కష్టాల సుడిలోంచి ఖండాంతర ఖ్యాతి – అనిల్ జ్యోతి
నిప్పుల మీద నడిచే సాహసం ఆమెది. వంచించిన విధిని మెడలు వంచి నిలువరించిన ధీరత్వం ఆమెది. అంతా తలరాతని సగటు ఆడపిల్లలా సర్దుకు పోకుండా తన రాతను తానే సవరించుకోవాలన్న తపన ఆమెది. చీకటి పాలైన బతుకుని చూసి చితికిపోకుండా ఆశను విస్తరించి, ఆంక్షల పరిధి మించి ఒంటిచేతితో బతుకు బండిని వెన్నెల లోకాల్లోకి లాక్కెళ్ళిన ఆమెలో అలుపెరుగని ఆత్మవిశ్వాసం ఉంది. ఆ విశ్వాసం తనకు డా. బి.ఆర్.అంబేద్కర్ పార్వత్రిక విశ్వవిద్యాలయం ఇచ్చిందంటోంది జ్యోతి.
అమెరికాలోని ఆరిజోనాలో ‘కీ’ సొల్యూషన్స్ అధినేతగా ఉన్న జ్యోతిది వరంగల్ జిల్లా, తండ్రి గౌరవ ప్రదమైన స్కూల్ టీచర్. 1975 నాటి ఎమర్జెన్సీ ఆ కుటుంబంలో చీకటి నింపింది. ‘తల్లిలేని అనాధనని’ అబద్ధం చెప్పి హాస్టల్లో చేరిన తొమ్మిదేళ్ళ పసితనం నుంచి ఆమెకు చదువంటే చచ్చేంత ప్రేమ. కానీ ఆ ఆశలన్నిటివీ మూడు ముళ్ళ బంధానికి ముడివేయవలసి వచ్చింది. పదహారేళ్ళకే పెళ్ళయి వల్లెలో ఉండే అత్తవారింటికి పయనమైన జ్యోతి ఆ వల్లె దాటి, ఇల్లు దాటి, జిల్లా దాటి, ఒంటరిగా ఈ దేశపు ఎల్లలు దాటింది. అమెరికా వెళ్ళేదాకా అష్టకష్టాలు పడింది. అక్కడా కోటి బాధలు భరించింది. తన కలను సాక్షాత్కరింపజేసుకునే దాకా కంటి మీద కునుకైనా ఎరుగని జ్యోతి ఇవాళ తన భర్తకూ,పిల్లలకూ ఒక గౌరవ ప్రదమైన భవిష్యత్తుకు బాటలు వేసింది. ఆమె సాగించిన మహాప్రస్థానాన్ని, ఆమె జీవితంలో అంబేద్కర్ యూనివర్సిటీకున్న స్థానాన్ని ఆమె మాటల్లోనే విందాం రండి –
అంబేద్కర్ యూనివర్సిటీ నాకేమిచ్చిందో తెలుసుకోవాలంటే నేను ఎక్కడినుంచి జీవితం మొదలుపెట్టానో తెలియాలి. విధి నన్నెక్కడికి చేర్చిందో చెప్పాలి.సన్ను నేను ఎక్కడికి చేర్చుకోగలిగానో చెప్పాలి. స్త్రీ చుట్టూ ముసురుకునేచీకట్లనూ చూపాలి. కాలం చేసే పరిహాసాన్ని వినాలి. నవ్వుకుంటూ వీటిని నేనుదాటిన విధానం చూడాలి.
అమ్మ లేదని చెప్పి హాస్టల్లో
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందట. అమ్మాయి పుట్టగానే సమస్యలు ఇంకా గుబాళిస్తాయి. నేను వరంగల్ జిల్లా నర్సింహులగూడెంలో పుట్టాను. మా అమ్మానాన్నలకు మేం ఐదుగురం, నాన్న టీచర్. మాది పేద కుటుంబం. ఆర్థికసమస్యలకు తోడుగా 1975, ఎమర్జెన్సీ సమయంలో నాన్న ఉద్యోగం పోయింది.చెప్పాగా… సమస్యల గుబాళింపు మొదలయ్యింది. నాన్న నిరుద్యోగం. ఆపై కుటుంబ భారం, నన్ను ఎక్కడైనా హాస్టల్లో చేరిస్తే బావుంటుందని నాన్న ఆలోచన. కాని మాది రెడ్డి ఫ్యామిలీ. అగ్రకులం. హాస్టల్లో చేరే అవకాశంలేదు. బీసీ హాస్టల్లో నాన్న ప్రయత్నం చేశాడు కానీ లాభం లేకపోయింది.అప్పటికి నా వయస్సు తొమ్మిది సంవత్సరాలు. అయినా నాకు కుటుంబ పరిస్థితి అర్థం అవుతోంది. నాన్న తిరిగి తిరిగి విసుగు చెందాడు. హన్మకొండలో ‘బాలసదనం’ అనే హాస్టల్ ఉందని నాన్న స్నేహితుడి ద్వారా తెలిసింది. కానీ అక్కడ బీసీ, ఎన్సీ పిల్లలకు, అమ్మా, నాన్నలేనివారికి మాత్రమే ప్రవేశం. ఇక్కడ జీవితం విషాదకరమైన మలుపు తిరిగింది.జీవితం బెత్తంతో కొట్టి పాఠాలు నేర్చుతుందంటారు. అది నా జీవితంలో మొదటిదెబ్బ. అప్పటికే విసిగిపోయిన నాన్న నాకు ‘అమ్మ లేదని’ చెప్పి బాలసదనంలో చేర్పించాడు. నేను ‘అమ్మలేని దానిలా’ హాస్టల్లో చేరుతోంటే నా మీద నాకేజాలి, అసహ్యం, కసి, ద్వేషం, కోపం. పని మనసును మెత్తగా కోసేసినసంఘటన అది… గుండె వక్కలైంది.
Media Attributions
- Anil Jyothi – photograph by DrBRAOU
అనిల్ జ్యోతి