మారడానికి ప్రేరణ ఇచ్చే పుస్తకం ఇది. అనుభవాలు పొరిగిన అక్షరాల్లో — పుస్తక జ్ఞానం, అనుభవజ్ఞానం నిండిన అక్షరాల్లో — వెన్నుతట్టే చోదకశక్తి ఈ పుస్తకం.

డా॥ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలోని సామాజిక సాధికారికత లక్ష్యంగా ఏర్పడిన అధ్యయన, పరిశోధనా కేంద్రం శ్రమకోర్చి కూర్చిన మార్గదర్శక గ్రంథం ఇది. దీనిద్వారా పూర్వవిద్యార్థుల అంతర్గత సృజనాశక్తులు, శ్రమ, పరిశ్రమ గాథలు కొన్ని పరిచయమవుతాయి. ఈ పుస్తకంలో 25 మంది తమ గుండె గొంతుకలను విప్పి చెప్పారు. తమ చైతన్య విస్తృతికీ, ఆర్థికాభివృద్ధికీ, వృత్తిపరమైన ఎదుగుదలకూ కారణమైన ముంగిట్లోని చదువును గురించి తెలిపారు.

ఈ సంకలనంలోని 25 మందీ అలనాటి సుదర్శన మహారాజు కొడుకులూ కాదు; కూతుళ్లూ కాదు. వీళ్లకెవ్వరికీ రాజనీతులను బోధించి రాచరిక వారసులను తయారుచేసే నీతిశాస్త్ర బోధకుడు విష్ణుశర్మ గురువు కాదు. వీళ్లెవరూ జంతుగాథల ద్వారా మాత్రమే సమాజ జ్ఞానాన్ని పొందినవారు కాదు.

వీళ్లలో ఒకరికి చారెడు చెక్క భూమిలేదు. ఆరేళ్ల వయసులో మేకలు, గోర్రెలు కాచే చాకిరి. గొంగడితో, చెప్పులు లేకుండా పొలాలు, కంచెల వెంబడి మేపే వెట్టి చాకిరి. 12 ఏండ్లు సాగిన కట్టులానినతనం. పాలేరు బతుకు. చేయని తప్పుకు కూడా దెబ్బలు తిన్న వెట్టితనం. కటిక పేదరికం. మరొకరు బొగ్గుగని కార్మికుడి కొడుకు. మరొకరు పాలమ్మి, పెరుగమ్మి, ఇడ్లీలమ్మి బతుకీద్చిన వ్యక్తి. ఇంకొకరు ఇటుకల బట్టీ కూలీల బిడ్డ. స్వయంగా కూలీ. ఇంకొకరు దర్జీ. మరొకరిది ఉప్పరి పని. ఇంకొకరిది చేనేత వృత్తి. స్వయంగా స్పిన్నింగ్ మిల్లు కార్మిక జీవితం. మరొకరిది అండదండలేని తండా బతుకు. ఇద్దరు ముగ్గురిది దండగ మారిన వ్యవసాయం. మరో ఇద్దరిది దళిత వ్యథా నేపథ్యం. ఇద్దరు మృత్యుముఖం నుండి బయటపడి జైలు చదువులు చదివినవారు. వీళ్లందరివీ భిన్న ప్రాంతాలు, విభిన్న సామాజిక వర్గాలు. వృత్తులు, వృత్తికులాలు. పలువురు అధిక సంతాన కుటుంబ భార బాధితులు.

అందరూ భూమి పుత్రులే, పుత్రికలే. శ్రమజీవులే. అడ్డంగా నిలువుగా చీలిన సమాజంలో, మతం, కులం, సంప్రదాయాలు చిందరవందరగా చింపిన సమాజంలో బాధలు పడినవాళ్లు. మహిళల్లో ఎక్కువమంది 18 ఏళ్లలోపు చేసుకోక తప్పని వాళ్లే. అవమానాలు భరించినవాళ్లే. చదువుకోవాలని నిరంతరం ఆరాటపడ్డవాళ్లే. సంప్రదాయ విద్య మధ్యలో ఆగిపోయినా, దూరవిద్య ద్వారా తమ చదువుల కలలను సార్థకం చేసుకున్నవాళ్లే. మానవీయ, సామాజిక, విజ్ఞాన శాస్త్రాల్లో తమకిష్టమైన వాటిని వీళ్లు చదువుకున్నారు.

తర్వాత తర్వాత దశల్లో ముద్రణ మాద్యం, సలహా సంసర్గ తరగతులు, రేడియో, వీడియో పాఠాల ద్వారా ఎందరెందరో మంచి గురువుల ద్వారా చదువుకున్నారు. తమ కంటే వయసులో పెద్దవాళ్లయిన విద్యార్థుల ద్వారా కూడా పాఠాలు, జీవిత పాఠాలు నేర్చుకున్నారు. అధ్యాపకులైనా, మీడియా పనిమంతులైనా, ఉద్యోగాల్లో ఉన్నా, న్యాయవాదులైనా, విదేశాల్లో పేరు ప్రతిష్ఠలు గడించినా తమ విద్యాదాహాన్ని తీర్చిన, తమ జ్ఞాన విస్తృతిని పెంచిన డా। బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయ విభిన్న పాఠ్యాంశాలనూ, బోధనా పద్ధతులనూ వాటి ప్రమాణాలనూ గుర్తుంచుకోవడం భారతీయ దూరవిద్య విజయాలకు సంకేతం. పూర్వవిద్యార్థుల సంస్కారానికి చిహ్నం.

