"

2 అక్షరానికి అభినందన…

మా మేడమ్ శాంతాసిన్హా కు మెగసెనె అవార్డు వచ్చింది. ఆ సందర్భంగా సెంట్రల్ యూనివర్సిటీలో సన్మానం ఏర్పాటుచేశారు. మా జీవితాలను మార్చేసిన ఆమె గురించి నాలుగు మాటలు మాట్లాడాలని చాలా అనిపించింది. దానికోసం బాగా ప్రయత్నించా. పెద్ద సభ, పెద్ద వాళ్ళంతా వస్తారు. అవకాశం దొరుకుతుందా అనిపించింది. చివరికి పుష్పగుచ్ఛం అయినా ఇవ్వాలని తాపత్రయపడ్డా. మొత్తానికి శాంతాసిణానే కలిసి నా కోరిక చెప్పా. ఆమె వైస్‌చాన్సలర్‌తో మాట్లాడి రెండు నిమిషాలు
సమయం ఇప్పించారు. సభ అయిపోవచ్చింది. చివర రెండు నిమిషాలు నేను మాట్లాడాను. దాదాపు 500 మంది ఉన్నారు. అంతా పెద్దవాళ్ళు… మాజీ వైస్ఛాన్సలర్లు, మేధావులు,…హాలంతా నిండిపోయి ఉంది. భయం, భయంగానే నా కధంతా చెప్పా.శాంతాసిన్హా ఎలా సాయం చేశారో… మా జీవితాలు ఎలా మార్చాలో చెప్పాను. ఉద్వేగం అపుకోలేక అక్కడే ఏడ్చేశా. అందరూ శ్రద్ధగా విన్నారు. నా మాటలు వింటారని నేను ఊహించలేదు. మాట్లాడి కిందకు దిగుతుంటే చప్పట్లు…కొందరు చేతులు కలిపి అభినందించారు. కొందరు తమ గుండెలకు హత్తుకుని అశీర్వదించారు. నా జీవితంలో ఎప్పటికీ మరచిపో లేని అపూర్వమైన సంఘటన అది. చదువు ఇంత ఆనందాన్ని తెచ్చిపెడుతుందా అనిపించింది. అందరూ నన్ను గుర్తించారు. అభినందించారు. ఆశీర్వదించారు. చదువును సమాజం గుర్తిస్తుందని నాకు తెలియజెప్పిన మొదటి సంఘటన అది.

నా బాటలో నా భార్య కూడా…

ఆనాటి నుంచి నాకు చదువు రుచి తెలిసింది. ఆ ఉత్సాహంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కష్టపడి చదివా. ఎంఏ సోషియాలజీ ఫస్ట్ ఇయర్లో డిస్టింక్షన్ వచ్చింది. రెండో సంవత్సరంలో 65 శాతం మార్కులతో పాసయ్యాను.ఇక చదువును వదిలిపెట్టదలచుకోలేదు. ఎంఫి్‌ల్, పీహెచ్‌డీ చేయాలన్న కోరిక ఉంది. దానికి కాస్త ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. కానీ నాకదే కష్టం. తెలుగైతేఎలాగోలా కష్టపడి అర్థం చేసుకున్నా కానీ, ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టమవుతోంది. ఇప్పుడిప్పుడే ఇంగ్లీష్‌పై శ్రద్ధ పెట్టాను. ఇప్పుడు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యంలో ఎంఏ చేస్తున్నాను. జీవితాంతం చదువుతూనే ఉండాలన్నదే నా కోరిక. చిన్నప్పుడు అవకాశం లేదు… ఇప్పుడు నేర్చుకోవాలన్న తపన. శ్రామిక విద్యాపీఠం నుంచి కంప్యూటర్ కోర్సుచేశా. 93 శాతం మార్కులతో పాసయ్యాను. ఎప్పటికైనా పీహెచ్‌డీ చేయాలన్నదే నా లక్ష్యం. సెంట్రల్ యూనివర్సిటీలో శానిటేషన్, గెస్ట్‌హౌస్, హాస్టల్లో పనిచేసిన నేను ఇప్పుడు ఎకనామిక్స్ విభాగంలో అటెండర్‌గా పని చేస్తున్నాను. డిపార్ట్‌మెంట్ పరీక్షలు రాసి ఇంకా పైకి ఎదగాలని ప్రయత్నం. ఒకసారి సంసారంలో పడ్డాక చదువుకోవడం చాలా కష్టం. నాకు ఒక పాప, బాబు.ఇప్పుడు ముగ్గురు కలిసి చదువుకుంటున్నాం. ఇంగ్లీష్‌లో నాకు తెలియనివి పాప చెబుతూ ఉంటుంది. అప్పుడు నాకు గర్వంగా, ఆనందంగా ఉంటుంది. నా కథ వారికి చెప్పి బాగా చదువుకోవాలని ప్రోత్సహిస్తుంటాను. వాళ్ళేకారు. నా సహోద్యోగులు చాలామందిని అంబేద్కర్ యూనివర్సిటీలో చేర్పించాను. బాల్యంలో బడికి వెళ్ళలేని మా జీవితాల్లో అంబేద్కర్ యూనివర్సిటీ గొప్ప మార్పును తెస్తోంది. చదువునే మా దగ్గరికి తెస్తోంది. ఇంకేం కావాలి. ఇలాంటి అవకాశాలు ఉపయోగించుకోవాలని అందరికీ చెబుతుంటాను. మా ఆవిడను కూడా చేర్పించా. ఆమె ఇప్పుడు డిగ్రీ చేస్తోంది.

