"

నేపథ్యం

మనిషి జీవితంలో విద్యకున్న ప్రాముఖ్యత ఏమిటో విడమరిచి చెప్పేందుకే ఈ విజేతల విశిష్ఠ గాధల్ని మీ ముందుంచుతున్నాం. ఇందులో పొందుపరిచిన జీవితాల్లో ఏ ఒక్కరిదీ వడ్డించిన విస్తరి కాదు. ఎవరికి వాళ్ళు తమలో తామే కలలు గని తమ తలరాతల్ని మార్చుకున్న వాళ్ళే! ఎవరికి వాళ్ళు తమ కాళ్ళమీద తాము నిలబడాలని తపించి తడబడుతూ, పడిపోతూ నిలదొక్కుకున్న వాళ్ళే! ఎవరంతట వాళ్ళు తమ మనుగడకోసం బతుకుపోరులో అలిసి గెలిచిన వాళ్ళే!! వాళ్ళ కథలు, కలలూ వేరు వేరు అయినా ఈ అందర్నీ మన ముందు ఇలా నిలబెట్టింది మాత్రం. డా॥ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం. అందుకే అందరూ తమ చదువుల తల్లికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు.

డా॥ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయంగా 1982లో మొదలైంది. దేశంలోనే తొలిప్రయత్నంగా దూరవిద్యా విధానాన్ని ప్రవేశపెట్టి చదువుకోవడానికి అప్పటిదాకా ఉన్న అర్హతా ప్రమాదాలను, అవాంతరాలన్నిటినీ తొలగించి ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ఉన్నత విద్యను అభ్యసించవచ్చని చాటి చెప్పింది. ఈ పద్ధతి పట్ల కొందరు పెదవి విరిచారు, చాలామందే సందేహించారు. అయినా అన్ని అనుమానాలనూ పటాపంచలు చేస్తూ అనతికాలంలోనే దేశంలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. విద్యను సాంప్రదాయ బంధనాల నుంచి విముక్తం చేసి ప్రజాస్వామ్యీకరించే ప్రయత్నం చేసింది.

మన దేశంలో చదువుకోవడం అంత సులభం కాదు. అందులో ఉన్నత విద్య అందరికీ సాధ్యపడేది కాదు, చారిత్రకంగా మన దేశంలో ఉన్నత విద్య అతికొద్ది మందికే పరిమితమై అసంఖ్యాక ప్రజాబాహుళ్యానికి అందుబాటులో లేకుండా పోయింది. పెద్ద చదువులు చదవాలంటే పెట్టిపుట్టాలి, ఎన్నో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కట్టుబాట్లను ఛేదించాలి, ఎందరినో ఎదిరించాలి. ఎన్నో కష్టనష్టాలను భరించాలి, అయినా ఇప్పటికీ సూటికి పది మంది కూడా విశ్వవిద్యాలయాలను చూసే అవకాశం లేదంటే ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. అది వాస్తవం. ఉన్నత విద్యావకాశాలు, విశ్వవిద్యాలయాలు అందుబాటులో లేక, ఉన్నా చదువుకొనగలిగే స్థోమత లేక ఎంతో మంది ప్రతిభావంతులు చదువుకునే సాహసం చేయలేకపోతున్నారు.

పల్లెలు వదిలి పంటపొలాలు వదిలి, ఇంటి సమస్య, పంట కరువూ జరిగినప్పుడు పల్లెలు వదిలి పంటపొలాలు వదిలి, ఇంటి పనులు, వంట గదులూ వదిలి పట్టణాలకు రాలేకపోతున్నారు. అంతకంటే కష్టమైన, కఠినమైన కట్టుబాట్లను కాదనలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ‘ముంగిట్లోకి ఉన్నత విద్య’ను తీసుకువచ్చిన ఈ విశ్వవిద్యాలయం సహజంగానే లక్షలాది మందికి ఆలంబన అయ్యింది. కొత్త ఆశలకు ఊపిరిపోసింది. కొత్త అవకాశాలకు తలుపులు తెరిచింది. కొత్త జీవితాలను ఆవిష్కరించింది. ఈ ప్రపంచానికి ఒక కొత్తతరం విద్యావంతుల్ని పరిచయం చేసింది. అందులో గడిచిపోయిన పాతిక సంవత్సరాలు ప్రయత్నానికి ప్రతీకలుగా ఇరవై ఐదు మందిని మీకు పరిచయం చేస్తున్నాం. విభిన్న ప్రాంతాలు, ఆర్థిక సామాజిక నేపథ్యాలు, జీవన పరిస్థితుల్లోంచి వినమ్రంగా నడిచి వచ్చి, చదువులు నేర్చి విశ్వవ్యాప్తంగా ఈ విశ్వవిద్యాలయ విశిష్టతను చాటిచెప్పిన మా విద్యార్థుల ప్రతిభా సామర్థ్యాలకు తేజేలు పలుకుతున్నాం. ఈ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసిస్తోన్న లక్షలాది మందికి, ఆ అవకాశాల కోసం నిరీక్షిస్తోన్న కోట్లాది మందికి ఈ విజయ గాథలు స్ఫూర్తినివ్వగలవన్న ఉద్దేశంతో ఈ విజయ గాథల్ని సంకలనపరిచాం.

