"

1 ఆ దెబ్బలు మరిచిపోలేను…

నాకప్పుడు తొమ్మిదేళ్ళు ఉంటాయేమో. ఓ పటేల్ దగ్గర పని చేసేవాడిని. పటేల్ తమ్ముడి పొలం కూడా పక్కనే ఉండేది. వారి మధ్య గొడవలుండేవి. అన్న దగ్గర జీతం ఉన్న నేను పశువులను మేపే వాడిని. ఓసారి నామందలో దుడ్డె పటేల్ తమ్ముడి చేసులో పడింది. నిజానికి అది చేనులో మేయలేదు. చేసులోంచి వెళ్ళిందంతే. అప్పుడు పటేల్ తమ్ముడు కొట్టాడూ… ఇప్పటికీమరచిపోను ఆ దెబ్బలూ, వాతలూ… మా ఊరిలో కూడా చాలా మందికి ఇంకా గుర్తు. ఇది అన్యాయం అన్నవాడు ఒక్కరూ లేరు. ఇప్పుడు మా ఊరికి వెళ్తే ఆ పటేల్‌తమ్ముడిని పలకరిస్తా… ‘బాగున్నావా… తాతా’ అని తలదించుకుంటాడాయన. పశువుల్ని మేపడం చాలా కష్టమైన పని. చిన్న చిన్నపిల్లలే చేస్తుంటారా పని. వర్షం పడుతుంటే, ముళ్ళ కంచెల్లో పశువులుపరుగెడుతుంటే… కన్నుమూసి తెరిచే లోగా చేలలోపడి మేస్తుంటే… నానాయాతన. పశువులకేం తెలుసు ఎటు వెళ్ళాలో. ఒక్క రోజు జ్వరం వచ్చిపడుకున్నా పటేల్ ఊరుకునేవాడు కాదు. బూతులు… దెబ్బలు, ఉదయం ఆరుగంటల నుంచి రాత్రి ఏడు గంటల దాకా పనే! ఎండొచ్చినా, వానొచ్చినా!!

“ఎందుకో నాకు చిన్నప్పటి నుంచీచదువంటే మహా ఇష్టం. పనిచేసేపటేళ్ళ పిల్లలు చదువుకునేవారు.నాకూ అలా చదువుకోవాలనిపించేది,రాత్రి బడికి పోవడానికి ప్రయత్నంచేసేవాడిని. పశువుల్ని మేపుకు వచ్చి,వాటిని కట్టేసి, పేడతీసి, పాలు పిండి… అప్పటికే రాత్రయ్యేది. ఒళ్ళుపులిసిపోయి ఉండేది. అయినా రాత్రిబడికి పోయేవాణ్ణి.”

చదువు నా స్వప్నం…

ఎందుకో నాకు చిన్నప్పటి నుంచీ చదువంటే మహా ఇష్టం. నేను పనిచేసే పటేళ్ళ పిల్లలు చదువుకునేవారు.నాకూ అలా చదువుకోవాలనిపించేది,రాత్రి బడికి పోవడానికి ప్రయత్నం చేసేవాడిని. పశువుల్ని మేపుకు వచ్చి, వాటినికట్టేసి, పేడతీసి, పాలు పిండి… అప్పటికే రాత్రయ్యేది. ఒళ్ళు పులిసిపోయిఉండేది. అయినా రాత్రి బడికి పోయేవాణ్ణి. ‘అనియత విద్య’ నడుస్తుండేది మా ఊర్లో. కొద్ది రోజులు అక్కడ చదువు. అది పధ్నాలుగేళ్ళ లోపు ఉన్నవారికే. నావయస్సు మించిపోవడంతో అక్కడికి రానివ్వలేదు. వచ్చిన నాలుగు అక్షరాలకు మళ్ళీ ఆటంకం. ఆ తరువాత కొన్నాళ్ళకు ‘వయోజన విద్య’ మొదలయింది మా ఊర్లో, మళ్ళీ చదువు మొదలుపెట్టాను. అందరూ నవ్వేవాళ్ళు… ఎద్దులా ఉన్నావు, ఏం చదువు అని. రాత్రిరహస్యంగా వెళ్ళేవాడిని చదువుకోవడానికి.