“సమాజం గురించీ, మనుషుల గురించీ మా బతుకుల గురించీ, నా
బాల్యం గురించీ బాగా ఆలోచనలు ఉండేవి. వీటన్నింటిపై అధ్యయనం
చేయాలంటే సోషియాలజీ చదవాలని యూనివర్సిటీ స్టూడెంట్స్
అంటుండేవారు. ఎలాగైనా సోషియాలజీ చదవాలనుకున్నా.”

చదువిచ్చిన గారవం…

నా బాల్యం, ఊరు, ఆ తిప్పలు గుర్తుకు వస్తే బాధగా ఉంటుంది. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అప్పుడు శాంతాసిన్హాలాగా ఎవరైనా సాయం చేస్తేనే బయటపడతారు. నేను బాగా సెటిలైతే వారికి ఏమైనా చెయ్యాలని అనిపిస్తుంది. ఏదైనా ఎన్జీవో ఏర్పాటు చేయాలనుంటుంది. నేను స్థిరపడ్డాక తప్పకుండా ఏదైనా సాయం చేస్తా, ఇప్పుడు ఊరికి వెళితే నన్ను ఎంతో గౌరవిస్తారు. రాజధానికి దగ్గరగా ఉందనే కానీ మా ఊర్లో టెన్త్ పాసైతే గొప్ప. చదువులో అంతగా వెనుకబడి ఉంటుంది. నన్ను అప్పుడు ‘జీతా’నికి పెట్టుకున్నవారే ఇప్పుడు గుర్తిస్తారు, గౌరవిస్తారు. ఎంఏ పాసయ్యాడని, ఉద్యోగం చేస్తున్నాడని మర్యాద చేస్తారు, నలుగురికి స్ఫూర్తిగా నన్ను చూపుతారు. ఇదంతా నాకు ఆనందంగా ఉంటుంది. చదువు నాకిచ్చిన గౌరవం ఇది.

మా నాన్న ఉంటే బాగుండేది…ఇప్పుడు మా ఊరి నుంచి నాకు ఫోన్లు వస్తుంటాయి. ‘మా పిల్లవాడు టెన్త్ పాసయ్యాడు, తర్వాత ఏం చేయిస్తే బావుంటుంది’ అని నన్ను సలహాలు అడుగుతుంటారు. పద్ధెనిమిదేళ్ళు అక్షరజ్ఞానం లేకుండా పెరిగిన నేను ఇప్పుడుచదువు గురించి సలహాలు ఇస్తున్నాను. ఇది తలచుకుంటే నాకు గమ్మత్తుగా, గర్వంగా ఉంటుంది. మా నాయన బతికిఉంటే ఎంతో ఆనందపడేవాడు. చిన్నప్పుడు ఆయన మమ్మల్ని ఎంత బాగా చూసేవాడో, ఆయన తినే పిడికెడంతతిండిలో మాకు కడుపులు నింపడానికి మిగిల్చేవాడు. చాలాసార్లు మేం తిన్నాకే తినేవాడు. అంత ఇబ్బందుల్లో కూడాఎంతో ప్రేమ. అప్పులు చేసి అవి తీర్చడానికి నానా యాతనపడేవాడే కానీ, మా కడుపులు మాడనిచ్చేవాడు కాదు.నిజానికి అప్పుడు తినడానికేముండేది… జొన్న గటక, రొట్టె… కలిసి తిని బతికాం. ఇప్పటి నా జీవితాన్ని చూస్తే ఆయనఎంతో ఆనందపడేవాడు.

ప్రయత్నంలోనే ఆనందంఉంది. మన గమ్యస్థానానికిచేరే మార్గంలో అనేక మనోహరమైన దృశ్యాలనుసందర్శించగలం.-మహాత్మాగాంధీ

అదెంతో ఉపయోగం…అంబేద్కర్ యూనివర్సిటీ మెటీరియల్ ఈజీగా ఉన్నా ఎంతో స్టాండర్డ్‌గా ఉంటుంది. అది చదివిన వారు ఎంతోమంది సివిల్స్ రాశారు. నేను కూడా రాశా. గ్రూప్-ఈ, గ్రూప్-ఈఈలు కూడా ప్రయత్నం చేశా. అలాంటివి ప్రిపేర్ కావాలంటే చాలా సమయం కావాలి. నా ఉద్యోగ సమయం అయిపోయాక నాలుగు గంటల సమయం మిగులుతుంది. కుటుంబ సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. వాటిలోనే సమయం మిగుల్చుకుని చదువుతుంటాను. రోజుకు కనీసం రెండు గంటలైనా చదవాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. పిల్లలతో పాటు చదువుకోవడం అదో తృప్తి. చదువు రుచి దొరికింది. ఒకసారి రుచి దొరికాక చదువు వదిలేయడం కష్టం. కాస్త సమయం దొరికినా లైబ్రరీలో గడుపుతాను. సెంట్రల్ యూనివర్సిటీలో అమూల్యమైన పుస్తకాలున్నాయి. నిజానికి రెండేళ్ళ సెలవుపెట్టి బాగా చదవాలన్నది కోరిక. ఇంకా అధికారుల దృష్టికి తీసుకెళ్ళలేదు. ఆర్థిక విషయాలు కూడా చూసుకోవాలి కదా! ఎంత కష్టమైనా సరే చదవడం మాత్రం ఆపను. ఇక్కడితో ఆగను!

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

మేముసైతం... Copyright © 2009 by డా ఘంటా చక్రపాణి is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.