ఈ ప్రయత్నానికి ప్రేరణ కూడా మా ‘అజ్ఞాత’ విద్యార్థి నుంచే వచ్చింది. అజ్ఞాత అని పిలవబడే ఈ విజయ గాథల్ని సంకలనపరిచాం,
ఈ ప్రయత్నానికి ప్రేరణ కూడా మా ‘అజ్ఞాత’ విద్యార్థి నుంచే వచ్చింది. అజ్ఞాత అని ఎందుకుంటున్నానంటే ఆ విద్యార్థిని మేం కలుసుకోలేకపోయాం.
2006లో విశ్వవిద్యాలయం రజతోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు, సమాజానికి విశ్వవిద్యాలయానికీ వారధిగా ఒక కేంద్రాన్ని ఏర్పాటుచేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. ‘సెంటర్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్’ పేరుతో ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనను అప్పటి వైస్ ఛాన్సలర్ ఆచార్య డి. రాంచంద్రం గారి ముందుంచాను. గడిచిన 25 సంవత్సరాలుగా లక్షలాది మందిని ఈ విశ్వవిద్యాలయంలో చేర్చుకుంటున్నాం. వేలాది మందికి డిగ్రీలు ఇచ్చాం. నిజంగానే ఈ చదువులు పనికొస్తున్నాయా. మన విద్యార్థులు సమాజానికి ఎలా ఉపయోగపడుతున్నారు. ఈ విశ్వవిద్యాలయం ద్వారా మనం సమాజానికి ఇంకా ఏ రకంగా ఉపయోగపడగలం అన్నది అధ్యయనం చేయడంతో పాటు సామాజిక సాధికారతకు కొత్త కార్యక్రమాలు రూపొందించి అమలుచేయడం ఈ సెంటర్ లక్ష్యాలుగా పెట్టుకున్నాం. ఆయన వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఆ ప్రతిపాదనను ఢిల్లీలోని దూరవిద్యామండలికి పంపించారు.

మా ప్రయత్నం వినూత్నమైన ప్రాజెక్టుగా పేర్కొంటూ దూరవిద్యా మండలి ఆర్థిక సహకారం అందించడానికి ముందుకు వచ్చింది. సరిగ్గా అదే సమయంలో ఢిల్లీలో ఒక మిత్రుడు 2005 సంవత్సరానికి సివిల్ సర్వీసెస్లో ఎంపికైన అభ్యర్థుల విశ్వవిద్యాలయాల జాబితా నాకు పంపించాడు. అందులో దేశంలోని 112 విశ్వవిద్యాలయాల నుంచి 457 మంది అభ్యర్థులు ఈ దేశంలో అత్యున్నతమైన పరిపాలనాపరమైన ఉద్యోగాలకు(ఐఏఎస్, ఐపిఎస్, ఐఆర్ఎస్) ఎంపికయ్యారు. ఆ జాబితాలో డా॥ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం పేరు చోటుచేసుకోవడంశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఈ విశ్వవిద్యాలయంలో చదివి ఆ ఏడాది సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యింది ఒకే ఒక్క అభ్యర్థి ‘సాధు నర్సింహారెడ్డి. ఆ అభ్యర్థి విజయం సాధించడం అద్భుతంగా అనిపించింది. మిగతా విశ్వవిద్యాలయల నుంచి వందల సంఖ్యలో విద్యార్థులు మెయిన్స్కు హాజరై ఒకరో ఇద్దరో ఎంపికైతే మన విశ్వవిద్యాలయం నుంచి హాజరైన ఒకే ఒక్క వ్యక్తి ఎంపికవడం అద్భుతం కాక ఇంకేమవుతుంది. ఇలాంటి వాళ్ళ వివరాలు సేకరించాలన్న ఆలోచన వచ్చింది.