అక్షరాస్యత సాధనలో, పాఠశాలలు, కళాశాల వ్యాప్తిలో ఆంధ్రప్రదేశ్ ప్రగతిని సాధించిన మాట కాదనలేము. కానీ అక్షరాస్యత, పాఠశాల చదువులు, ఉన్నత విద్య విషయంలో బాలబాలికల మధ్య అంతరాలు తొలగిపోలేదు. ఆర్థిక సామాజిక సాంస్కృతిక కారణాలవల్ల మధ్యలో ఆగిపోయే చదువులకూ ముగింపు లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వయోజన నిరక్షరాస్యుల శాతమూ పూర్తిగా తగ్గలేదు. ఆదివాసీ ప్రాంతాల్లో మైరాన గ్రామ ప్రాంతాల్లో, షెడ్యూల్డు కులాలూ, తెగల్లో ఈ శాతం మరింత కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. ఆహార హక్కు, విద్యాహక్కు సాధ్యాసాధ్యాల మాట ఎట్లున్నా, ఒకింత ఊరట సార్వత్రిక విద్యా కార్యక్రమాల అమలు, సార్వత్రిక విశ్వవిద్యాలయ స్థాపన.

1991లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అందరికీ విద్య రాష్ట్ర ప్రచార వేదిక యూనిసెఫ్ సౌజన్యంతో ‘చదువు’ కధా సంకలనాన్ని వెలువరించింది. ఆ సంకలనంలో తెలుగు కథా రచయితలు రాసిన కథలు ఇరవై ఉన్నాయి. చదువుకు అడ్డంకిగా నిలిచిన దారిద్ర్యాన్నీ, స్త్రీ పురుష వివక్షనూ, పాఠశాలల్లోని కట్టదులనూ ఆ కథలు ప్రతిఫలించాయి. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల్లో సేవ్ ది చిల్డ్రన్ దక్షిణ మండలం నిధుల సహాయంతో ఆరు స్వచ్ఛంద సంస్థలు చదువుల కథనాలు సేకరించాయి. అందరికీ ప్రాథమిక విద్య సాధించడానికి ఏవి చర్యలు తీసుకోవాలో ఆ కథనాల ద్వారా తెలుస్తుంది. ఈ పరిచయ కర్త స్వయంగా ఒరిస్సా రాష్ట్రంలోని రాయగఢ్, కొరాపుట్ జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో పాఠశాల విద్యాసమస్య కథనాలను సేవ్ ది చిల్డ్రన్ కోసం సేకరించాడు.

‘మేము సైతం..’ లోని ప్రత్యక్ష కథనాలు కథారచయితల కల్పనా సృష్టికాదు. స్వచ్ఛంద సంస్థల సూచనలూ కాదు. ఇది సామాజిక సాధికారికతను సాధించిన 13 మంది పురుషుల, 12 మంది మహిళల ప్రత్యక్ష కథనాలు. జీవన పోరాట గారలు. ఈ పుస్తకంలోనే రా॥ బి.ఆర్. అంబేద్కర్ ఉల్లేఖనం ఒకటి ఉంది. “… మన భవిష్యత్తును మనకోసం, మనకు మనమే రూపొందించుకోవాలి.”

గుణాత్మకమైన దూరవిద్యా సంస్థ ద్వారా తమ భవిష్యత్తును తమకోసం గుణాత్మకమైన దూరవిద్యా సంస్థ ద్వారా తమ భవిష్యత్తును తమకోసం, తమకు తాము రూపొందించుకున్న విజేతలెందరో. వారిలో కొందరు వీరు, స్ఫూర్తి దాయకులు.

ఈ పుస్తకం తెలుగులో మాత్రమేకాదు, అన్ని ముఖ్యమైన, అవసరమైన ప్రపంచ భాషల్లో మరీ ముఖ్యంగా అఫ్రో ఆసియా దేశ భాషల్లో, లాటిన్ అమెరికా భాషల్లో – రావలసిన అవసరం ఉంది. యూనిసెఫ్, సి.ఓ.ఎల్ సాయాన్ని కోరవచ్చు. కనీసం ముందుగా, ఇంగ్లీషులోనూ, హిందీలోనూ తెచ్చే ప్రయత్నం డా|| బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం చేస్తే దూరవిద్యావ్యాప్తికి మంచిది.

సంపాదకుడు, సంకలనకర్త డా॥ ఘంటా చక్రపాణి పూర్వ పత్రికా రచయిత. మీడియా నిపుణుడు, ప్రస్తుత విశ్వవిద్యాలయ సామాజిక శాస్త్ర విభాగ అధ్యాపకుడు, సామాజిక సాధికారికతా కేంద్రం ద్వారా సోదరుడు చక్రపాణి ఈ అపూర్వమైన కృషి చేసినందుకు మనసారా అభినందిస్తున్నాను. అందరికీ అందుబాటులో మంచి చదువులను ఆశించే పౌరుడిగా, సామాజిక సాధికారికతను కోరే అధ్యాపకుడిగా అభినందిస్తున్నాను.

ఈ పుస్తకం చదవండి. ఇతరులతో చదివిస్తూ పోండి.

Pass it on the torch light.

– కేతు విశ్వనాథ రెడ్డి 

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

మేముసైతం... Copyright © 2009 by డా ఘంటా చక్రపాణి is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.