దరిద్రంలో ఉండేవాడికి కావల్సినన్ని అవరోధాలు.1984లో మా నాన్నను ఎవరో చంపేశారు. జీవితాంతం పశువుల మధ్యే గడిపిన ఆయన పశువుల మందకాడే చనిపోయాడు. ఊర్లో ఏవో తగాదాలు. అదే మా కుటుంబానికి షాక్. దానిపై మరో షాక్. ఆ కేసులో మా అన్ననుపోలీసులు అరెస్టుచేసి తీసుకు వెళ్ళడం… రెండేళ్ళుజైలులో ఉన్నాడు. ఆ తర్వాత వదిలేశారు. అమ్మ బెదిరిపోయింది. ఈ క్రమంలో పేదరికం మరింత పెరిగింది.కుటుంబ భారం అంతా నాపైనే… ఇలా జీవితంలో ప్రతి సంఘటనా నన్ను చదువుకు దూరం చేస్తూనే ఉంది.

మలుపు తిరిగిన జీవితం…

మెగసెసె అవార్డు గ్రహీత శాంతా సిన్హా 1987లో మా ఊరికి వచ్చారు.నా జీవితాన్ని మలుపుతిప్పిన సంఘటన అది. మా గ్రామంలో వెట్టిచాకిరిలో మగ్గుతున్న వారికి విముక్తి కల్పించేందుకు ఆమె ఎంతో శ్రమించారు, ఎన్నోకష్టాలకు ఓర్చారు, అక్కడ పటేళ్ళు అనేక ఇబ్బందులను సృష్టించేవారు. రోజూ వాదోపవాదాలు జరిగేవి. అవమానించేవారు. అన్నీ భరించి నాలాంటి బాలకార్మికులకు విముక్తి కల్పించి హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీకి తీసుకు వచ్చారు. అక్కడ ‘నర్సరీ’లో శిక్షణనిచ్చారు. మొక్కలు పెంచడం… అందరంకలిసి యూనివర్సిటీలోనే ఉండేవాళ్ళం. షెడ్డు వేయించారు… బియ్యం
కూరగాయలు అన్నీ ఇప్పించేవారు. పండుకుని తిని, పని నేర్చుకునేవాళ్ళం. శాంతాసిన్హా అక్కడితో ఆగలేదు. తన దగ్గరి విద్యార్థులను మా వద్దకు పంపించేవారు చదువు చెప్పడానికి. శ్రీనివాస్, ఆంజనేయులు, రవీంద్రబాబు… వారందరూ మా దగ్గరకు వచ్చి చదువు చెప్పేవారు. మళ్ళీ అక్షరాలతో సహచర్యం. ఇంతలోనే శిక్షణ పూర్తయింది. పనైతే నేర్చుకున్నాం.
కానీ బతకడం ఎలా… మళ్ళీ ఇంటికి వెళ్ళాం. పూట గడవడం కష్టమే అయింది.
మళ్ళీ శాంతాసిన్హా చల్లని చేతులే ఆశ్రయమిచ్చాయి. మా అందరినీ హైదరాబాద్ పిలిపించి సెంట్రల్ యూనివర్సిటీలోనే పని ఇప్పించారు. రోజుకు 18 రూపాయలు… దినసరి కూలి. 15 మందిమి చేరాం. తర్వాత పెళ్ళిళ్ళు. కుటుంబసమస్యలు. అందరూ మానేశారు. ముగ్గురమే మిగిలాం. మా అదృష్టవశాత్తూ ఐదో పే కమిషన్ వచ్చింది. మేం దినసరి వేతనంలోంచి స్కేలులోకి మారాం. 18 రూపాయల దినసరి కూలిలోంచి 1800 రూపాయల నెలజీతం, జీవితం ఒకకొత్త దారిలో పడింది. ఆ తర్వాత పర్మనెంట్ అయింది. కృష్ణమూర్తిగారు వైస్ చాన్సలర్ అయ్యాక మళ్ళీ మాకు చదువు అబ్బింది. యూనివర్సిటీలో ఎవ్వరూ వేలిముద్రగాళ్ళు ఉండకూడదనే నిర్ణయంతో భోజన విరామ సమయంలో మాకుచదువు చెప్పించారు. అలా అప్పుడప్పుడూ మాకు సరస్వతి కటాక్షం దొరుకుతూ వచ్చింది.