సెంటర్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్ తొలి ప్రాజెక్టుగా ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టాం. అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి మా విద్యార్థుల అన్వేషణ ప్రారంభించాం. వేలారి మంది వివిధ స్థాయిల్లో, హోదాల్లో, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు, తమ జీవితాలను అనూహ్యంగా మలుపు తిప్పుకోగలిగిన వాళ్ళు మాకు తారసపడ్డారు. దాదాపు ఒక ఏడాది కాలం పాటు అనేక మందితో మాట్లాడి, వివరాలు సేకరించి, ఇంటర్వ్యూలు చేసి వాటన్నిటినీ మధింపుచేసి ప్రచురించాలని నిర్ణయించాం. అయితే అన్నీ ప్రచురించే వీలుకాలేదు. అందులో కొన్ని మాత్రమే ఎంచుకున్నాం.

ప్రచురణకు ఎంపిక చేసిన విజయ గాథల్లో కేవలం అత్యున్నత హోదా పొందిన వాళ్ళేకాదు అత్యంత దుర్భరమైన జీవితాలను అనుభవించిన వాళ్ళు, అత్యంత కఠోరమైన ప్రయత్నాలు చేసిన వాళ్ళు, ఆత్మ విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా నిలబడ్డ వాళ్ళూ చదువువల్ల సంపదనే కాక అమూల్యమైన ఆనందాన్ని పొందిన వాళ్ళూ ఉన్నారు.

ఈ పుస్తకం అన్ని రంగాల, అన్ని రకాల జీవితాల సమ్మిళితంగా అన్ని సామాజిక, ప్రాంతీయ, సాంస్కృతిక పార్శ్వాల సమ్మేళంగా రూపొందించే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి చాలామందికి సంబంధించిన విజయ గాథల్ని ప్రచురణకు స్వీకరించలేకపోయాం. రజతోత్సవ చారిత్రక సందర్భాన్ని వనరుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ పుస్తకాన్ని 25 మందికి కుదించవలసి వచ్చింది. అందుకు బాధగానే ఉన్నా ఇందులోని విజయగాథలు అందరినీ ప్రతిబింబించే విధంగా ఉన్నందున మా ప్రయత్నం ఫలించిందనే భావిస్తున్నాం.

నిజానికి ఈ సంకలనం చాలా ఆలస్యంగా వెలుగు చూస్తోంది. ఎప్పుడో రెండేళ్ళ క్రితమే పూర్తయినప్పటికీ కొన్ని సంస్థాగతమైన కారణాల వల్ల ప్రచురణలో జాప్యం జరిగింది. ఈ మధ్య కాలంతో ఇందులో ప్రస్తావించిన వ్యక్తుల జీవితాలు, విధులు, ఉద్యోగాలు, హోదాల్లో ఎన్నో మార్పులు జరిగి ఉండవచ్చు. మాకు మరో ముద్రణకు అవకాశం దొరికితే అవన్నీ సవరించడంతో పాటు మరిన్ని విజయగాథల్ని చేర్చి సమగ్రంగా అందించే ప్రయత్నం చేస్తాం.

ఆలస్యంగానైనా ఈ పుస్తకం వెలువడుతున్నందుకు సంతోషంగా ఉంది. అందుకు ఎంతోమంది చేయూత, భాగస్వామ్యం, ప్రోత్సాహం ఉన్నాయి. ముఖ్యంగా మా ప్రతిపాదనను ఆమోదించి సెంటర్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్కు వెన్నుదన్నుగా నిలిచిన దూరవిద్యా మండలి(న్యూఢిల్లీ) వారికి ముఖ్యంగా మా ప్రయత్నాన్ని మనస్పూర్తిగా అభినందించిన మండలి డైరెక్టర్ స్వరాజ్ బసుకు తొలిదశలో దిశానిర్దేశం చేసిన అప్పటి వైస్ఛాన్సలర్ ఆచార్య రాంచంద్రం గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు. వారి ప్రోత్సాహం మరువలేనిది. అలాగే సెంటర్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్ గవర్నింగ్ బోర్డు సభ్యులు, ముఖ్యంగా ప్రొఫెసర్ జి.హరగోపాల్, ప్రొఫెసర్ ఉమామోహన్, ప్రొఫెసర్ వి.ఎస్.ప్రసాద్ల శశికుమార్ వంటి పెద్దల ప్రోత్సాహం లేకుంటే మా ప్రయత్నం నెరవేరేదే కాదు. ఈ విశ్వవిద్యాలయం తొలితరం అధ్యాపకులుగా ఆచార్య వి.ఎస్.ప్రసార్, ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి వంటి పెద్దలు ఇటువంటి పరిశోధన, ప్రచురణ ఎంతో అవసరమని పదేపదే గుర్తుచేసి ప్రోత్సహించడమే కాకుండా అందుకు అనుగుణంగా ఈ పుస్తకానికి ముందుమాట కూడా రాశారు. వారికి కృతజ్ఞుణ్ణి. ఒక దశలో ఆగిపోతుందనుకున్న ఈ ప్రచురణ వెలుగులోకి రావడానికి ప్రధాన కారణం ప్రస్తుత వైస్ఛాన్సలర్ ఆచార్య ఓ.ఆర్.రెడ్డిగారు. అన్ని రకాల అవరోధాలు తొలగించి ఈ ప్రచురణకు వారు ఎంతో సహకరించారు. అంతేకాకుండా విశ్వవిద్యాలయం తద్వారా ఉన్నత విద్య మారుమూల గ్రామాలకు కూడా విస్తరించాలని, అందుకు ఈ ప్రచురణ తోడ్పడుతుందన్న నమ్మకాన్ని వారు వ్యక్తం చేశారు. వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. అలాగే పుస్తకంలో పొందుపరిచిన సమాచార సేకరణ, రచన, సంకలనం, ముద్రణలో భాగస్వాములైన మిత్రులందరికీ ముఖ్యంగా రచనలో సహకారాన్ని అందించిన మిత్రులు సరికొండ చలపతికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.