స్వీపర్‌గా ఉండి…

యూనివర్సిటీలో శానిటేషన్లో స్వీపర్‌గా పనిచేసేటప్పుడు విద్యార్థులు పరిచయం అయ్యేవారు. వారితో మాట్లాడడం… చదువు గురించి మాట్లాడడం… చదువుపై ఆసక్తి పెరిగింది. మధ్యాహ్నపు చదువులో మాకు ‘సర్టిఫికెట్’ ఇచ్చారు.దానితో టెస్ట్ పరీక్ష రాయాలన్న ఆలోచన వచ్చింది. 1991లో మొదటిసారి పరీక్ష రాశా… ఫెయిల్ అయ్యా. అలా ఎన్నోసార్లు పరీక్ష రాశా. ఒక్కసారే అన్నీ పాస్ కావాలని అన్నీ ఫ్రెష్‌గా రాసేవాణ్ణి. అలా 1993లో టెస్ట్ గట్టెక్కాను.

ఎవరో దేవుడో లేక మానవాతీతుడో వచ్చి కాపాడాలని చూడకు, నీ బానిసత్వానికి నువ్వే చరమగీతం పాడాలి, మన భవిష్యత్తును మనకోసం మనకు మనమే రూపొందించుకోవాలి. – డా॥ బి.ఆర్.అంబేద్కర్

టెన్త్ పాసవడం కొంత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ వెంటనే 1994లో అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో డిగ్రీ ఎంట్రన్స్ రాశాను. ఫస్ట్ క్లాస్ వచ్చింది. డిగ్రీలో చేరాను. ఆ తర్వాత పెళ్ళయింది. నా సిస్టర్స్, బ్రదర్ మ్యారేజీ బాధ్యత నాదే. నేనే వారి పెళ్ళిళ్ళు చేశాను. అలా కొంతకాలం చదువు అటకెక్కింది. చెప్పాగా… బతుకు పోరులో చదువు సజావుగా సాగడం ఎంతో కష్టమని. మొత్తానికి ఎలాగైతేనేం 2000 సంవత్సరం నాటికి డిగ్రీ పూర్తి చేయగలిగాను. సమాజం గురించీ, మనుషుల గురించీ, మా బతుకుల గురించీ, నా బాల్యం గురించి బాగా ఆలోచనలు ఉండేవి. వీటన్నింటిపై అధ్యయనం చేయాలంటే సోషియాలజీ చదవాలని యూనివర్సిటీ స్టూడెంట్స్ అంటుండేవారు, ఎలాగైనా సోషియాలజీ చదవాలనుకున్నా. 2003లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ సోషియాలజీ మొదలుపెట్టారు. ఫస్ట్ బ్యాచ్లో చేరాను. ఇక్కడో విషయం చెప్పాలి. అంబేద్కర్ యూనివర్సిటీ నిర్వహించే కాంటాక్ట్ క్లాసులు బాగా ఉంటాయి. ఎంతో అర్థమయ్యేలా చెబుతారక్కడ. డిగ్రీలో దురదృష్టవశాత్తు నాకు ఆ క్లాసులకు వెళ్ళే అవకాశం లేకుండేది. నేను డిగ్రీ చదివేటప్పుడు యూనివర్సిటీ హాస్టల్లో పనిచేసేవాడిని. ఆదివారం విద్యార్థులకు స్పెషల్స్ చేసిపెట్టాలి. ఆ రోజు బాగా బిజీగా ఉంటుంది. సెలవు పెట్టడం అసలు కుదరదు. నాకు పని ముఖ్యం, దాని తర్వాతే ఏదైనా. అదేకదా మనకు తిండిపెడుతోంది. చదువుకునే అవకాశం కల్పిస్తోంది. అలా కాంటాక్టు క్లాసులకు వెళ్ళడం కుదిరేదికాదు. నేనే సొంతంగా చదువుకునే వాడిని. అర్థం కాకపోతే మా యూనివర్సిటీ విద్యార్థులు సాయం చేసేవారు. ఈ విషయంలో వారికి నేనెంతో రుణపడిఉన్నాను.

 

 

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

మేముసైతం... Copyright © 2009 by డా ఘంటా చక్రపాణి is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.