ఈ పరిశోధన, రచన సంకలనంలో అనేక మంది మిత్రులు, సహోర్యాపకులు, సిబ్బంది, అధికారులు తోడ్పడ్డారు. వారందరికీ కృతజ్ఞతలు.

ఈ సంకలనం కేవలం డా. బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో చదివిన వ్యక్తులు సాధించిన ఘనతను మాత్రమే చెప్పడం లేదు. వ్యక్తులు వారి సామాజిక నేపథ్యాలు ఎలా ఉన్నా చదువుంటే ఏదైనా సాధించవచ్చన్న విషయాన్ని వివరించదలిచాం. అలాగే చదువును మించిన సాధనం లేదని, సాధన చేసినప్పుడే స్వప్నం ఎలాంటిదైనా సాకారం అవుతుందనీ చెప్పదలిచాం. చదువు పరమావధి ఏమిటీ అన్న విషయం పైన ఇప్పటికే అవసరానికి మించిన సైద్ధాంతిక చర్చ జరిగి ఉంది. చదువుకున్న తాత్వికులు, పండితులు, మేధావులు వారివారి స్థల, కాల అవసరాన్ని అనుసరించి, సామాజిక సందర్భాన్ని బట్టి తలో రీతిలో సెలవిచ్చారు. చదువు విలువల్ని, వివేకాన్ని, విజ్ఞానాన్ని అందించే సాధనమని కొందరంటే చదువు వికాసాన్ని, స్వేచ్ఛని, సమానత్వాన్నీ, సుస్థిర అభివృద్ధిని సాధించే ఆయుధమని కొందరంటున్నారు. ఎవరెలా చెప్పినా చదువనేది జీవితమని, ప్రతి జీవితానికి ఒక మహోన్నత సామాజిక సార్ధకత ఉంటుందని మా విద్యార్థులు నిరూపించారు. నిరూపిస్తున్నారు, నిరూపిస్తూనే ఉంటారు.

ఉన్నత విద్యలో ఉన్న శక్తిని గుర్తించి చదువుకోవడం కోసం అనేక అవమానాలు ఎదుర్కొని నిలదొక్కుకుని, ఎన్నో ఉన్నత శిఖరాలు అధిష్టించిన ఆదర్శ మూర్తి డా॥ బి.ఆర్.అంబేద్కర్ ఉల్లేఖించినట్టు మనిషి జీవితంలో విద్య సర్వోత్కృష్టమైనది. అంబేద్కర్ మాటల్లోనే చెప్పాలంటే మనం ఈ ప్రపంచంలో నాగరికత అందుబాటులోకి తెచ్చిన ఎంతటి ప్రయోజనాలనైనా వదులుకోవచ్చునేమో గానీ, సర్వోత్కృష్టమైన విద్యను, తద్వారా అందివచ్చే ఫలాలను సంపూర్ణంగా అనుభవించే అవకాశాలను, హక్కును ఎంతమాత్రం కోల్పోకూడదు.

ఈ పుస్తకం మిమ్మల్ని ఆలోచింపజేస్తుందన్న తలంపుతో…

అది అందరికీ అర్థం చేయాలన్నదే మా తపన. ఈ పుస్తకం చదివాక చదువుకోవాలన్న ఆశ, చదువుకోవాలనుకుంటున్న వారిని ప్రోత్సహించాలన్న ఆలోచన, చదువు మనిషికి ఒక ప్రాథమిక హక్కు అన్న అవగాహన కలిగితే మా ప్రయత్నం నెరవేరినట్టే.

మీ

ఘంటా చక్రపాణి

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

మేముసైతం... Copyright © 2009 by డా ఘంటా చక్రపాణి is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.